దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

008. వరికలుపు పాట


వరిచేనులో కలుపు తీస్తున్నపుడు, అంటే పొలాన్ని నిర్మాలిన్యము చేస్తున్నపుడు కూలివారి కల్పన సుకుమారి కోడలిమీదికి ప్రసరించింది. బంగారుబిందె లోని చేమంతికట్టల లోని చిన్నపు మంచపు సన్నపు నులకమీద పండుకున్నదట జాణ లక్ష్మమ్మ! పాటనంతా వినండి.

చిక్కుడూ ఆకుల్ల వెన్నియ్యలో
శివసద్దులు గట్టి వెన్నియ్యలో
చిత్తూరు నేబోదు చుట్టాలజూడ
అక్కడెవరున్నారె ఆంభోజిరాజు
మా అమ్మతమ్ములు మాకు మేనమామలు
మముగన్న తండ్రికి బావమరదులమ్మ
బావమరదులు గూడి బాయి తోడించిరి
బాయిలో ఉన్నది బంగారిబిందె
బిందెలో ఉన్నది చామంతికట్ట
కట్టలనె ఉన్నది చిన్నపు మంచము
చిన్నపు మంచానికి సన్నపు నులక
దానిమీద పండేటి జాణలెవరమ్మ
పనిజేసె లక్ష్మమ్మ పవళించినాది
విసనగఱ్ఱలతోటి విసిరి లేపన్నా
విసిరినా లేవదు విరజాజిమొగ్గ
కొబ్బరాకుడకలతో కొట్టి లేపన్నా
కొట్టినా లేవదు కోమటోరి పట్టి
డొప్పళ్ళ గందంబు గుప్పిలేపన్నా
గుప్పినా లేవదు ఈ గురిజలబంతి
దొడ్లో పసులెళ్ళె దోర ఎండలొచ్చె
ఇకనన్న లేవవే దొడ్డివారి బిడ్డ
మందపసులెళ్ళె మారు ఎండలెక్కె
ఇకనన్న లేవవే మా అమ్మ కోడలా

దోరటెండలూ, మారుటెండలూ, దొడ్డిపశువులూ, మందపశువులూ మేతకు పోయే వేళలే , సూర్యుడు కాదు దినాన్ని నడిపేది! కోళ్ళూ, పశువులూ పాలెవాళ్ళున్నూ. మచ్చపడని చైతన్యము కనబడుతుంది కాదూ పల్లెటూళ్ళలో?

ఊడ్పులూ, కలుపుతీతలూ అయిపోతే పల్లపు పొలములలో పనులుండవు. మళ్ళీ కోతనాడే కూలిజనముల కోలాహలము.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - varikalupu pATa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )