దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

045. చెంచులక్ష్మి కోపు


స్త్రీ:-ఎక్కాడి వాడవు । యిక్కాడి కొచ్చేవు
ఎక్కువగ, మాటలేరరా । మగవాఁడో
    చక్కంగ మళ్ళిపోరా ॥ఎ॥
వగచి నా వంక జూచి । ఎగసి గంతేసేవు
ముంగటముల్లు నాటెర । మగవాఁడ
    వెనకాల యంబు నాటెర ॥ఎ॥
పు:-కూకోవొలె చెంచీత । కుదిరి మద్దిళ్ళ సందు
కుదురూగ ముల్లు దీయవె? ఓలె చెంచు
    వెనకాల యంబుదీయవె ॥కూ॥
స్త్రీ:-మాటామాటకు నన్ను । ఓలె చెంచా నేవు
పట్టి బాణాన వేయింతు । మగవాఁడో
    పంచ బాణాన వేయింతు ॥మా॥
పు:-కట్టింతు నేయిల్లు । కారండపడవిలో
ఎత్తింతు పసిడికుండలు । ఓల చెంచూ
    వెయ్యింతు చిలుకు జవ్వాయి ॥క॥
స్త్రీ:-ఆరె? ఆరే? నీవు । ఆగడముకొచ్చేవు
అదురూ, బెదురూ । లేదటరా! మగవాఁడ!
    ఆగడములు మానరా! ॥అ॥
పు:-సన్న బియ్యము తెచ్చి । చావట్లో ఉంచాను,
వంటైనా వండగలవా? ఓలె చెంచూ!
    వండైన చూపగలవా? ॥స॥
స్త్రీ:-వెదురు బియ్యము తిను । మా చెంచు వారికి
సన్నా బియ్యములేలరా! మగవాఁడ!
    సన్నబియ్యము లెందుకు? ॥వె॥
పు:-సన్న చీరలు తెచ్చి । దణ్ణాన వేసాను
కట్టైన కట్టగలవా? ఓలె చెంచూ!
    కట్టైన చూపగలవా? ॥స॥
స్త్రీ:-పారుటాకులు గట్టు । మా చెంచువారికి
సన్న చీరెలు యేలర! మగవాఁడో
    సన్న చీరెలేలరా ॥పా॥

వెర్రి నరసింహ స్వామి. తెలుగునాటి చెంచుబిడ్డను వలచి యెంతో యాశపడినాడు! అందుకే పాడుకోగలిగినారు "అందమైన ఆడపడుచులు చెంచువారికెందుకు? పొంచి పొంచి ఓబళేశుడెత్తక పొయ్యేటందుకు" అని చెంచువారు.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - cheMchulakShmi kOpu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )