దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
    
21. గౌరీ - లక్ష్మీ సంవాదము
గౌరిదేవి నీ శంభుదేవునకు
గళమున నలుపేమమ్మా
    నారీమణి నీ విష్ణుదేముడూ
    నలుపుకాదుటే కొమ్మా
ఏమి లేక నీ కాంతుడు జగమున
ఎద్దు నెక్కెనే మమ్మా
    పంతముతో నీ కాంతుడు
    పశులకాసెనా కొమ్మా
అద్దులేక నీ వల్లభుడూ
సుఖమాడ రూపమేమమ్మా
    ముద్దుగుమ్మ నీ మురహరి పెనిమిటి
    మోహిని కాదటే కొమ్మా
పంకజాక్షి నీ శంఖరి కరమున
జింక వున్నదేమమ్మా
    పంతముతో వనవాసముకేగి
    జింకను వేసెనె కొమ్మా
చింతలేక నీ కాంతుడు బ్రహ్మను
శిరసు త్రుంచెనే మమ్మా
    పంతముతో రావణబ్రహ్మను
    పదితలలు త్రుంచెనే కొమ్మా
విశాలాక్షి నీ విభుని మాయలా
జంగము కులమే మమ్మా
    పాలు పెరుగు లమ్మగను గొల్లవారి
    కులముకాదుటే కొమ్మా
పార్వతిదేవి నీ విభునికి
నిలువున పాములున్న వేఁవమ్మా
    అద్దులేక కాళంగి మడుగులో
    నాట్యము చేసెనే కొమ్మా
పార్వతిదేవి వైదేహి పలికిన
పంతము వినరమ్మా
    విన్నవారికే విష్ణులోకమూ
    కైలాసము కాదటె కొమ్మా
AndhraBharati AMdhra bhArati - gaurii - laxmii saMvaadamu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )