దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

042. గొబ్బి పాట


పిల్లలు ఆటలాడుతూ పాడే పాటలు చాలా ఉన్నవి. వాటిని పల్లెపదాలనటం కంటె బాలగేయాలనటం మెరుగు. వారి ఆటలపాటలలో లయ, యతిప్రాసలూ తప్ప మానవుల ఊహలున్నూ, ఉద్దేశాలున్నూ ఉండవు. (ఇంగ్లీషులో బాలగేయాలను ప్రాసక్రీడలనే అన్నారు గాని పాటలనలేదు.) ఈ బాల్యావస్థ దాటిన ఆటలుపాటలు గొబ్బిపాటలేనని అనిపిస్తుంది.

గొబ్బి కాటమరాజు కథలో మొదట కానవస్తుంది. క్రీ.శ.1424 నుండి 1503 వరకూ జీవించిన అన్నమయ్య గారి సంకీర్తనములలోని "కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల సామికిని గొబ్బిళ్ళో" అన్న కీర్తనను బట్టి "గొబ్బిళ్ళు" అంటే నుతులు, పూజలు అన్న అర్థము వస్తుంది. ఈ శతాబ్దారంభములో 'స్త్రీలపాటల' నచ్చువేసి ఈ వాఙ్మయాన్ని ఉద్ధరించిన నందిరాజు చలపతిరావు గారు దశమస్కంధ పూర్వ భాగము, ప్రశ్నోత్తర గొబ్బిపాట, చూడికుడుత్తాళ్‌ మీది గొబ్బిపాట అని మూడు పాటల నచ్చువేసినారు. ఈ పాటలలో గొబ్బీయళ్ళో, గొబ్బి అన్న మాటలు నుతులు అన్న అర్థముతోనే కనబడుతున్నవి. "గొబ్బిపాట" అన్నమాట "గొబ్బిళ్ళ పాటల వరుసలోని పాట" అన్న అర్థముతో ఉన్నది. కనుక గొబ్బిపాటలు ఒకవరస గల పాటలున్నూ, "గొబ్బీయళ్ళో" అన్న మాటలు తుమ్మెదా, వెన్నెలా వంటి పాదాంత పదములూ నన్నమాట. గొబ్బిపాటల వస్తువు సామాన్యముగా పౌరాణికముగానే ఉంటుంది. మచ్చుకి ఒకటి.

గంగమ్మ గౌరమ్మ అప్పసెల్లెండ్రూగొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో
ఒకతల్లి బిడ్డలకు వైరమూ లేదు""
మంచి మంచి పూలేరి ఒకరాసి పోసిరి""
కానరాని కలువలేరి ఒకరాసి పోసిరి""
ఏడుమూర లింటిలో ఏడొక్క తూము""
ఏడొక్క తూమేసి ఎల్లా కొలిపించె""
పొగిడి ఒక తూమేసి పారా కొలిపించె""
గంపెడు తీసేసి గంగాకెత్తండీ""
మంచి మంచి పూలేరి మామయ్యకంపే""
కానరాని పూలేరి గౌరమ్మకంపె""
అక్కనూ చెల్లినీ ఒక్కరీకిచ్చె""
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - gobbi pATa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )