దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

061. వీరభద్రా రెడ్డి


వీరభద్రా రెడ్డి కథే వేరు. ఇది మా ప్రతాపరెడ్డి గారి సేకరణ. ఈ గేయములోని వీరభద్రా రెడ్డి శ్రీనాథ కవి సార్వభౌముని ప్రభువే అయి యుంటే తెలుగులో ఇదే అతి ప్రాచీనమైన జానపద గేయము.

రెడ్డొచ్చే రెడ్డొచ్చే రెడ్డొచ్చేనమ్మా వీరభద్రా రెడ్డి విచ్చేసెనమ్మా
పొద్దున్నె మా రెడ్డి పొరకూడిపించు
    నిలువెల్ల నడివీధి నీరు జల్లించు
॥రెడ్డొచ్చె॥
సందుగొందులలోను సాన్పు పోయించు
    చీకట్ల పసుపుకుంకుమలు పూయించు
॥రెడ్డొచ్చె॥
రంగవల్లుల నూరు రాణింప జేయు
    తోరణాల పంక్తులా తులకింపజేయు
॥రెడ్డొచ్చె॥
దివ్వెలను వెలిగించు దివ్యమార్గాల
    మాపెల్లి పాలించు మంచిమార్గాల
॥రెడ్డొచ్చె॥
ఎండలకు పందిళ్ళు వేయించువాడూ
    పొందుగ మారేళ్ళు కోయించు వాడూ
॥రెడ్డొచ్చె॥
ఊరిబావుల లోన ఉప్పుసున్నాలా
    వెదజల్లు నేటేట నిండుపున్నానా
॥రెడ్డొచ్చె॥

చల్లని ఇంపైన గేయము కూడాను! ఈ సంపుటములోనే భక్తిగేయాలలో ఇచ్చిన "శివశివయన మేలు తుమ్మెదా, శివయంటేను వినమేలు తుమ్మెదా" అన్నది దీనికంటె ప్రాచీనము (అనగా పాల్కురికి సోమనాథుని కాలము నాటిది) కావచ్చును కాని 'అవును' అని నిశ్చయముగా చెప్పలేము. దీనిలో వీరభద్రా రెడ్డి పేరు కలదు; పలునాటివే ననటానికి ఆక్షేపణ లేదు.

వీరగాథలను రచింపజేసే ఉత్సాహమూ, మెప్పుదల, ఒక్కొక్కప్పుడు దుఃఖమూ ప్రాస్తావిక పదములకు కూడా కారణమౌతవి. వీరుల జీవితములూ, వీరకృత్యములూ అనుకోకుండా వచ్చేటివే కద! అట్లాగనే ఆర్బతునాటు కంపెనీల ముచ్చట, గోదావరి పుష్కరాలు, బియ్యపు కంట్రోలు అన్నవి ఒక్కొక్క సమయానికి అవతరిస్తవి.

మొన్న వచ్చిన గోదావరి వరదలపై యెన్ని పాటలో వచ్చాయి. 'ఎల్లమ్మ చెరువు ఏరు' ఏనాడో పొంగి రైలుతో సహా రైలు వంతెనను కొట్టివేసిన పాట ఒకటి ఉన్నది. రాజకీయ గేయములు కూడా ఒక ఉద్యమాన్ని బట్టి బయలుదేరినవే. పొట్టి శ్రీరాములు గారి మీద "జోహార్‌ జోహార్‌" అన్నపాట చక్కనిది బయలుదేరినది, "అల్లూరి సీతారామ రాజా" అన్నది వీరగేయమే.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - vIrabhadrA reDDi - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )