భాష బాల వ్యాకరణము పీఠిక
ఆంధ్రభాషకు లక్షణ గ్రంథములు ప్రాచీనులు చేసినవని పెక్కులు కానఁబడుచున్నవి. కొన్ని లక్షణగ్రంథముల పేర్లు మాత్ర మిప్పుడు వినఁబడుచున్నవి. కానఁబడు గ్రంథములందు సంస్కృతసమములకు లక్షణములు బహుతరముగా రచింపఁబడినవి గాని తక్కినభాషకు విశేషాకారముగా రచింపఁబడినవికావు కాఁబట్టి యా లక్షణ గ్రంథములు చదువువారికి నిస్సందేహముగా వచనరచన సేయుకౌశలము చిరకాలము బహులక్ష్యములందుఁ బరిశ్రమము చేయక రానేరాదు. భాషా సమిష్టికి లక్షణగ్రంథము కుదిరిన పక్షమం దంతశ్రమపడఁ బనిలేదు. తుదకు లక్ష్యపరిజ్ఞానము చాలని లక్షణపరిజ్ఞాన మంత శ్లాఘ్యము కాదు గాని తుదముట్ట సర్వలక్షణ పరిజ్ఞానము లక్ష్యపరిజ్ఞానముచేతనే సాధించుట మిక్కిలి దుష్కరము. కాఁబట్టి యిట్టికొఱఁత వారింపఁ బూని పెక్కులక్ష్యములు పలుమాఱు సావధానముఁగా బరిశీలించి రచనాప్రణాళిక నిర్ణయించుకొని నానేర్పుకొలఁదిని సంస్కృతభాషలో సూత్రగ్రంథ మొకటి కావించితిని. ఆ గ్రంథము బాలురకు సుసాధము గాకుండుటవలన దానియందలి సూత్రములు కొన్ని తెనిఁగించి ప్రకృత గ్రంథరూపమున రచించినాఁడ.

క. మానితపునడకపేరిమి
మానసమున కింపుఁ బెంప మనునంచలకున్‌
బోనిడి నీరసనీరము
జానుగ క్షీరంబు గొనుట సహజముకాదే.

శ్రీ హయగ్రీవాయ నమః
క. శ్రీలతకుం బ్రాఁకయి వృష
శైలంబున వెలసి తనదుచాయ కెలయు ధ
న్యాళి దగ మాన్చి కోర్కులు
చాలంగా నొసఁగు కల్పసాలముఁ గొలుతున్‌.
క. అనయము లలితోక్తులతో
నొనరుపడం గూర్చి లక్ష్యయోజన మొప్పం
గను బాలవ్యాకరణం
బనఁగా లక్షణ మొనర్తు నాంధ్రంబునకున్‌.
క. దిక్ప్రదర్శనముగఁ దెలిపెద నిందు ల
క్షణము గానఁ బూర్వకవుల లక్ష్య
ములను లాఁతిలక్ష్మములఁ గాంచి తక్కుల
క్షణ మెఱింగి కొనుఁడు చతురమతులు.
AndhraBharati AMdhra bhArati - bhAshha - bAla vyAkaraNamu - pIThika - chinnaya sUri - andhra telugu tenugu ( telugu andhra )