దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
90. గంగా గౌరీ సంవాదము
శివ శరణు - శివ శరణు
శివ శరణు చాలా
శివ శరణు మాపాలి
శివుడికీ శరణు.

హరి శరణు - హరి శరణు
హరి చరణు చాలా
హరి శరణు మాపాలి
అచ్యుతులకు శరణు.

గురు శరణు - గురుశరణు
గురు చరణు చాలా
గురు శరణు మాపాలి
గురువులకు శరణు.

వెండికొండల మీద
పెద్ద మహాదేవి
ప్రేమతో తన కొడుకు
పెండ్లాన్ని పొగడె
హిమవంతు మీయింట
కన్యా ఉన్నాదా?
ఇస్తే మా శంభునికి
యివ్వమని అడిగె

తల్లి తండ్రీ లేని
తగని కాపురం
అత్తా మామ లేని
అతను ఒంటరిగాడు
మాయలా శంభుడికి
మేమియ్య మనిరి

గొడ్రాలు వాకిట్లొ
గోరింట పూచే
చతురాలు వాకిటా
దానిమ్మ పూచే
మానవతి గౌరింట
మల్లె పూచింది
ఎక్కెను గౌరమ్మ
వెన్నంటకుండ
వంచెను ఆ కొమ్మ
వసిలాపకుండ
కోసెను ఆ పూలు
గోరంటకుండ
తలముడిచి నా పూలు
పళ్లాల బోసి
పంపెను పదివేలు
గంగ మేడలకు.

వాడుపువ్వులు పంపింది
వనితెవ్వరమ్మ?
వాడుపువ్వులు పంపింది
వనిత గౌరమ్మ.
చాలవని గంగమ్మ
సరికొల్ల లాడె.
సరిగాను పంచుటకు
సరిదాన వటే?
సరిదాన్ని కాకుంటె
శివుడేల తెచ్చు?
శివుడేల తెచ్చునూ
జగమేల మెచ్చు?
శివునికి చిన్నాలె
నీకు చెల్లెలను
కొట్టరా నా సవతి
పళ్ళన్ని రాల.
అక్కరో నీ హస్తమున
కొట్టిన్న పళ్లు
కూర్చుండి యేరిస్తు
గుళ్ళపుదిగలను
నిలచుండి యేరిస్తు
నిలువు గాదెలను
ఒడిగట్టి యేరిస్త
ఒకటి లేకుండ
చిన్నలకి పెద్దలకి
నువు పంచిపెట్టు
అంతకంటె చిన్నలకు
అక్కరో నేను.
సరిగాను పంచుటకు
సరిదాన వాటె?
సరిదాన్ని గాకుంటె
శివుడేల దెచ్చు?
శివుడేల దెచ్చునూ
జగమేల మెచ్చు?
శివునకు చిన్నాలె
నీకు చెల్లెలను.

అంతటా గౌరమ్మ
వాకటా నుండె
కానబడకా దాగె
గంగమ్మ తాను.
కొలువులో కూర్చున్న
వీరన్నను పిలిచి
అయిదు దినములనుంచి
స్నానంబు లేదు
ఆరు దినములనుంచి
శివపూజ లేదు
శివపూజ నేనైన
చేసుకో లేదు
ఉదకముల జాడలూ
చూడుమీ కొడుకా.
ఇటు వెళ్ళి వీరన్న
ఈ కొలను చూసె
ఈ కొలను ఉదకములు
దాచింది గంగ.
అటువెళ్ళి వీరన్న
ఆ కొలను చూచె.
ఆ కొలను ఉదకంబు
దాచింది గంగ.
ఇరుగు వారిళ్లకూ
పోయిరా కొడకా.
ఇరుగు వారిళ్లలో
యిన్నైన లేవు
పొరుగు వారిళ్ళలో
బొట్టెడూ లేవు.
గౌనువారిళ్ళకూ
పోయిరా కొడకా.
గౌనువారిళ్లలో
గరిటెడు లేవు.

దక్ష యాగములోన
దక్కుడున్నాడు
దక్షయాగము దాక
పోయిరా కొడకా.
పోయి దక్షూనకు
ఏమానె దమ్మ?
దయపుట్ట చెప్పరా
నాతండ్రితోనూ.

చేకత్తి కైజారు
చేత బుచ్చుకొని
బల్లెమూ శూలమూ
వెల్లెతాడొకటి
రాక్షసుల మర్దింప
రంప మొకచేత
కొమరుండు ఆ వీర
భద్రుడే కదిలే
గుజ్జుమామిడిదాటి
గురువిందదాటి
పసుపొన్న పూసినా
డేరాలుదాటి
వెళ్ళెను వీరన్న
తాతమేడలకు.

క్షీరాబ్ధి మాయింట
శివశరణు మీకు
లక్షవై వర్థిల్లు
కొనుము వీరన్న
ఎన్నడూ నామేడ
ఎరగవుర నీవు
ఏం పనికి వస్తివీ
నీవువీరన్నా?

అయిదు దినములనుంచి
స్నానంబు లేదు
ఆరుదినములనుంచి
శివపూజలేదు
శివపూజ మాయమ్మ
చేసుకోలేదు
ఉదకముల జాడలూ
మిమ్మడగమంది
ఇటువెళ్ళి దక్షుడూ
ఈ కొలను జూచె
ఈ కొలను ఉదకములు
దాచింది గంగ
అటువెళ్ళి దక్షుడూ
ఆ కొలను జూచె
ఆ కొలను ఉదకములు
దాచింది గంగ.

తనమీద వైరాన్ని
సవితి తెచ్చిందా?
పంపెను పదివేలు
పాల కావిడులు
పంపెను పదివేలు
నేతి కావిడీలు.
పాల నేతా గౌరి
స్నానంబు చేసి
నేతి పాలా గౌరి
శివపూజ చేసె.
పక పక నవ్వెనూ
గంగ తా నపుడు
ఈగలను దోమలను
విడిచెనే గంగ
కండ చీమల మ్రాను
కదిపెనో గంగ.
ఈగల్ని దోమల్ని
నే విడువజాల
కండ చీమలమ్రాను
చెండుచున్నాది
పంచగిరులామీద
మీ తండ్రి శివుడు
పంచగిరులా దాక
పోయిరా కొడకా.

పోయి నే శివుడుతో
యే మానెదమ్మ?
దయబుట్ట జెప్పరా
నీ తండ్రితోను.

పుట్టించ గిట్టించ
బ్రహ్మ కర్తనెను
అందరిని రక్షించ
విష్ణు కర్తనెను
ఆయుస్సుపొయ్య
తాను కర్తనెను
అయిదో తనాలియ్య
మీయమ్మకర్త
ఇప్పుడు నీళ్ళకూ
గంగ కర్తనెనూ
కావలసిన గంగనీ
వేడుకో మనెను
కావలసిన గంగనీ
బ్రతిమలాడమను.
ఏవేళ గంగతో
ఎదురు వేళామా
ప్రోయాలు మీయమ్మని
పోకుమని చెప్పు.

అనుచు శివుడప్పుడూ
అచ్చోటకు వచ్చె
వచ్చిన శివ ప్రభుని
చూసి గౌరమ్మ

వింటివా జంగమా
ఇంతి మాటల్లు
ఎటునుండి వచ్చింది
ఇంతి ఈ యిల్లు?
గంగనన్నా యేలు
గౌరినన్నా యేలు
లొంగుండ లేనయ్య
గంగతో నేను
తట్టలో కాపురం
బుట్ట కొచ్చేను
ఇట్టాటి సవతితో
నే నేగలేను.
రాళ్ళ దొర్లిందాన
రాణ యెందూకె?
రొయ్య లమ్మిందాన
రోస మెందూకే?
తండ్రి మాటినకుండ
తర్లి పోతావు
మొగుడింట నుంటానె
మోసగిస్తావు
ఉండటానికి యిల్లు
ఉండెనే నీకు?
బండలే నిలవక
పగిలి పోతాయి
తల్లి లచ్చీమంచు
తలబిరుసు నీకు
తల్లి బిడ్డా వరస
తప్పింది నీకు
కాళ్ళ బుట్టిందాన
కాళ్ళ దొర్లేవు
యిల్లాలి కాపురం
యెలిగించ లేవు.
పిచ్చోడు జంగమే
తెచ్చు కున్నాడు
చిచ్చెట్టి కాపరం
రచ్చ కీడ్చేవు
ఎల్లవే నా సవితి
యెల్లిపోవేమే
ఇల్లాలి కాపురం
యెలిగించ లేవు
వింటివా జంగమా
యింతి మాటల్లు
ఎటునుండి వచ్చింది
యింతి యీ యిల్లు.

గౌరమ్మ మాటలు విన్న
గంగమ్మ తల్లి...

వింటివా సాంబయ్య
యింతి మాటల్లు.
ఈ సవితితో నేను
యేగలేనయ్య
కొండలో నుండేటి
కోయదొరసాని
వెండిలో కొచ్చింది
వెలిగి పోతుంది
నిప్పుకన్నుండియు
నిలుచుంటివేమి
కన్ను తెరవారాద
కాల్చెయ్యరాద
తల్లిమాటినకుండ
తపసు చేసేన
తల్లి వరసిందులో
తప్పింది ఎవరు?
తలపైన నన్నుంచి
తరుణిరో నీవు
సరసాల నాడేవు
సగదేహ మిచ్చి
నెత్తికొచ్చీ కళ్ళు
మొత్తుకుంటుంది
పెత్తనాన్నిచ్చెనె
అత్త నా సవితి
కోయ నా సవితితో
కులుకుతా వేల
రావయ్య సాంబయ్య
రావయ్య నీవు
రతనాల నా తండ్రి
రాసి పోస్తాడు
ఏమి తక్కువ నీకు
ఈ బూడిదేల
ఒల్లమాలిన దాని
వల్లకాడుంచి
రావయ్య పోదాము
రతనాల దీవి
చిచ్చురికి నా సవితి
సచ్చిపోతేను
తెచ్చుకున్నా విపుడు
ముచ్చులా దీన్ని
నా బలము తెలియదే
నా సవతి నీకు
కోప మొచ్చిందంటె
కొండ లాగవులె
వెండి కొండయ్యేను
వేడి కొండైన
ఏటిలో కలిపేను
నీట ముంచేను
అలిగి నే పోతినా
నిల్వవే సవితి
నీటి చుక్కైనాను
నోటిలో పడదె
అంచునే పోయింది
గంగమ్మ తల్లీ.
అగుపించనే లేదు
గంగమ్మ అపుడు.

చేయునది లేకపుడు
గౌరమ్మ తల్లి
చేరి కొడుకుతో చెప్పె
మరి బాధతోడు
నీచుదానింటికి
పోయిరా కొడుకా
పల్లె దానింటికి
పోయిరా కొడుకా

పోయి గంగమ్మతో
ఏమనే దమ్మా?
దయపుట్ట చెప్పరా
గంగమ్మ తోను.

చేకత్తి కైజారు
చేత బుచ్చుకొని
బల్లెమూ, శూలమూ
వల్లె తాడొకటి
రాక్షసుల మర్దింప
రంప మొకచేత
కొమరుండు ఆ వీర
భద్రుడే కదిలే.
గుజ్జు మామిడి దాటి
గురువిందదాటి
పసుపొన్న పూసినా
డేరాలుదాటి
వెళ్ళెను వీరన్న
గంగతావులకు.

క్షీరాబ్ధి మాయింట
శివశరణు మీకు
లక్షవై వర్థిల్లు
కొనుము వీరన్న
ఎన్నడు నాజాడ
ఎరగవుర నీవు
ఏం పనికి వస్తివీ
నీవు వీరన్నా?

మాయమ్మ రమ్మంది
పోదాము రావె

మీయమ్మ ఎక్కువేమి
నా తక్కువేమి?
ఎవ్వారి పనివుంటె
వారె వత్తూరు
సాక్షాలదాన్నిపుడు
చావగొట్టింతు
యమబాధలు దాన్ని
పెట్టింతు దాన్ని
యమధర్మరాజుకే
అప్పగించొస్తా
పోవోయి వీరన్న
పొంకాలు మాని.

గంగ యింటినుండి
వీరన్న అపుడు
చేరెనూ వీరన్న
తల్లి మేడలకు
పంపరానిళ్ళకూ
పంపితివి అమ్మా
అనరాని మాటలూ
ఆడింది గంగ.

కొడుకు మాటలు విన్న
గౌరమ్మ అంత
నీచుదానింటికే
పోయి వద్దాము
పల్లె దానింటికే
పోయి వద్దాము.

గౌరమ్మ రాకను
గంగమ్మ చూసి
ఎండు చేపలు తెచ్చి
వాకిళ్ళ పరచె
పచ్చి చేపలు తెచ్చి
పందిళ్ళ పరచె
కప్పకడిగిన నీళ్ళు
కళ్ళాపు జల్లె

నీచుదానింటికీ
ఏలొస్తి వక్కా?
నీచుదానవు గావు
నా చెల్లెలావు.

పల్లెదానింటికీ
ఏలొస్తి వక్కా?
పల్లెదానవు కావు
నా చెల్లెలావు.

నే పెట్టుకొన్న సొమ్ములు
నీకిస్తు గంగా
ఉదకముల జాడలూ
చెప్పుమీ గంగా.

నువ్వు పెట్టుకొన్న సొమ్ములూ
నాకైన లేవ?
ఉదకముల జాడలూ
నే నెరుగ నక్క.

నాకొడుకు వీరన్న
నీకిస్తు గంగా
నీ కొడుకు వీరన్న
నా కొడుకుగాద?

నా కోడలు భద్రకాళిని
నీకిస్తు గంగా.
ఉదకముల జాడలూ
నే నెరుగ నక్క.
నీ కోడలు భద్రకాళి
నా కోడలు కాద?

నాయొక్క పురుషుడ్ని
నీ కిస్తు గంగ.
ఉదకముల జాడలూ
చెప్పుమీ గంగ.

ఆడిన మాటలకు
తప్పకుమి అక్క
ఈ సూర్యచంద్రులూ
సాక్షులున్నారు
మర్రుల మారేళ్ళు
సాక్షులున్నారు
సరసముప్పయి కోట్ల
దేవతలు సాక్షులున్నారు

పుట్టెను ఒక మహిమ
భూమిలోపలను.
పట్టెను ఒకమేఘం
పర్వతంగాను.
కురిసెను ఆ వాన
కొండలా పొడుగు
వీభూతి గుండములు
వీధులకు పారె.
మల్లెయ్య గుండాలు
మడుగులై పారె.
గంగలో గౌరమ్మ
స్నానంబు చేసె.

గంగమ్మ రాకుండ
గడియ వేసుకునే

గెల్చితివి గౌరక్క
కల్లలాడితివె
సూర్యులూ, చంద్రులూ
సాక్షులేమయిరి?
మర్రులూ, మారేళ్ళు
సాక్షులేమయిరి?
దేవతలు అందరు
సాక్షులేమయిరి?

ఇద్దారి వాదంబు
ఈడేర్చలేక
సిరసుపైనా గంగ
దేవినుంచుకొని
తొడలపై పార్వతి
దేవినుంచుకొని
కదిలెనే శివుడు తన
కళ్యాణి గిరికి
గంగమ్మ గౌరమ్మ
వాదంబు వింటె
విన్నవారికి యిచ్చు
విష్ణులోకంబు
కైలాస మిచ్చునూ
గంగాధరుండు.
AndhraBharati AMdhra bhArati - gaMgaa gaurii saMvaadamu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )