దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

043. చందమామ కోపు


మన జాతీయజీవనంలో యువకులకునూ, తరుణవయస్కులకునూ ఆటలు లేవు. కోలాటమొక్కటి కాబోలు ఆట అనటానికి వీలయినది. దీనిలో వర్ణచలనమూ, వేషసామరస్యమూ, గమన సామరస్యమూ, మువ్వలమ్రోత కోలలలయ, రాగసరళీ, కంఠమేళ, కథాసౌందర్యమూ ఒక్కుమ్మడిగా ఏకమయి అలరిస్తవి. జట్టు నాయకుడు ఒక చరణము పాడితే వర్తులాకారంలో ఉన్న జట్టువారు ఆ చరణాన్ని తిరిగి పాడతారు. అందరూ చిన్న చిన్న కట్టెలతో లయను సూచిస్తూనే పాడతారు. నాయకుడు నడిపే కథలో ఉత్సాహపు పట్టు వచ్చినప్పుడు, ముందుకూ వెనుకకూ అడుగులు వేయటమూ, పక్కవానిని చుట్టిపోయి పైవానితో కోలకొట్టి తాళము నిలపటమూ, ఆటగాండ్రు చాలామంది దొరికితే లోకక్ష్య వెలికక్ష్య సవ్యముగానూ, అపసవ్యముగానూ తిరగటమూ కనబడతాయి.

కోలాటపు పాటలు సామాన్యముగా చతురశ్రగతిలో కిటతక కిటతక అనో, త్రిశ్రగతిలో తకిట తకిట అనో నడుస్తవి. వీటిని కోపులంటారు. మొదటిది విఘ్నేశ్వర కోపు. "శివ శివ మూర్తివి గణనాథ, నీవు, శివుని కుమారుడవు గణనాథ" అని ప్రారంభిస్తుంది. సరసకోపు అనే "గొల్లవారి వాడలకు కృష్ణమూరితీ, నీవు, ఏమి పనికొచ్చినావు కృష్ణమూరితీ" అన్నపాట అన్నమయ్య గారి కాలానికే ఉన్నట్లు దీన్ని అనుసరించిన అతని సంకీర్తనలు పెక్కులు సాక్ష్యమిస్తవి... కోలాట కీర్తనలు దేశిసారస్వతములోని ఒక ప్రత్యేక అధ్యాయము. పురాణగాథా సన్నివేశాలూ, భక్తుల తీర్థయాత్రలూ, గోవాళ్ళ సంవాదాలూ, వేదాంత తత్వాలూ, బ్రతుకుబాటలూ, గురు ప్రశంసలూ, మోహప్రలాపాలూ అన్నీ వుంటవి ఈ పాటలలో. తెలుగులో ప్రాస్తావిక పద్యమంజరులు (poems) లేవు; ఈ కోపులు ఆ సీట్లలో చక్కగా అమిరిపోతవి... మనము కీర్తన అనుకునే "రామలాలీ, మేఘశ్యామ లాలీ, తామరస నయన దశరథ తనయా లాలీ" అన్నది లాలికోపు. 'తెల్లవారవచ్చె తొలికోడి కూసెను నల్లాని నాసామి లేరా' అన్నది మేలుకొలుపు కోపు. 'రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం' అన్నది మంగళహారతి కోపు. పూర్వకాలపు పాటలలో ఈ కోపులు కలిసిపోయి ఉంటవి. దరువు, కోపు, పదము, కీర్తన, జావళి వీటి పుట్టువూ, వృద్ధీ కనిపెట్టటము అందమైన పని. అది జరగవలసి ఉన్నది.

ఇక్కడ ఉదహరించిన కోపులు నేటరేపట తెలుగునాట వినిపించే పాటలే.

చందమామ చందమామ చందమామా
అందచందాల ముద్దు చందమామా
పాలకడలి తరగలందు చందమామా
బాలుడవై బుట్టినావు చందమామా
ఫాలాక్షు శిరమునందు చందమామా
బాల చంద్రరేఖ వీవు చందమామా    ... చంద
పాలుత్రాగు పిల్లలాకు చందమామా
పాలవిల్లి బంతివీవు చందమామా
చల్లగ మాతోడు రావొ చందమామా
చందమామ చందమమా చందమామా
అందచందాల ముద్దు చందమామా    ... చంద

ఈ కోపులలో పాండిత్యమూ, భాషా సంస్కారమూ కనబడతవి. నాయకుడు చదువుకున్నవాడే అవుతాడు సామాన్యంగా. అంటే అక్షరాల పండితుడని కాదు, శ్రుత పండితుడనుట.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - chaMdamAma kOpu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )