దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

011. గొంతెమ్మ పాట


తుమ్మెద పదములు, వెన్నెల పదములు పాల్కురికి సోమనాథుని కాలమునాటికే తెలుగునాట వెలుగులెత్తినవి. మొదట వేదాంతబోధనకే ఈ పదాలు అక్కరకు వచ్చినా, కాలక్రమాన్న ఏ కథను పోతపోయుటకైననూ పనికి వచ్చినవి. బలిసిన చేనులో పడి, చేతికందిన పనలన్నీ కోసి 'పొంజెత్తుట' లో అందరు కూలివారికీ లయ కుదరదు. ఏదో ఒకటి కుదిరించుటకు తుమ్మెదా అన్న పాదాంత పదాలు పనికి వస్తవి. ఈ మాటను అందరూచేరి పాడతారు.

తోటల్లాలోకి తుమ్మెదా, ఇరగబడి వచ్చింది తుమ్మెదా
దేవసిరినంది తుమ్మెదా, తేరగా వచ్చింది తుమ్మెదా
గొంతెమ్మ పెంచినా తుమ్మెదా, గొలుసుళ్ళానంది తుమ్మెదా
యీనిన వరిసేలు తుమ్మెదా, యీదివిడ దొక్కింది తుమ్మెదా
అల్లమూ చెడతిని తుమ్మెదా, పేడకడేసింది తుమ్మెదా
అంతట్లో ఆసేను తుమ్మెదా, కాపన్న వచ్చాడు తుమ్మెదా
ఎక్కడిది యీనంది తుమ్మెదా, ఏడాది యీనంది తుమ్మెదా
పండిన వరిసేలు తుమ్మెదా, పాయలడ తొక్కింది తుమ్మెదా
కట్టండి నందిని తుమ్మెదా, గాజుల్ల కంచాన్ని తుమ్మెదా
ఎయ్యండి నందికి తుమ్మెదా, ఏడుకట్లా చొప్ప తుమ్మెదా
పొయ్యండి నందికి తుమ్మెదా, గోలేలతో కుడితి తుమ్మెదా
అంటానె కాపన్న తుమ్మెదా, గొంతెమ్మ మేడాకు తుమ్మెదా
మేడల్లొ గొంతెమ్మ తుమ్మెదా, యేలాగూను వుంది తుమ్మెదా
ఉయ్యాల్లో గొంతెమ్మ తుమ్మెదా, వూగుతూ ఉన్నాది తుమ్మెదా
ఊగూగు గొంతెమ్మ తుమ్మెదా, సేరూలని పింది తుమ్మెదా
"ఎక్కడిది యీనంది తుమ్మెదా, యేడాది యీనంది తుమ్మెదా
గొంతెమ్మ పెంచినా తుమ్మెదా, గొలుసుళ్ళా నంది తుమ్మెదా"
మానంది కొట్టొద్దు కాపన్నా, మమ్ములా తిట్టొద్దు కాపన్నా
మా నంది బందెలా తుమ్మెదా, మేమిచ్చు తామయ్య తుమ్మెదా
సోలతో సోలెడు తుమ్మెదా, మాడలేసుకోని తుమ్మెదా
ఇదిగోర కాపన్న తుమ్మెదా, మా నంది బంది తుమ్మెదా
ఇక్కడకు తీరదు తుమ్మెదా, మీ నంది బంది తుమ్మెదా
తవ్వతో తవ్వడు తుమ్మెదా, మాడలేసుకోని తుమ్మెదా
        ...    ...    ...    ...    
మానెతో మానెడు తుమ్మెదా, మాడలేసుకోని తుమ్మెదా
        ...    ...    ...    ...
అడ్డతో అడ్డెడు తుమ్మెదా, మాడలేసుకోని తుమ్మెదా
        ...    ...    ...    ...
కుంచముతొ కుంచెడు తుమ్మెదా, మాడలేసుకోని తుమ్మెదా
        ...    ...    ...    ...
పన్నెండు చెంగులు తుమ్మెదా, పట్టు పంచలూను తుమ్మెదా
పట్టుమన కాపన్న తుమ్మెదా, పైమీద కప్పింది తుమ్మెదా
చాలునని కాపన్న తుమ్మెదా, సంతోష పడ్డాడు తుమ్మెదా
మేడలో గొంతెమ్మ తుమ్మెదా, ఏలాగూ నందో తుమ్మెదా
పొరుగూరి చేలోకి తుమ్మెదా, పోబోకు నందో తుమ్మెదా
పొరుగు బందులు మాకు తుమ్మెదా, తేబోకు నందన్న తుమ్మెదా
కట్టండి నందినీ తుమ్మెదా, గాజుల్ల కంబాల తుమ్మెదా
వెయ్యండి నందికీ తుమ్మెదా, వెయ్యికట్లా చొప్ప తుమ్మెదా॥
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - goMtemma pATa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )