దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 1 : ఎల్లోరా

నా మాట

తెలుగు జనపదాల సహజ సౌందర్యాన్ని చూస్తుంటే - వచ్చే పోయే పడవలలో నిండిన కాలువలు - ఎదిగి, పండి, పిలిచి పలుకరించే పచ్చని వరిచేలు - ఏటినుండి నీటి కడవలతో - ఒయ్యారపు నడకల సింగారాలతో, కిచకిచలాడుతూ, పాటలు పాడుకుంటూ పోయే పల్లెపడుచులు - ఏటిగట్లమీద దూడలను కాస్తూ, గొంతెత్తిపాడుతూ తిరిగే పయిల కుర్రవాళ్ళ ఆటలు, పాటలు - చూస్తూ వింటూ, పోతూంటే - సంగీతం రానివాడైనా - సంగీతం అంటేనే తెలియని వాడైనా - ఆ ప్రకృతి రామణీయకానికి - ఆ జానపదుల జిగేలుమనే సౌందర్యానికి - తన్మయుడై, అందులో లీనమైపోయి - తాను కూడా కూనిరాగాలు తీస్తాడు.

జానపదజీవత మధుర ప్రతిబింబాలనదగిన 'జానపద గేయాల'ను సేకరించాలనే జిజ్ఞాస నాలో కూడా కలిగింది!

అందుకు తోడు మా అమ్మ ప్రతిదినం తెలతెలవారుతుండగానే మేల్కొని, 'మేల్కొల్పులు', 'గుమ్మడేడే గోపిదేవీ', 'శ్రీకృష్ణలీలలూ' - చక్కని వరుసలలో పాడుతూంటే, నేను వినడం జరిగేది. వాటి యింపుసొంపులకు పొంగి ఏ పవిత్రలోకంలోనో విహరిస్తూన్నట్టనిపించేది. ఆనాటి మాతల్లి చలవే నేడు నాలో జానపదగేయాల సేకరణకు ఎంతగానో కొంత ఉత్సాహం, బలం కనిపించడానికి కారణం.

పట్టుదలతో కొన్ని గేయాలను సేకరించి ఆలిండియా రేడియో, మద్రాసు వారికి అందజేసాను. వారు నాకృషికి ప్రోత్సాహమిచ్చారు. ఆ గేయాలను రేడియో ద్వారా ఆంధ్రప్రజానీకానికి వినిపిస్తూ నా ఉద్యమానికి ఎంతో ప్రోద్బలమిచ్చారు - వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తున్నాను.

నా గేయాలను ఒక సంపుటిగా తీసుకురావడానికి ప్రోత్సహించిన శ్రీ నార్లవారికి కృతజ్ఞతాభివందనాలు.

ఈ కృషికి అమూల్యమయిన సలహాలనిచ్చిన డాక్టరు శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారికి, శ్రీ పందిరి మల్లిఖార్జునరావుగారికి నా నమస్కృతులు.

నా కృషికి ఒకరూపు యివ్వడంకోసం ముందుకు వచ్చి సేకరించిన వాటిలో కొన్నింటిని సంపుటిగా ప్రచురిస్తూ - జానపద వాఙ్మయ సంపాదనోద్యమానికి గణనీయమైన చేయూతనిస్తూన్న విశాలాంధ్ర ప్రచురణాలయంవారికి నా ధన్యవాదాలర్పిస్తున్నాను.

సేకరణలో - ఎంతో సహృదయతతో నాకు తోడ్పడిన మిత్రులు - శ్రీ సి.హెచ్‌.వి. హనుమంత రావుగారికి సంతోషపూర్వకంగా అభివందనాలు అందజేస్తున్నాను.

ఈ గేయాలన్ని ఆంధ్రమహాజనులవే. అయినప్పుడు వారు ప్రథమ సంపుటిని స్వీకరించి ఆదరిస్తారని ఆశించడమే కాదు, విశ్వసించడంలో ఆశ్చర్యమేముంది? ముందు ముందు మరికొన్ని సంపుటాలను అందజేయటానికి కృషి చేస్తానని మాత్రం విన్నవిస్తున్నాను.

"ఎల్లోరా"
1954

(గొడవర్తి భాస్కర రావు)

AndhraBharati AMdhra bhArati - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )