దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

057. కోలాటం పాట


జానపదుల హృదయము బహుసున్నితమైనది. శౌర్యాన్ని అరమర లేకుండా పూజిస్తుంది. ఆవగింజంత అన్యాయానికి కూడా సహించదు. కుత్సితుని వీరము కనబడినా కళ్ళుమూసుకోదు. వాని ఠీవి, రాజసమూ ఏదో గుణాన్ని ఎక్కడికక్కడే మెచ్చుకుంటుంది. హంతకుడి నైనా సరే చిత్రవధ చేస్తే భరించలేదు. జాలిపాటలు పాడుకుంటుంది. లోకోపకారికి సాష్టాంగము పడుతుంది. తెలుగులో సుదీర్ఘ వీరగాథలు పెక్కులు గలవు. ఇక్కడ ఇచ్చినవి చిన్న రచనలు.

మొదటిది కోలాటం పాట, ఓబులరెడ్డి కోపు (ఖండగతిలో నడవటం వింత). పై దళము రాకుండా అశ్విక దళాన్ని అడ్డిన దాతని జెండా. తెలుగునాట నిట్టి అజ్ఞాత వీరులు ఊరున కొకరు. హండేవారు దోపిడి నడిపినప్పుడు మరుట్లపాళెపు గొల్ల చిన్నమ్మ కొడుకు చిన్నమల్లేశ "కోటకొమ్ము లెక్కినాడు, కోటికూతలేసినాడు, బుజం మింద బల్లెమిసిరి మొలకమీసం దిద్దినాడు". ఆ వీర వంగడము లోని వాడే ఓబులురెడ్డి.

కోలు కోలన కోలు కోలన్నా కోలే
కోలు మాయకు బాల నరసింహ కోలే
గుట్ట గురప్ప కొండ గురి దప్పకుండా
పై దళము రాకుండా పడెరా నీ జెండా
సైరా ఓబులురెడ్డి నెలవన్నెకాడా
నిను జూచి నా గుండె జలు జల్లుమనెరా    ॥కోలు॥
నీకు పూలూ నీదు కత్తికీ పూలూ
నీ చేతికీ వన్నె బంగారు రవలు
ఎర్రాది గుఱ్ఱము వెండి కళ్ళెమురా
దూకించె గుఱ్ఱాన్ని దుమ్మెల్ల రేగా
బూడిద గుఱ్ఱాము బుగడ కళ్ళెమురా
బుగడ కళ్యాణికి బొండు మల్లెలురా    ॥కోలు॥

వీరపూజలో తెలుగుబిడ్డ ఎన్నడూ వెనకాడలేదు, నీచుని తెగనాడుటలోనూ ఆలసింపలేదు.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - kOlATaM pATa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )