భాష సామెతలు
నంగనాచి తుంగబుఱ్ఱ
నంగిమాటల వాడినీ - దొంగ చూపుల వాడినీ నమ్మరాదు
నందనవనంలో నాగుపామున్నట్లు
నంది అంటే పంది అన్నట్లు
నందిని చేయబోయి పందిని చేసినట్లు
నందిని పంది - పందిని నంది చేయగలిగినవాడు
నంబి కవిత్వం - తంబళ్ళ జోస్యం
నంబివాడు ఎదురైనా నాగుపాము ఎదురైనా కలిసిరావు
నంబీ నంబీ నా పెళ్ళికేమి సహాయం చేస్తావంటే నీ పెళ్ళికి ఎదురు రాను పో! అన్నాడట
నక్క ఎక్కడ నాగలోక మెక్కడ?
నక్క జిత్తులన్నీ నాదగ్గరుండగా తప్పించుకుపోయెరా తాబేటిబుఱ్ఱ
నక్క జిత్తులవాడు
నక్కను చూచిన వేటగాడిలాగా
నక్కను త్రొక్కి వచ్చినట్లు
నక్కపుట్టి నాలుగు వారాలు కాలేదు - నేనింత ఉప్పెన ఎన్నడూ చూడలే దన్నదట
నక్క పోయిన తర్వాత బొక్క కొట్టుకున్నట్లు
నక్కలు బొక్కలు వెదుకును
నక్క వినయం - కొంగ జపం
నగుబాట్ల పెళ్ళికి పెళ్ళినాడే నాగవల్లి అన్నట్లు
నట్టేట పుట్టి ముంచినట్లు
నట్టేట చేయి విడిచినట్లు
నట్టేట పడ్డ సొమ్ము నట్టింటికి నడిచి వచ్చినట్లు
నడిచే దారిలో గడ్డి మొలుస్తుందా?
నడచినవాడే పడేది
నడమంత్రపు సిరి
నడమంత్రపు సిరికి నెత్తిమీద కళ్ళు
నడమంత్రపు సిరి, నరంమీద పుండూ రెండూ ఒక్కటే
నడమంత్రపు సిరి వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట
నడమంత్రపు సిరి వస్తే నడుము లిరుగ పడ్డట్లు
నడిరాత్రి దుప్పట్లో యౌవ్వన మద్దెల మోతలన్నట్లు
నడువగా నడువగా పైగుడ్డే బరువు
నడుము మునిగేదాకానే చలి - నలుగురూ వినేదాకానే సిగ్గు
నత్తగుల్లలన్నీ ఒకచోట - ముత్యపు చిప్పలన్నీ ఒకచోట
నన్ను ఎరిగినవాడు లేకపోతే నా బడాయి చూడమన్నట్లు
నన్ను ముట్టుకోకు నా మాలకాకీ అన్నట్లు
నపుంసకునికి రంభ దొరికినట్లు
నమిలేవాడికన్నా మింగినవాడే ఘనుడు
నమ్మకానికి రాయబారమెందుకు?
నమ్మించి గొంతు కోసినట్లు
నయము నష్టకారి - భయము భాగ్యకారి
నయాన కాని పని భయాన అవుతుంది
నరకానికి నవ ద్వారాలు - స్వర్గానికి ఒక్కటే
నరములేని నాలుక ఎటైనా తిరుగుతుంది
నరునికి నాలుగు దశలు
నల భీమ పాకములు
నలిగి వున్నప్పుడు తొలగి వుండమన్నారు
నలుగురితో చావు పెళ్ళిలాంటిది
నలుగురి తర్వాత ఆడపిల్ల పుడితే నట్టింట బంగారం -
ముగ్గురి తర్వాత ఆడపిల్ల పుడితే ముయ్య మూకుళ్ళుండవు
నలుగురితో పాటు నారాయణా!
నలుగురూ నడిచే దారే నడవాలి
నలుగురూ నడిచిందే బాట - పలికిందే మాట
నలుగురూ వినేదాకానే సిగ్గు
నలుపు నారాయణ స్వరూపం
నలుపో తెలుపో నలుగురు పిల్లలు - ముతకో సన్నమో నాలుగు చీరలు
నల్ల బంగారం యిస్తా సాన పెట్తావా అందిట
నల్లబాపడు నాభికంటే విషం
నల్లేరు మీద బండిలాగా
నవరత్నాలున్నా నారీరత్నం వుండాలి
నవాబు పొట్టకూ, తమలపాకు కట్టకూ ఎప్పుడూ తడుపు కావాలి
నవ్వలేని వారిని నమ్మరాదు
నవ్వు నాలుగిందాల చేటు
నవ్విన నాపచేనే పండుతుంది
నవ్వే ఆడదాన్నీ - ఏడ్చే మగవాణ్ణీ నమ్మరాదు
నష్టపడ్డా భ్రష్టు కారాదు
నాకు లేక ఆకులు నాకుతుంటే నీకెక్కడ పెట్టేది?
నా కోడీ, కుంపటీ లేకుంటే ఎలా తెల్లారుతుందో, నిప్పెట్లా దొరుకుతుందో చూస్తానందట
నాగరికంలేని మాట నాలుక తీట
నాగలోకానికీ నక్కకూ పోలికా?
నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నాడట
నా చేను నీకు రాసిస్తా దున్నుకుని పంట పండిస్తావా? అని అడిగిందట
నాజూకు నయగారాలు - వలపు వయ్యరాలు
నాటిన పైరుకు నష్టం లేదు
నాడా దొరికింది - యిక గుర్రం కొందామన్నట్లు
నాతి బలం నాలుకే
నాతోనే అంతా వున్నది అన్నట్లు
నాది కాదు - నా అత్త సొమ్ము అన్నట్లు
నా దెబ్బకు గోలకొండ కూడా అబ్బా అంటుంది
నానాటికీ తీసికట్టు నాగంభొట్లు
నా నోట్లో నీ వేలు పెట్టు - నీ కంట్లో నా వేలు పెడతా అన్నట్లు
నా పాతివ్రత్యం గూర్చి నా మొదటి మొగుణ్ని అడగరా రెండో మగడా అందిట
నా పెనిమిటికి లేనిది నీకుంది అందుకే నీ పక్కలోకొచ్చా అందిట
నామాలవారే గానీ, నియమాలవారే లేరు
నా మొగుడికే పసవుంటే నీ దగ్గరెందుకు పడుకుంటానని అందిట
నాయనకు పెళ్ళి సంబరం - అమ్మకు సవతి సంకటం
నారి తెగినా కష్టమే - నారి తిరిగినా కష్టమే
నారు పోసినవాడే నీరూ పోస్తాడు
నాలిముచ్చు వెధవనీ, నీళ్ళు నమిలేవాణ్నీ నమ్మరాదు
నాలుక కటువు - ఎద మెత్తన
నాలుక వుంటే అన్ని దిక్కులూ తిరుగగలడు
నాలుక దాటితే నరకము
నాలుక మీద తేనె - మనసులో విషం
నాలుకా! నాలుకా! వీపుకు దెబ్బలు తేకే
నా వ్రేలితో నా కన్నే పొడిచినట్లు
నాశనమూ - నల్ల బొగ్గులూ
నా సింగారం చూడరా నా బంగారు మగడా! అన్నట్లు
నిండా మునిగిన వానికి చలేమిటి?
నిండిన కడుపుకు అన్నం - బట్టతలకు నూనె అన్నట్లు
నిండిన కడుపుకు నిక్కెక్కువ
నిండిన కడుపు నీతి వినదు
నిండు కుండ తొణకదు
నిండుటేరు నిలిచి పారుతుంది
నింద లేనిదే బొంది పోదు
నింద వస్తుంది గానీ అవమానం రాదు
నిజం మాట్లాడితే ఉన్న ఊరు అచ్చిరాదు
నిజం మాట్లాడితే నిష్ఠూరం
నిజం కురచ - బొంకు పొడవు
నిజం నిలకడ మీద తెలుస్తుంది
నిజమైన బంగారం నిప్పుకు వెరవదు
నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి
నిత్య కళ్యాణం పచ్చతోరణం
నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు
నిద్రపోతున్నవాడిని లేపగలంగానీ, మేలుకొని నిద్ర నటిస్తున్నవాడిని లేపగలమా?
నిదానమే ప్రధానం
నిన్న ఉన్నవాడు నేడు లేడు
నిప్పుకు చెదలంటుతుందా?
నిప్పుకూ నీటికీ ఉన్నంత స్నేహం
నిప్పు త్రొక్కిన కోతిలాగా
నిప్పు ముట్టనిదే చేయి కాలదు
నిప్పు లేనిదే పొగరాదు
నిప్పులో ఉప్పు వేసినట్లు
నిమ్మకు నీరెత్తినట్లు
నియమం కోసం నామం పెడితే, నామం నా కొంపముంచింది అన్నట్లు
నియోగి నిక్కులు
నియోగపు ముష్టికి బనారసు సంచి
నిర్భాగ్యపు దామోదరుడికి అభాగ్యపుటల్లుడు
నిలకడ లేని మాట నీళ్ళ మూట
నిలుచోటానికి చోటిస్తే పడగ్గది ఎక్కడన్నాడట
నివురు కప్పిన నిప్పువలె
నిష్ఠ నీళ్ళపాలు - మంత్రం మాలలపాలు
నిష్ఠ మాలలపాలు - మానం సాయిబుపాలు
నీ ఎడమ చెయ్యి తియ్యి - నా పురచెయ్యి పెడతాను అన్నట్లు
నీకు ఎక్కడ సంశయమో, నాకూ అక్కడే సందేహం
నీ కూడు తింటూ, నీ బట్ట కడుతూ, నాతో కాపురం చెయ్యి అన్నట్లు
నీకు బెబ్బెబ్బే - నీ యబ్బకు బెబ్బెబ్బే
నీకో దణ్ణం - నీ పెద్దకొక దణ్ణం
నీకోసం పుట్టా, నీకోసం పూచా, దొరలా దోచుకో అందట
నీటికి కలువ - మాటకు చలువ
నీటికి నాచు తెగులు - మాటకు మాట తెగులు
నీటికి నాచు తెగులు - నాతికి రంకు తెగులు
నీటిలో జాడలు వెతికినట్లు
నీడలకు నోళ్ళుంటాయి
నీతో కాపురం ఒంటికి కంపరం అన్నట్లు
నీతి లేనివాడు కోతికంటే పాడు
నీతి లేని మాట రాతి వేటు
నీతోడిదే లోకం అన్నట్లు
నీ పప్పు నా పొట్టు కలిపి ఊదుకు తిందాం రా! అన్నట్లు
నీ పెండ్లాం ముండమొయ్యా!
నీ పెండ్లి ఎట్లాగో పాడయింది, నా పెండ్లికి రా అన్నాడట
నీరు వుంటేనే పల్లె - నారి వుంటేనే యిల్లు
నీరు పల్లమెరుగు - నిజం దేముడెరుగు
నీటి మూటలు - గాలి మాటలు
నీళ్ళ మూట - వంచకుడి మాట ఒక్కటే
నీళ్ళు లేని పైరు - నూనె లేని జుట్టు
నీవు ఒక అందుకుపోస్తే, నేను ఒకందుకు తాగుతున్నా
నీతల్లో తేజమ్మ
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష
నీవు పాడిందానికీ, నేను విన్నదానికి సరి. తలవూపిన దానికి తంబూర పెట్టిపో! అన్నట్లు
నీ సరి వేల్పులు - నా సరి దాసులు లేరు
నీ సొమ్ము ఆదివారం - నా సొమ్ము సోమవారం
నుదుట వ్రాయనిదే నోటరాదు
నుయ్యి తియ్యబోతే భూతం బయటపడ్డట్లు
నువ్వు దంచుతూ వుండు - నేను పక్కలెగరేస్తాను అన్నట్లు
నూటికీ కోటికీ ఒకడు
నూటికి పెట్టి కోటికి గొరిగినట్లు
నూతి కప్పకు సముద్రపు సంగతేం తెలుస్తుంది?
నూరు అబద్ధాలాడి అయినా ఒక యిల్లు నిలుపమన్నారు
నూరు కీళ్ళు ఓరిస్తేగానీ ఒక మేలు దక్కదు
నూరు కొరడా దెబ్బలైనా ఒక బొబ్బట్టుకు సరిరావు
నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది
నూరు నోములు ఒక్క రంకుతో సరి
నూరు మాటలు ఒక వ్రాతకు సరికావు
నూరేళ్ళు వచ్చినా నుదుటి వ్రాతే గతి
నెత్తి కాలనిదే జోలె నిండదు
నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతుంది
నెత్తీబోడి తిత్తీబోడి, తిరుపతికెందుకు?
నెమలి కంటినీరు వేటగానికి ముద్దా?
నెమలిని చూచి నక్క నాట్యమాడినట్లు
నెయ్యానికైనా - వియ్యానికైనా - కయ్యానికైనా సమానంగావుండాలి
నెల తక్కువైనా రాజింట పుట్టాలి
నెల తక్కువైనా మగవాడిగా పుట్టాలి
నెల బాలుడికి నూలు పోగన్నట్లు
నేడు చస్తే రేపటికి రెండు
నేతి కుండను నేలబెట్టి, ఉత్త కుండను ఉట్టి మీద పెట్టినట్లు
నేతి బీరకాయలాగా
నేను పుట్టకపోతే నువ్వెవరిని పెళ్ళి చేసుకునేవాడివని అడిగితే, నీతల్లిని పెళ్ళాడేవాడిని అన్నాడట
నేను వెళితే లేదుగానీ నా పేర చీటీ పంపితే పని జరుగుతుందా?
నేర్చి చెప్పిన మాట నెరవాది మాట
నేర్చినమ్మ ఏడ్చినా బాగానే వుంటుంది
నేర్చిన బుద్ధి ఏడ్చినా పోదు
నేలచూపు పోతే వాలుచూపు సై అంటుంది
నేలది తీసి నెత్తికి రాసుకున్నట్లు
నేలరాయి నెత్తికెత్తుకున్నట్లు
నేల విడిచి సాము - నీరు విడిచి ఈత
నేసేవాణ్ని నమ్ముకుని పొలిమేర జగడం ఒప్పుకోరాదు
నొప్పించక తా నొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు
నొసట పళ్ళు - నోట్లో కళ్ళు లేవు
నొసట నామాలు - నోట్లో బూతులు
నొసట వ్రాసిన వ్రాతని చెరిపే దెవరు?
నోటి తీట పొట్టకు చేటు
నోటికి, చేతికి చీకటి లేదు
నోటితో లేదనేది చేతితో లేదంటే సరి
నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించినట్లు
నోట్లో నువ్వుగింజ దాగదు
నోట్లో ముద్ద గూట్లో దీపం
నోట్లో వేలు పెట్టినా కరవలేని నంగనాచి
నోరు అప్పాల పిండి - చెయ్యి బలుసు ముల్లు
నోరుంటే ఊరుంటుంది
నోరున్న తలగాచును
నోరున్నవాడిదే రాజ్యం
నోరు చేసే అఘాయిత్యాన్ని పొట్ట భరించలేదు
నోరు నవ్వటం - నొసలు వెక్కిరించటం
నోరు మంచిదయితే ఊరు మంచిది
నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరించినట్లు
నోరు మూస్తే మూగ - నోరు తెరిస్తే గయ్యాళి
న్యాయదేవత వింటుందేగానీ చూడలేదు
న్యాయానికి కూడు లేదు
న్యాయానికి రోజులు లేవు
న్యాయాన్ని రక్షిస్తే, అది నిన్ను రక్షిస్తుంది
న్యాయదేవత కళ్ళు విప్పనంతవరకే అన్యాయం ఆగడాలు
AndhraBharati AMdhra bhArati - bhAshha - sAmetalu ( telugu andhra )