భాష బాల వ్యాకరణము తద్ధిత పరిచ్ఛేదము
1. తనవర్ణకంబు త్వార్థంబునం దగు.
త్వార్థంబనఁగా భావంబు. ప్రకృతి జన్యబోధంబునందుఁ బ్రకారంబు భావంబు.
రాముని తనము - రాముతనము - మనుమని తనము - సీతతనము - గొప్పతనము - కొఱతనము - నల్లఁదనము - పుల్లదనము.
2. ఇట విశేషంబుత్సర్గంబునకు విభాషను బాధకం బగు.
స్పష్టము.
3. చిన్నాదులకు ఱిక వర్ణం బగు.
చిన్నఱికము - కన్నెఱికము.
చిన్న - కన్నె - చుట్టము - దొంగ - పేద - మిండ - లంజె - ఇత్యాదులు చిన్నాదులు.
4. ఉత్వంబున కత్వంబు ఱికము పరంబగునపు డగు.
తొత్తఱికము - వెడ్డఱికము - వెజ్జఱికము.
5. పేర్వాదుల కిమివర్ణకం బగు.
పేరిమి - కడిమి.
పేరు - కడు - మ్రుచ్చు - మేలు - చెలి- పోఁడి - వాఁడి - వేఁడి ఇత్యాదులు పేర్వాదులు.
6. నవర్ణకంబు గుణవచనంబు లగు నల్లాదుల కగు.
నల్లన - తెల్లన.
నల్ల - తెల్ల - పచ్చ- ఎఱ్ఱ - చామ - తియ్య - కమ్మ - పుల్ల - చప్ప - విన్న - తిన్న - అల్ల - ఒయ్య - తిమ్మ - చక్క - వ్రేఁక - ఇత్యాదులు నల్లాదులు.
7. ఇక వర్ణకం బగ్గలాదుల కగు.
అగ్గలిక - ఒమ్మిక - అగ్గము - ఒమ్ము.
8. మగఁటిమ్యాదులు యథాప్రయోగంబుగ గ్రాహ్యంబులు.
మగఁటిమి - మగతనము - పేబఱిమి.
ఒజ్జనము - కోటరము - కోడండ్రము - కోడంట్రికము - కోడఱికము - కోమలికము - చెలికారము - తెలుపు - ఎఱుపు - పసుపు - నలుపు.
ఱికాదులు రాని పక్షమందుఁ దన ప్రత్యయం బన్నింటికగు.
చిన్నతనము - మ్రుచ్చుఁదనము - నల్లదనము - అగ్గలంపుఁదనము - ఒజ్జతనము.
9. అరమరాదులకు స్వార్థంబునం దికవర్ణకం బగు.
అరమరిక - ఆమిక.
అరమర - ఆము - అల్లిబిల్లి - గండి - నడవడి - నాడు - నివ్వాళి - పొత్తి - మాని - మెలి - వాలు - ఇత్యాదు లరమరాదులు.
10. ఉకవర్ణకంబు చిఱుతాదులకు స్వార్థంబునం దగు.
చిఱుతుక - నాతుక.
చిఱుత - నాతి - నెలఁత - మెలఁత - పడఁతి - మడఁతి - పొలఁతి - వెలఁది - నిప్పు - ఎమ్ము ఇత్యాదులు చిఱుతాదులు.
11. కా కత్తియ వర్ణకంబులు పుంస్త్వస్త్రీత్వంబుల మతుబర్థంబునం దాటాదుల కగు.
కాప్రత్యయాంతంబునకు మగాది గణగణనంబునం జేసి డుఙ్ఙగు.
ఆటకాఁడు - ఆటకత్తియ.
ఆట - అడపము - ఎమ్మె - ఒయారము - కటారి - కొల్ల - చెలిమి - చేరువ - చొరవ - జట్టి - జామర - జూదము - తిండి - తేర - దొద్ద - నీటు - నేస్తము - బేరము - వగ - విలు - వెచ్చము - సొగసు - ఇత్యాదు లాటాదులు.
12. కా కత్తియల కకారంబునకు గకారంబు కొండొకచోఁ గానంబడియెడి.
అందగాఁడు - అందగత్తియ, కొండెగాఁడు - కొండెగత్తియ, బేరగాఁడు - బేరగత్తియ ఇత్యాదులు.
13. కా కత్తియలు కొండొకవానికి స్వార్థంబునం జూపట్టెడు.
చెలికాఁడు - చెలికత్తియ, హెగ్గడికాఁడు - హెగ్గడికత్తియ.
14. కా వర్ణకంబు తిర్యక్కులకుం గానంబడియెడి.
ఇబ్బందిగాఁడు - ఒంటిగాఁడు - కొమ్ముగాఁడు - పరికాఁడు - ఇత్యాదులు మృగవిశేష వాచకంబులు.
15. అటమటాదులకు మతుబర్థంబునం దీవర్ణకంబు పుంస్త్వంబునం దగు.
ఈ ప్రత్యయాంతంబు మగాదిగణంబు.
అటమటీఁడు - కమ్మతీఁడు.
అటమటము - కమ్మతము - కన్నడము - కొండెము - బానసము - బూటకము - మందడి - మన్నెము - సుంకము.
ఉక్కివంబునకు వలోపంబునగు.
ఉక్కీఁడు ఇత్యాదులు.
16. ఈ ప్రత్యయంబు కొన్నింటికి స్వార్థంబునం దగు.
మొక్కలీఁడు - కల్లరీఁడు.
17. అరివర్ణకంబు మతుబర్థంబున జాలాదుల కగు.
జాలరి - ఒఱపరి.
జాల - ఒఱపు - కల్ల - చదువు - జూదము - టక్కు - తగవు - తీరుపు - తెంపు - తెరువు - నేరువు - మతకము - వెరపు - వేఁట - సిగ్గు - సుంకము ఇత్యాదులు.
18. ఇ వర్ణకం బోయారాదులకు మతుబర్థంబునం దగు.
ఓయారి - అక్కసి.
ఓయారము - అక్కసము - కడలు - చాగము - జోగము - మతకము - తుటారము - బండారము - బిత్తరము - బిటారము - బేహారము - మచ్చరము - మిటారము - విన్నాణము - వెక్కసము - ఇత్యాదులు.
19. త వర్ణకంబు కులవాచకంబునకు స్త్రీవాచ్యం బగునపుడు మతుబర్థంబునం దగు.
కొఱవత - చాకిత.
కొఱవ - చాకి - బోయ - వానె - వ్రే - సారె -ఇత్యాదులు కులవాచకంబులు.
20. త వర్ణకంబు పరంబగుచో నొకానొకచో నెత్వంబు చూపట్టెడు.
చెంచెత - మాలెత.
21. యువతి విటీ రజస్వలలు గుబ్బెత మిండత ముట్టుతలు నాఁబడుదురు.
స్పష్టము.
22. వగాదులకు బహువచనాంతంబులకు స్త్రీవాచ్యం బగునపుడు మత్వర్థంబునం దాఁడివర్ణకం బగు.
వగలాఁడి.
వగ - చిన్నె - కులుకు - వన్నె - దొమ్మి - ఎమ్మె - ఇత్యాదులు వగాదులు.
23. వగాదులకు బహువచనంబులకుఁ బుంస్త్వంబున మతుబర్థం బాకారం బగు.
అప్రత్యయాంతంబు మగాదిగణంబు.
వగలాఁడు - చిన్నెలాఁడు.
24. ముక్కు లోనగువానికిఁ దదభావ ద్యోతకం బయి మతుబర్థంబునం దిఁడివర్ణకం బగు.
ముక్కిఁడి. ముక్కు లేనివాఁడని యర్థము.
ముక్కు - వాలు - వెరవు - సిగ్గు ఇత్యాదులు ప్రయోగంబుల నెఱుంగునది.
25. మానార్థంబున కేకత్వంబునం దెఁడువర్ణకం బగు.
తూమెఁడు - ముంతెఁడు - ఎత్తెఁడు - వీసెఁడు - జేనెఁడు - మూరెఁడు - కుందెఁడు - గంపెఁడు.
26. ఎఁడువర్ణకంబు పరంబగునపుడు లివర్ణంబు లోపించు.
కమికెఁడు - కొడిదెఁడు - దోసెఁడు - పిడికెఁడు - పుడిసెఁడు, సందెఁడు.
27. దఘ్నార్థంబున బంటి కొలఁదు లగు.
మోకాఁలిబంటి - మోకాఁలికొలఁది, ఱొమ్ముబంటి - ఱొమ్ముకొలఁది
28. అర్థవిశేషంబుల వర్ణకాంతరంబులును మహత్ప్రయోగంబుల నెఱుంగునది.
మంటమారి - తిండిపోతు - తాచ్ఛీల్యంబున మారి పోతు వర్ణకంబులు.
అడప - తాంబూలకరండవాహి - మతుబర్థంబునం దప్రత్యయంబు పెండ్లము - ఊఢ - పెండ్లి శబ్దంబునకు దము ప్రత్యయంబు. ఇత్యాదు లూహ్యంబులు.
AndhraBharati AMdhra bhArati - bhAshha - bAla vyAkaraNamu - taddhita parichchhEdamu - chinnaya sUri - andhra telugu tenugu ( telugu andhra )