భాష బాల వ్యాకరణము తత్సమ పరిచ్ఛేదము
1 డు-ము-వు-లు ప్రథమ.
2 నువర్ణంబు ద్వితీయ.
3 చేత-తోడ తృతీయ.
4 కొఱకు-కయి చతుర్థి.
5 వలన-కంటె-పట్టి పంచమి.
6 కు-యొక్క-లోపల షష్ఠి.
7 అందు-న సప్తమి.
8 తృతీయాదులకు నుగాగమం బగు.
రాముని చేతను, రాముని తోడను, రాముని కొఱకును, రాముని వలనను, రాముని కంటెను, రామునకును, రామునియందును.
9 కయి పట్టి యొక్క లకు నుగాగమంబు లేదు.
రామునికయి, జ్ఞానముఁబట్టి, రామునియొక్క
10 చేత తోడ లోపల వర్ణకంబుల ప్రథమాక్షరంబులు వైకల్పికంబుగా శేషించు.
ప్రత్యయంబు వర్ణకంబని ప్రాచీనులు వ్యవహరింతురు. రామునిచే, రామునితో, వనములలో
11 డు-ము-వు-న లేకవచనంబులు.
ఏకత్వసంఖ్యను బోధించు ప్రత్యయం బేకవచనంబు. రాముఁడు, సోముఁడు, వనము, ధనము, ధేనువు, భానువు.
12 లు వర్ణంబు బహువచనంబు.
బహుత్వ సంఖ్యను బోధించు ప్రత్యయంబు బహువచనంబు. రాములు, సోములు, వనములు, ధనములు, ధేనువులు, భానువులు.
13 తక్కినవి యుభయంబులు.
మిగిలిన ప్రత్యయము లేకత్వ బహుత్వములకు బోధకములని యర్థము.
వనమును, వనములను, వనముచేతను, వనములచేతను, వనముతోడను, వనములతోడను.
14 ఓ యామంత్రణంబునం దగు.
ఓయనుశబ్దము సంబోధనంబునం దగునని యర్థము.
ఇది సంబోధ్యవాచకంబునకు ముందే ప్రయోగింపబడును.
ఓశబ్దంబు తొఱంగియు సంబోధ్యవాచకంబు ప్రయోగింపవచ్చును.
ఓ రాముఁడ, ఓ రాములార, రాముఁడ, రాములార.
15 ఓ శబ్దంబునకుం బురుష నీచ స్త్రీ పురుషామంత్రణంబులందు యి-సి-రి వర్ణంబులు విభాష నంతాగమంబు లగు.
ఓయి రాముఁడ - ఓ రాముఁడ, ఓసి దుష్టురాల - ఓ దుష్టురాల, ఓరి దుష్టుఁడ - ఓ దుష్టుఁడ.
16 ఓరి యోసి మైత్రియందుం గలవు.
ఓరి చిన్నికృష్ణ, ఓసి ముద్దుబాల.
ఓయి మొదలయిన వానికి స్వతంత్ర ప్రయోగముం గలదు.
సంతతియె యోయి, ఓసిపోవే, ఓరోరి.
ఇంకెందుఁబోవచ్చు - వీనికి దీర్ఘంబుం గలదు.
ఓయీ విప్రకులావతంస, ఓరి దుష్టనిశాటులార, ఓసీ ననుఁ జెనకరాకు.
17 స్త్రీ తిర్యగ్జడ భిన్నంబులును వాని విశేషణంబులును మహత్తులనంబడు.
తిర్యక్కులనఁగాఁ బశుపక్ష్యాదులు. జడము లనఁగా నచేతనములు.
18 క్లీబంబులు, మిత్రాదులు, మహద్వాచకంబులు విభాషం బుంలింగ తుల్యంబు లగు.
మిత్రశరణ ప్రధాన పాత్రాదులు మిత్రాదులు.
19 ఙిత్తు బిందుపూర్వం బగు.
ఙకార మిత్తుగాఁ గలదానికి ముందు బిందువు వచ్చునని యర్థము.
కార్యార్థము ప్రత్యయాదులందు నిబద్ధమయి ప్రయోగించునపుడు మానంబడు వర్ణ మిత్తు నాఁబడు.
ఉదాహరణము మీఁద స్పష్టంబగు.
20 డుఙ్వర్ణకంబునకుం బ్రకృతియయినది డుమంతం బనంబడు.
స్పష్టము.
21 పుంలింగంబయి, మహద్వాచకం బయిన నామంబు తుది యత్వంబున కుత్వం బగు.
నామంబనఁగాఁ బ్రాతిపదికము.
డిద్ధ, రామ, భార్గవ, రాజపురుష - ఇట్టివి ప్రాతిపదికములు.
డిద్ధు, రాము, భార్గవు, రాజపురుషు.
22 పుంలింగ మగు మహద్వాచకమునకు డుఙ్ఙగు.
ఇచ్చట డుఙ్ఙను దానియందు ఙకార మిత్తుగావున ఙిత్తు బిందుపూర్వంబగునను సూత్రముచేత డువర్ణమునకు ముందు సున్న వచ్చును. బిమ్మట ఙకారము లోపించును.
డిద్దుఁడు - డిద్దుండు, రాముఁడు - రాముండు, భార్గవుఁడు - భార్గవుండు.
23 డుమంతంబునకు ద్వితీయాద్యేకవచనంబు పరంబగునపుడు నిగాగమంబు సర్వత్ర విభాష నగు.
రామునిని - రాముని, రామునిచేతను - రాముచేతను, రామునికిని - రామునకును.
సర్వత్ర యనుట నగాగమ బాధనార్థము.
24 అనుదంత మగు తెనుఁగు డుమంతమునకు నిగాగమము నిత్యముగా నగును.
మగనిని - మగనిచేతను - మగనికిని అనుదంతంబను పర్వుదానముచేత
తమ్మునిని - తమ్ముని, తమ్మునిచేతను - తమ్ముచేతను, అల్లునిని - అల్లుని, అల్లునిచేతను - అల్లుచేతను, బల్లిదునిని - బల్లిదుని, బల్లిదుని చేతను - బల్లిదుచేతను ఇత్యాదులందు నిగాగమంబు పాక్షికంబని యెఱుఁగునది.
25 డుమంతంబుమీఁది నువర్ణకంబు నుత్వంబున కిత్వం బగు.
నువర్ణంబు ద్వితీయ యను సూత్రముచేత రామును, అని ప్రాప్తింపఁగా
నీ సూత్రముచేత నువర్ణకోత్వమున కిత్వంబు సిద్ధించె.
రాముని, భార్గవుని.
26 ఇకారంబుమీఁది కు ను వు క్రియావిభక్తుల యత్వంబున కిత్వం బగు.
హరిని - హరికిని, శ్రీని - శ్రీకిని, వారిని - వారికిని.
27 ఈ ధాతు యుష్మదర్థంబుల మీఁది వాని యుత్వంబున కిత్వంబు రాదు.
ఈరు, ఈవు, ఈను, ఈము, ఈకు, నీకు, మీకు.
28 కువర్ణకంబు పరంబగునపు డుకార ఋకారంబులకు నగాగమం బగు.
రామునకును, విష్ణువునకును, సవితృనకును, విధాతృనకును.
29 ఉకార ఋకారంబుల కందు వర్ణకము పరంబగునపుడు నుగాగమం బగు.
రామునందును, విష్ణునందును, విధాతృనందును.
30 ఆగమ ము వు వర్ణంబుల కందువర్ణకము పరంబగునపుడు నుగాగమంబు విభాషనగు.
వనమునందును - వనమందును, ధేనువునందును - ధేనువందును.
31 బహుత్వంబున ద్వితీయాది విభక్తులకు లడాగమంబగు.
రాములను - రాములచేతను, విధాతృలను - విధాతృలచేతను.
32 సంబోధనంబునం దేకార్థంబయిన పదంబు తుదియుకారంబున కకారంబగు.
ఓ రాముఁడ, ఓ వృక్షమ, ఓ శంభువ, ఓ కొడుక.
33 సంబోధనంబునందుఁ బదంబు తుది యకారేకారంబులకు దీర్ఘంబు విభాషనగు.
ఓ రాముఁడా - ఓ రాముఁడ, ఓ చెలియా - ఓ చెలియ, ఓ హరీ - ఓ హరి, ఓ తండ్రీ - ఓ తండ్రి.
34 కృతోత్కంబగు సంస్కృతనామంబు సంబుద్ధి డుఙ్ఙునకు లోపంబు విభాషనగు.
ఓ రామ, ఓ కృష్ణ.
పూర్వసూత్రముచేత దీర్ఘంబు.
ఓ రామా, ఓ కృష్ణా
సంస్కృత నామంబగుటఁ జేసి ఓ తమ్ముఁడ, ఓ బల్లిదుఁడ ఇత్యాదులందు లోపంబులేదు.
35 ఉదంత సంస్కృతనామంబు మీఁది సంబుద్ధి డుఙ్ఙునకు నూకారంబు ప్లుతం బాదేశంబు విభాషనగు.
ఓ విష్ణూ, ఓ శంభూ.
పక్షంబునందు, విష్ణుఁడ, శంభుఁడ ఇత్యాది.
36 సంబోధనంబునందు బహువచనంబున కారగాగమంబగు.
ఓ రాములార, ఓ కృష్ణులార.
దీనికిం బాక్షికంబుగ దీర్ఘంబగు - ఓ రాములారా, ఓ కృష్ణులారా.
37 మధ్యమపురుష యోగంబునం దార గాగమంబు విభాష నగు.
వినుఁడు బాలకులు - వినుఁడు బాలకులార. వచ్చితిరి కాంతలు - వచ్చితిరి కాంతలార.
అన్నలార మిమ్మునడిగెద నొకమాట.
ఇచ్చట మధ్యమ పురుష యోగంబు లేమింజేసి యారగామంబు నిత్యంబు.
38 అదంతం బయి దీర్ఘ పూర్వలోపధం బయిన మహత్తు మీఁది విభక్తి లకారంబునకు రేఫంబగు.
బాలురు - బాలురను - బాలురచేతను, నృపాలురు - నృపాలురను - నృపాలురచేతను.
దయాళు శబ్దంబున కిట్లు రేఫంబు గానంబడియెడి.
దయాళురు - దయాళురను - దయాళురచేతను.
39 అమహన్నపుంసకముల కదంతములకు మువర్ణకంబగు.
వృక్షము, ఋక్షము; దైవము, కళత్రము, ఆపత్యము; క్లీబంబులు మిత్రాదు లనుసూత్రంబునఁ బాక్షికంబుగం బుంలింగత్వం బతిదేశించుటం జేసి మిత్రాదిశబ్దంబులకు ద్వైరూపం బెఱుంగునది.
మిత్రుఁడు - మిత్రము; శరణుఁడు - శరణము;
40 వానికి మువర్ణ కేతరం బయిన విభక్తి పరంబగునపుడు ముగాగమం బగు.
వృక్షములు - వృక్షమును, ఋక్షములు - ఋక్షమును.
41 మువర్ణకంబునకు విధించు కార్యము ముగాగమంబునకు నగు.
మువర్ణంబునకు విధించు లోపాదేశాది కార్యములు ముగాగమమునకు సహితము వచ్చునని యర్థము.
42 మువర్ణకంబునకు మాముడియేనిం బూర్ణ బిందుపూర్వక బువర్ణంబేని విభాష నగు.
వృక్షము - వృక్షంబు; ఋక్షమ్ము - ఋక్షంబు.
పూర్వ సూత్రముచేత ముగాగమమున కీకార్యంబగు.
వృక్షమ్ములు - వృక్షంబులు; ఋక్షమ్ములు - ఋక్షంబులు.
43 లు ల న లు పరంబులగునపు డొకానొకచో ముగాగమంబునకు లోపంబును,
దత్పూర్వస్వరంబునకు దీర్ఘంబును విభాష నగు.
వజ్రాలు - వజ్రాలను - వజ్రాన, పగడాలు - పగడాలను - పగడాన.
ఒకానొకచోట ననుటచే నీ కార్యంబునకుం బ్రయోగ వైరళ్యంబు సూచింపంబడియె.
44 ఇ గ్లౌరాయుగంతంబుల ప్రథమైక వచనంబునకు లోపంబగు.
ఇకారాంతమునకు, గ్లౌరై శబ్దంబులకు, మఱి యుగాగ మాంతంబులకుం బ్రథమైక వచన లోపంబగు. హరి, గిరి, శ్రీ, ధీ.
45 ఇత్తునకు బహువచనంబు పరంబగునపు డుత్వం బగు.
హరులు, గిరులు, కవులు, కపులు, యామినులు, భామినులు.
తపకరణంబుచే దీర్ఘంబున కుత్వంబు లేదు.
శ్రీలు, స్త్రీలు, లకోరీలు.
46 వికృతియం దికారాంతముల యుపోత్తమేత్వంబునకు బహువచనము పరంబగునపు డుత్వం బగు.
ఇచ్చటవికృతిశబ్దముచే సంస్కృతసమేతరంబు గ్రహింపవలయు.
కలికి - కలుకులు, ములికి - ములుకులు, చెలిమి - చెలుములు, బలిమి - బలుములు.
ఉపోత్తమేత్వంబున కనుటంజేసి జిగి - నిసి ఇత్యాదులం దుత్వంబులేదు.
జిగులు - నిసులు.
47 ర ల డోపధ నవార్దాదుల యుపోత్తమేత్వంబున కుత్వంబు కలుగదు.
పందిరి - పందిరులు; పిడికిలి - పిడికిళులు; రాపిడి - రాపిడులు; తొమ్మిది - తొమ్మిదులు.
48 ఉకారాంత గో శబ్దంబుల కంతట వువర్ణకంబగు.
తరువు - ధేనువు - మధువు - గోవు.
అంతట ననుట స్త్రీలింగ ప్రథమైక వచన లోపబాధనార్థము.
49 వువర్ణకేతరవిభక్తి పరమగుచో నుకారాంతములగు బహుళంబుగా గోశబ్దంబునకు నిత్యంబుగా వుగాగమం బగు.
తరువులు - తరులు - ధేనువులు - ధేనులు - గోవులు.
50 ఉకారాంతం బగు మహత్తునకు వువర్ణకము బహుళముగా నగు.
విష్ణువు - విష్ణుఁడు; శంభువు - శంభుఁడు; వసువు - వసుఁడు.
51 కద్రువ నాగమాత.
కద్రువ - కద్రువలు - కద్రువను - కద్రువలను.
52 ఋకారాంతంబున కత్వంబును స్త్రీ వద్భావంబు నగు.
భ్రాత - జామాత - కర్త - భర్త - హర్త - గంత - హంత.
53 విధాతృ ధాతృ దాతృ సవితృ నేతృ శబ్దంబులకు, మహత్తుల కత్వ స్త్రీ వద్భావంబులు విభాష నగు.
విధాత - విధాతృఁడు, ధాత - ధాతృఁడు, దాత - దాతృడు, సవిత - సవితృఁడు, నేత - నేతృఁడు.
54 నామంబుల తుదిదీర్ఘంబునకు హ్రస్వం బగు.
రమా - రమ, వనితా - వనిత, విద్యా - విద్య, లక్ష్మీ - లక్ష్మి, సేనానీ - సేనాని.
ఇట్లు కృత హ్రస్వములకు హ్రస్వాంతములకుఁ బోలెఁ గార్యంబగు.
లక్ష్ములు - సేనానులు - సిరులు.
55 ఏకాక్షరంబులకు హ్రస్వంబు లేదు.
క్ష్మా - మా - భా - శ్రీ - స్త్రీ - హ్రీ - ధీ - భీ - భ్రూవు.
56 వృద్ధాదుల డుఙ్ఙునకు లోపము విభాష నగు.
వృద్ధు - వృద్ధుఁడు, మూర్ఖు - మూర్ఖుఁడు, నీచు - నీచుఁడు, గృహస్థు - గృహస్థుఁడు, చార్వాకు - చార్వాకుఁడు;
57 స్త్రీలింగంబుల ప్రథమైకవచనంబునకు లోపంబగు.
రమ - క్షమ - వనిత - ఘనత - విద్య - దేవత - మీననేత్ర.
58 చరిత్రాదుల మువర్ణంబునకు లోపంబు బహుళంబుగా నగు.
చరిత్ర - చరిత్రము - చరిత - చరితము - అలక - అభిలాష - అక్షత - ఘోష - తరంగ - భ్రమ - విజృంభణ - వధ - వేగ - స్ఫురణ - హంస ఇత్యాదులు చరిత్రాదులు.
బహుళకమువలన దర్భాదులకు ములోపంబు నిత్యంబు.
దర్భ - పనస ఇత్యాదులు.
59 స్వర్గివాచి దేవసురశబ్దంబు లేకత్వ బహుత్వంబులఁ బ్రయోగింపంబడు.
దేవుఁడు - సకలసురులు.
స్వర్గివాచి యనుటచే భూదేవులు - భూసురుఁడను ప్రయోగంబు లబాధిపత్యంబులయ్యె.
60 సురశబ్దంబు నిత్యంబుగా, నసురశబ్దము వైకల్పికముగా స్త్రీతుల్యంబు లగు; సంస్కృతసమాసంబునఁ గావు.
సురలు - అసుర - అసురుఁడు - నిఖిలసురులు - రావణాసురుఁడు - ఎల్లసురలు - ఎల్లయసురులు - ఎల్లయసురులు.
61 దూతాదులకు స్త్రీత్వంబు బహుళంబుగ నగు.
దూత - దూతుఁడు, యోధ - యోధుఁడు, శుంఠ -శుంఠుఁడు.
బహుళ గ్రహణముచే నమహత్త్వంబునందు స్త్రీత్వంబు నిత్యంబు.
సింగంబుదూత యగు జంబుకంబు.
62 పృథ్వీవాచి భూశబ్దంబునకు భువి యగు.
భువి - భువులు - భువిని - భువులను.
63 నౌశబ్దంబునకు నావ యగు.
నావ - నావలు; మహానావ. కొందఱు నావి యనియు నాదేశంబగు నండ్రు.
64 రై గ్లౌ శబ్దంబుల కోత్వంబు విభాష నగు.
ఇగ్లౌసూత్రముచేతం బ్రథమైక వచనమునకు లోపంబు.
రో - రై, గ్లో - గ్లౌ.
65 ఐకారం బీతుల్యంబు.
రైని - రైకి, కైని - కైకి, పైని - పైకి.
66 కంధరాదులు క్లీబతుల్యంబులు బహుళంబుగా నగు.
కంధరము - కంధర.
విధా శబ్దమునకుఁ గ్లీబతుల్యత్వంబు నిత్యంబు - విధము.
కంధరా నాశికా భిక్షా దంష్ట్రా గ్రీవాపాదుకోల్కా ప్రభృతులు కంధరాదులు.

హలంత ప్రకరణము

67 హలంతంబు ప్రథమైక వచనాంతతుల్యం బిందునామంబగు.
రుక్‌, రాట్‌, మరుత్‌, వీరుత్‌, కర్మ, వర్మ శ్వశబ్దంబు తప్ప నకారాంతంబు లెల్లం బ్రథమైకవచన తుల్యంబులే యగునని యెఱుంగునది.
68 ఉగాగమంబును ద్విత్వంబును దుది హల్లున కగు.
ఉగాగమాంతంబుల కిగ్లౌసూత్రముచేఁ బ్రథమైక వచన లోపంబగు.
రుక్కు, రాట్టు, మరుత్తు, వీరుత్తు.
ఉగాగమంబు లేమింజేసి యిచటనాతంబుల కస్త్రీ లింగంబులకుం బ్రథమైక వచన లోపంబులేదు.
కర్మము, వర్మము, చర్మము, సుధన్వుఁడు, సుత్రాముఁడు.
69 దీర్ఘంబుమీఁది హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు.
వాక్కు - వాకు, స్వరాట్టు - స్వరాటు.
70 మతుబాదికంబు ద్వితీయైక వచనాంతతుల్యంబు నామం బగు.
శ్రీమంతమ్‌, గుణవంతమ్‌, విద్వాంసమ్‌, అనడ్వాహమ్‌, శ్వానమ్‌, ఉపానహమ్‌, అప్సరసమ్‌ ఇత్యాదులు.
71 దాని యంతిమ మకారంబునకు లోపం బగు.
శ్రీమంత, గుణవంత, విద్వాంస, అనడ్వాహ ఇత్యాది.
వీని కజంతములకుం బోలె డుఙాదులు యథా యోగ్యంబుగనగు.
అతఁడు శ్రీమంతుఁడు. ఇతఁడు గుణవంతుఁడు, వాని వంశము శ్రీమంతము, వీని వంశము గుణవంతము.
విద్వాంసుఁడు - విద్వాంసము, అనడ్వాహము - శ్వానము - అప్సరస.
వక్ష్యమాణ లక్షణంబుచే స్త్రీత్వంబున మతుబాదులు ఙ్యతంబులే యిందు గ్రహింపఁబడు.
శ్రీమతి - గుణవతి - విదుషి - శుని.
మహతీవాచ్యం బగునపుడు శ్రీమంతురాలు - గుణవంతురాలు - విద్వాంసురాలనియుఁ బ్రయోగింపఁదగు.
72 ముదాదులకుఁ బ్రథమైకవచనలోపంబు లేదు.
ముదము - ఉపానహము - స్రజము.
73 ఋత్విగాదులు ద్వితీయైక వచనాంతతుల్యంబులు విభాష నగు.
ఋత్విజుఁడు - ఋత్విక్కు, నీవృతము - నీవృత్తు. ఋత్విగాదికం బాకృతిగణంబు.
74 ఒకానొకచో మహత్త్వంబునందు మతుప్తకారంబున కానాదేశంబు విభాష నగు.
హనుమానుఁడు - హనుమంతుఁడు, భగవానుఁడు - భగవంతుఁడు ఇత్యాది.
75 విశ్వకర్మాదులకు స్త్రీత్వం బగు.
స్త్రీ లింగత్వాదిదేశంబుచేత నుత్వడుఙ్ఙులు లేవని యెఱుంగునది.
విశ్వకర్మ - కృష్ణవర్త్మ - అశ్వత్థామ - యువ - యజ్వ ఇత్యాదులు.
76 మహద్వాచక మయి పుంలింగం బగు బ్రహ్మశబ్దమునకు స్త్రీత్వంబగు.
బ్రహ్మ - ఈశబ్దము చతుర్ముఖ ఋత్విగ్విప్రులకు వాచకంబు.
తత్వతపోవేదయోగవాచకం బగునేని బ్రహ్మము నాఁబడు.
77 ఆత్మేమనిజంతంబులకు నాంతము లగు మనుజ సంజ్ఞలకు స్త్రీత్వంబు బహుళంబుగా నగు.
78 మహత్త్వంబున స్వార్థపరం బగు రాజశబ్దము రాజు నాఁబడు.
రాజు - ఖగరాజు.
అమహత్త్వంబునందు రాజము - వృక్షరాజము.
ఉపసర్జసత్వంబునందు హతరాజుఁడు - పరశురాముఁడు.
79 జగదింద్రజిత్తుల తకారంబునకు లోపంబు విభాష నగు.
జగము - జగత్తు, ఇంద్రజి - ఇంద్రజిత్తు. ఋత్విగాది యగుటంజేసి యింద్రజితుండనియు వాడంబడు.
80 సాంతంబుల తుది సకారంబునకు లోపంబు బహుళంబుగా నగు.
ఉరము -ఉరస్సు - వక్షము - వక్షస్సు, అర్చి - అర్చిస్సు, ధనువు - ధనుస్సు, ఆయువు - ఆయుస్సు.
బహుళ గ్రహణంబునంచేసి పయః ప్రభృతుల సకారంబునకు లోపంబు.
పయస్సు, వయస్సు, సరస్సు.
81 మహద్వాచకంబులగు సాంతంబుల కంతలోపం బేని, ద్వితీయైక వచనాంత తుల్యత్వంబేనగు.
అంగిరుఁడు - అంగిరసుఁడు, ఉగ్రశ్రవుఁడు - ఉగ్రశ్రవసుఁడు, ప్రచేతుఁడు - ప్రచేతసుఁడు, ఊర్ధ్వరేతుఁడు - ఊర్ధ్వరేతసుఁడు.
82 వేధ పురోధ పురోధసుఁడు.
వేధ శబ్దమునకు నిత్యంబుగాఁ బురోధశ్శబ్దమునకు వైకల్పితముగా సలోపస్త్రీవద్భావంబులు దీనిచే నిపతింపంబడియె.
83 మనఃప్రభృతుల సకారంబునకు ద్విత్వంబు విభాష నగు.
మనసు - మనస్సు, శిరసు - శిరస్సు, సదసు - సదస్సు.
లోపంబయ్యెనేని మనము - శిరము - సదము.
84 ద్యు హృ చ్ఛబ్దంబులకు దివి హృది యగు.
దివి - దివులు, హృది - హృదులు.
85 స్త్రీలింగంబులెల్ల స్వస్వనియతంబులగు స్త్రీప్రత్యయంబులం గూడి యిందుఁ ప్రవర్తిల్లు.
నామముస్త్రీ ప్రత్యయముతత్సమము
కర్తృకర్త్రీకర్త్రి
జనయితృజనయిత్రీజనయిత్రి
భాగ్యశాలిన్‌భాగ్యశాలినీభాగ్యశాలిని
బుద్ధిశాలిన్‌బుద్ధిశాలినీబుద్ధిశాలిని
మతిమత్‌మతిమతీమతిమతి
గుణవత్‌గుణవతీగుణవతి
విద్వస్‌విదుషీవిదుషి
వనజముఖివనజముఖి, వనజముఖావనజముఖి, వనజముఖ
మీననేత్రమీననేత్రామీననేత్ర
అంగాదులకుఁ దప్ప సంయోగోపధంబులకు ఙీప్ప్రత్యయంబు లేమింజేసి మీననేత్రి - పద్మనేత్రి ఇత్యాదు లసాధువులు.
86 మహతీతరంబులగు స్త్రీలింగంబుల విశేషణంబులకుఁ గ్లీబత్వంబు విభాష నగు.
పద్మలత మనోహారి - పద్మలత మనోహారిణి, హృద్యంబగు విద్య - హృద్యయగు విద్య, మొదవులలోఁ గపిల వరిష్ఠంబు - కపిల వరిష్ఠ.
87 భవచ్ఛత్రాదుల కిందుఁ బ్రయోగంబు లేదు.
భవదాదులగు హలంత సర్వనామంబులకును శతృ రేఫాంతాదులకును తెనుఁగు భాషయందు వ్యవహారంబు లేదని యర్థము. సమాసంబులం దొలుతం గదిసి యిందుం బ్రయుక్తంబులగు భవద్గుణంబులు - త్వదాశ్రయము - మత్పుణ్యము - లసద్రూపము - భవిష్యత్కాలము - ధూర్వహము ఇత్యాదు లెఱుంగునది.
AndhraBharati AMdhra bhArati - bhAshha - bAla vyAkaraNamu - tatsama parichchhEdamu - chinnaya sUri - andhra telugu tenugu ( telugu andhra )