దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

012. నీలాటి రేవు


ఎంతసేపూ పొలము ఘోషయేనా? ఈ వెన్నెల పదము వినండి. ఇది కోత సమయంలో పాడుకున్నా, ఆరుబయట వెన్నెలలో పక్కలు వేసుక పండుకుని పాడుకున్నా, పండిన జొన్నకంకులు పళ్ళెములలో పేర్చి ఇంటింటికీ తిరుగుతూ వినోదార్థము పాడినా అందగిస్తుంది. ఆరీతిగా పాడతారు కూడాను.

ఆగరగ పట్టింది యెన్నెలా, నీళ్ళాకు వచ్చింది యెన్నెలా
పాపేడి సెట్టెక్కి యెన్నెలా, పలుకర్రయిన యిరిసి యెన్నెలా
పగడాల రాయెక్కి యెన్నెలా, పలువరస తోమింది యెన్నెలా
ముత్యాల రాయెక్కి యెన్నెలా, మునిపల్లయిన తోమె యెన్నెలా
నలుపైన రాయెక్కి యెన్నెలా, నాలుకైన గీసొ యెన్నెలా
ముడికీడు నీళ్ళలో యెన్నెలా, మొకమైన కడిగింది యెన్నెలా
చేరెడు నీళ్ళల్లొ యెన్నెలా, చెయి జెబ్బాలు కడిగొ యెన్నెలా
సుట్టుజల్తరిసాపు యెన్నెలా, సుమ్మల్లు సుట్టిందొ యెన్నెలా
ఆగరగ ముంచింది యెన్నెలా, ఒడ్డునా బెట్టింది యెన్నెలా
అట్టు ఇటు సూసింది యెన్నెలా, ఎవ్వారు లేరయ్యె యెన్నెలా
గట్టుమీది కామన్న యెన్నెలా, గరగెత్తి పోరయ్య యెన్నెలా
నీకు గరగెత్తితే యెన్నెలా, నాకేమి యిస్తావు యెన్నెలా
నాకు గరగెత్తితే యెన్నెలా, నా పాడావు నిస్తాను యెన్నెలా
నీ పాడావు నాకొద్దు యెన్నెలా, నీగరగ నేనెత్త యెన్నెలా
నాకు గరగెత్తితే యెన్నెలా, నా గున్నెద్దు నిస్తాను యెన్నెలా
నీగున్నెద్దు నాకొద్దు యెన్నెలా, నీగరగ నేనెత్త యెన్నెలా
నాకు గరగెత్తితే యెన్నెలా, నా నాగరం యిస్తాను యెన్నెలా
నీ నాగరం నాకొద్దు యెన్నెలా, నీగరగ నేనెత్త యెన్నెలా
అయి అయితే నీ మనసు యెన్నెలా, నేనే వస్తాను యెన్నెలా

గరగ యెత్తిన మాత్రానికే ఈ జాణ తానే వెంట వస్తుందట! కామన్న ఏమి తక్కువవాడా? ఆవూ, ఎద్దూ, నాగరమూ ఏదీ వద్దట! ఆయనగారు కూడా ఆఖరిమాట కొఱకనే ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తాడు. ఈ సరసాలు సహజంగా ఈ రూపాన్న జరిగేవి కావనీ, ఇవి కల్పనలే అనీ ఈ పాటలో చక్కగా తెలుస్తుంది.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - nIlATi rEvu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )