దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

038. రోకటి పాటలు


రోకటి పాటలు - విన్నకోట పెద్దన్న చెప్పినట్లు, తరువోజ నుంచి అవతరించాయి. నన్నయ పూర్వపు శాసనాల్లో ఈ పాటల వరుసలు చాళుక్య నృపులు చేయించిన సంస్కారముతో కనపడతాయి. పన్నెండో శతాబ్దపు నన్నె చోడుడు, శబర కామిని గౌరుకొమ్ము రోకట వెదురుబ్రాలు పటికపు ఱోల బోసి దంచుచు జంగమలింగమును పాడిన రీతిని చక్కగా వర్ణించినాడు. పాల్కురికి సోమన్న గారి ప్రభావము వల్ల తెలుగునాట బలిసిన ద్విపదల బలము రోకటి పాటల్ని కూడా ఆ మూసలోనే రంగరించినది. అప్పటికీ ద్విపదలలో కనపడని అయిదక్షరాల ఆవృతాలీ పాటలలో విరివిగా కనపడుతూ వీటి మాతృక అయిన తరువోజ పోలికను చూపిస్తవి.

విసురురాతి పాటలూ, రోకలి పాటలూ, (విశాఖ మండలపు) జోలలూ ఒకే వరుసలో నున్నప్పటికీ వీటి వస్తువులో భేదములు లేకపోలేదు. విసురురాతి పాటలు సోదరుని అభిమానమూ, పొడుపు కథ వంటి సమస్యా, పుట్టింటి అందమూ, ప్రేయసి పరివేదనమూ వంటి అనుభవ బీజముల చుట్టున్నూ అల్లిన అందపుగూళ్ళు. విసిరేవారు ఇద్దరే. వినేవారెందరో ఉండరు కనుక, విసురురాతి పాటలు అనుభవాన్ని తనకే చెప్పుకుంటూ నెమరు వేస్తున్నట్టుంటాయి. రోకటితో దంపుతున్న ఆయాసములో కల్పన సాగటానికి అవకాశము తక్కువ. తల్లియైన తరువోజను బట్టి నాలుగు పాదాలకూ, ద్విపద ప్రభావాన్ని బట్టి రెండు పాదాలకూ దిగుతుంది రచన. వినటానికి అయిదారుగురుంటారు కనక, రోకటి పాటలు స్వగతాల మాదిరి కాక ఒకరిని సంబోధించినట్టే ఉంటాయి. వాటి పొడవు చిన్నది కనుక అనుభవసారమంతా వాటిలో మాత్ర గట్టినట్టు వుంటుంది. వీటినన్నిటినీ సేకరించి వేసినట్లయితే భారతమంత గ్రంథమౌతుంది. మచ్చుకు ఏవో కొన్ని.

1
నాచేతి రోకళ్ళు నల్లరోకళ్ళు
చేయించు అన్నయ్య చేవరోకళ్ళు
వేయించు అన్నయ్య వెండి పొన్నుల్లు
సువ్వని నేనొక్క పోటేసితేనూ
చుక్కలు పిక్కటిల్లు సూరన్న కదలు
అస్సని నేనొక్క పోటేసితేనూ
ఆకసమ్మూ కదలు ఆరాజు కదలు

2
ముగ్గురన్నల తోడ నే బుట్టినాను
నా నడుము మువ్వంచు చీర గోరింది
నలుగురన్నల తోడ నేబుట్టినాను
నా నడుము నల్లంచు చీరగోరింది
అయిదుగురన్నల తోడ నే బుట్టినాను
నా వొళ్ళు అద్దాల రవిక గోరింది

3
కోడలా కోడలా కొడుకు పెళ్ళామా
పచ్చిపాల మీది మీగడ ఏదీ
వేడి పాలమీది వెన్నలు యేవీ?
నూనె ముంతల మీద నురుగులు యేవి?
అత్తరో ఓ అత్త ఆరళ్ళ అత్త
పచ్చిపాల మీద మీగడుంటుందా
వేడిపాల మీద వెన్నలుంటాయా
నూనె ముంతల మీద నురగలుంటాయా
ఇరుగుపొరుగులార ఓ చెలియలార
అత్తగారారళ్ళు చిత్తగించండి
పెత్తనం లాగేస్తే పేచీలు పోను

4
కారాలలోకెల్ల రెండు కారాలు
ఉప్పుకారమొకటి ఉపకారమొకటి
వాసాలలోకెల్ల రెండు వాసాలు
రాణివాసా మొకటి విశ్వాస మొకటి
కుంటలలో కెల్ల రెండు కుంటల్లు
వడ్లకుంటా ఒకటి వైకుంఠ మొకటి

5
ఆడదాన్నీ నేను అయిపుడితి గాని
గండ్రగొడ్డలి క్రింద కొమ్మనైన జాలు
గొడ్రాలు బ్రతుకేల కోటిధనమేల
స్వారాజ్య మిచ్చినా సవతి పోరేల
చూడకా ఆడేరు చూచి ఆడేరు
కానకా ఆడేరు కల్లలీ ప్రజలు
పాటలు పాడితే పలవలంటారు
పాడకుంటే జనులు మూగదంటారు

6
పాపమ్ము చేసుకుని బావిలో పడితే
పైమురికియే గాని పాపాలు పోవు
చేటుకాలమట్ర శంకరుడ నీకు?
ఆలిమీది పెండ్లి యెట్లాడినావు
ఊరి ముందర చేను వెయ్యబోకన్న
ఊళ్ళోను వియ్యమ్ము చెయ్యబోకన్న
ఊరి ముందర చేను కాకుల్ల పాలు
ఊళ్ళోన వియ్యమ్ము కయ్యాలపాలు
చేను మంచీదని చెప్పబోకన్న
చెరుకన్న రాజనం పండిన్న దాక
ఆలిమంచీదని అనబోకురన్న
అదివచ్చి మనలోన అణిగిన్న దాక
అత్తింటి కోడలవు కావుగావున్నె
ఆజ్ఞసిగ్గుల్లు నీకు లేవుగావున్నె
వీపునిండా కొంగేదె ఇరువరసలేవె
మడమ తిరగ బట్టేదె? మాటవాసేదె?
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - rOkaTi pATalu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )