దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
    
71. పసి హృదయం
పూజాకు పువ్వులు
    కోయాగ వెళ్ళి
పూల కంచెలు అన్ని
    తప్పించు కెళ్ళి
పాపలు వెళ్ళారు
    పాలా బుగ్గలతో
పూవూలు తెచ్చారు
    పూలా బుట్టలతో
పూలాతో దేముడిని
    పూజించగాను
పూవూల దండాలు
    గుచ్చారు వారు
పూజాకు దేముడిని
    సిద్ధాపరచంగా
పునుగు, పాలాతోటి
    శుద్ధీ చేశారు
బాకాలు తాళాలు
    మేళ వించంగ
పాపలు దేముడిని
    పూజించినారు
దేముడిని చేతూల
    తాకూచు వారు
పలకరింపుల నెన్నొ
    ఒలక పోశారు
ఎంతాకు దేమూడు
    పలక నందూన
ఏమిటో ముఖమింత
    చేసుకున్నారు
ఫలమూలు, బెల్లాలు
    కదల నందూన
పాపలా పలుకులకు
    కులక నందూన
ఎందుకో బొమ్మను
    చూస్తూను వారు
ఏమిటో? యోచనా
    చేశారు వారు
AndhraBharati AMdhra bhArati - pasi hR^idayaM jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )