దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా
    
93. అర్థరాత్రికాడ
అద్ద రాతిరి కాడ
అదురు బెదురూ లేక
అరుగు మీ దుండావు
    ఓ పిల్లా
అదురు లేదా నీకు
    ఓ పిల్లా...

అద్ద రాతిరి కాడ
అరుగు మీదుంటేను
అడుగు లేతావేటి
    చిన్నోడా
బెదురు లేదానీకు
    బుల్లోడా...

ఈ యేల యీ చోట
ఇంతరాతిరి కాడ
ఏటి చేతుండావే
    ఓ పిల్లా
సోకుగా నుండావె
    ఓ పిల్లా...

ఇంత రాతిరి యేల
ఈడ నీకేటి పని
ఎగురుతుండావు లే
    బుల్లోడా
పనియేటో సెప్పెళ్ళు
    పిల్లోడా...

చల్లన్ని యెన్నెలా
చక్కగా వున్నాది
చూరు ప్రక్కగ నాతో
    ఓ పిల్లా
చేరవస్తావోలె
    ఓ పిల్లా...

చల్లన్ని మాటలూ
చక్కగా సెప్పావు
దూరాన నావోడు
    బుల్లోడా
తొందరగ వస్తాడు
    పిల్లోడా...

అయితే నే పోతుండ
అసలు మాటేటంట
అదురు లేకను చెప్పు
    ఓ పిల్లా
అదురుగా వుండాది
    ఓ పిల్లా...

చుక్కాని యేలకీ
చల్లమ్మ వస్తాను
చల్లంగ పొమ్మురా
    పిల్లోడా
సరసోళ్ళు చూస్తారు
    బుల్లోడా...
AndhraBharati AMdhra bhArati - artharaatrikaaDa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )