దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

046. జారిణి కోపు


ఇది వినండి తెలంగాణ కోలాటపు పాట.

గట్టూకు బొయి నేను - కట్టేలు తెమ్మంటె
కొప్పునున్నా పూలు - ఎక్కడివె భామా? నీ
కొప్పునున్నా పూలు - ఎక్కడివె భామా?
ఆత్తేరి పూలు - ఎక్కడివె భామా
ధూత్తేరి పూలు - ఎక్కడివె భామా

గాలి ధూళీ వచ్చి - గంపంత మబ్బొచ్చి
కొమ్మ ఊగి కొప్పు - నిండింది మగడా
కొమ్మ ఊగి కొప్పు - నిండింది మగడా
నాతోడు రంకాడలేదు - అబ్బతోడు రంకాడలేదు
నీతోడు రంకాడలేదు - అమ్మతోడు రంకాడలేదు

అన్నీ సరే కాని - ఇన్నీ సరే కాని
కొంగు నిండా దుమ్ము - ఎక్కడిదె భామా? నీ
కొంగు నిండా దుమ్ము - ఎక్కడిదె భామా
ఆత్తేరి దుమ్ము - ఎక్కడిదె భామా
ధూత్తేరి దుమ్ము - ఎక్కడిదె భామా

పాటేలు ఇంటికీ - పాలకని పోతేను
కఱ్ఱి కోడె కాలు - దువ్వింది మగడా
కఱ్ఱి కోడె కాలు - దువ్వింది మగడా
నాతోడు రంకాడలేదు - అబ్బతోడు రంకాడలేదు
నీతోడు రంకాడలేదు - అమ్మతోడు రంకాడలేదు

అన్నీ సరే కాని - ఇన్నీ సరే కాని
చెంప నున్న కాట్లు - ఎక్కడివె భామా? నీ
చెంప నున్న కాట్లు - ఎక్కడివె భామా
ఆత్తేరి కాట్లు - ఎక్కడివె భామా
ధూత్తేరి కాట్లు - ఎక్కడివె భామా

కోమటోరింటికి - కొబ్బరికి బోతేను
తక్కెట్లొ గుండొచ్చి - తగిలింది మగడా
తక్కెట్లొ గుండొచ్చి - తగిలింది మగడా
నాతోడు రంకాడలేదు - నీతోడు రంకాడలేదు
అమ్మతోడు రంకాడలేదు - అబ్బతోడు రంకాడలేదు

అన్నీ సరే కాని - ఇన్నీ సరే కాని
మంచం క్రింది వాడు - ఎవ్వాడె భామా? నీ
మంచం క్రింది వాడు - ఎవ్వాడె భామా?
ఆత్తేరి వాడెవ్వాడె భామా
ధూత్తేరి వాడెవ్వాడె భామా

ప్రక్క ఇంట్లుండేటి - పడుసు పిల్లోడు
పిల్లీకి తలనొస్తె - నల్లి కొచ్చిండు
పిల్లీకి తలనొస్తె - నల్లి కొచ్చిండు
నాతోడు రంకాడలేదు - నీతోడు రంకాడలేదు
అమ్మతోడు రంకాడలేదు - అబ్బతోడు రంకాడలేదు

'కోపులు ముడిభావాలు కాదు, రచన'లనటానికి ఇది చక్కని ఉదాహరణము. కొమ్మ దూగి కొప్పునిండుట వల్ల వచ్చే లేనిపోని రవ్వలు అన్ని పాటలలోనూ కనబడతవి. "ఏమే పిల్లా మదారి బూబూ కుంకుం సెదిరిందే, లమిడీ కుంకుం సెదిరిందే" అని అడిగితే, " ఉడుకుడుకన్నం ఊపుకుతింటే, కుంకుం సెదిరిందే మామా" అన్న జవాబు గల పాట కూడా ఈ కోవ లోనిదే. నల్లిని చంపిన వాసన తలనొప్పికి మందని తెలంగాణమున వెల్లడే. తక్కినవారికేమొ? తెలీదు.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - jAriNi kOpu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )