దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

026. ఓ చిన్నదాన


"జంబైలే జోరు లంగరు" అన్నది తుమ్మెదా, వెన్నెలా, గునాసారి గున్నమ్మా వంటి పాదాంతం పదావళే (పల్లవి కాదు). ఈ పాదాంత పదావళితో ఎన్ని పాటలైనా వినబడుతాయి. జంబైలే జోరు లంగరు "కొండామీదా కోడిపెట్ట" అన్న ఇంకొక పాట పూర్తిగా దొరికినది కాదు. కూలివారందరూ "జంబైలే జోరు లంగరు" అని కలిసి పాడుతారు. కల్పనాకారుడొకడు మాటలు అల్లుతాడు. ఈ అల్లిక సొగసును బట్టి వారప్పుడప్పుడు గొల్లుమంటుంటారు కూడా.

రోడ్డు రోలరు లాగుకుంటు పోయే కూలీల పాట చూడండి. లిబిడో ఇంకొక అడుగు వేస్తుంది.

    ఓ చిన్నదానా విడువనె చెంగు
    ఓ చిన్నదానా వదలనె కొంగు

బందారు చిన్నదాన బాజాబందూల దాన
బాజా బందూల మీద మోజేల లేదే
॥ఓ చిన్నదాన॥
గుంటూరు చిన్నదాన గుళ్ళాపేరులదాన
గుళ్ళాపేరుల మీద కళ్ళూ పోలేదే     
॥ఓ చిన్నదాన॥
కాకినాడ చిన్నదాన కాసూల్‌ కంటేలదాన
కాసూల్‌కంటేల మీద మనసేల లేదే
॥ఓ చిన్నదాన॥
అర్ధారూపాయి బెట్టి అద్దాల రయిక కొంటె
అద్దాల రయిక మీద బుద్ధేల లేదే
॥ఓ చిన్నదాన॥
నల్లా నల్లాని దాన నడుమూ సన్నాని దాన
తళుకూసేపల మల్లె కులుకూ సూపులదాన
॥ఓ చిన్నదాన॥
నిన్ను సూసీ మనసు నిలవకున్నాదోలె ॥ఓ చిన్నదాన॥

ఈ పాటల లోని దీర్ఘాలూ, యతిప్రాసలున్నూ బృందగానమున్నూ దారిని పోయే బాటసారుల నెందరినో పట్టి అలరించగలవు. అలరించును గూడ. పాడుకుంటూ రోలరు లాగే జట్లు నేటికీ సుందర సామగ్రియే. కనుకనే కవికొండల వేంకటరావు గారు కూలియన్నల (ఈ) కుతుకమును ఒక ఖండకావ్యములో ఇమిడ్చినారు.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - O chinnadAna - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )