దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

062. యేనాది పిల్ల


కవులు జీవిత సందర్భానుసారముగా చాటు పద్యములను చెప్పినట్లుగా దేశిజనులు బ్రతుకు బాటలలోని అనుభవములనే పాటలుగా నల్లుకొందురు. కవుల అనుభవాల కంటె ప్రజల అనుభవాలు నిసర్గములున్నూ, బహుముఖాత్తములున్నూ అవుతవి. అందువల్ల జానపద గేయముల వైశాల్యము సముద్రప్రాయమై ప్రతిముఖ రసోత్పన్నమౌతుంది. ఈ దళమునందు ఉదహరించిన గేయములు దేశి జనుల బ్రతుకు బాటలను లీలగా మాత్రమే సూచింపగలవు.

జానపద గేయములు జీవిత ప్రతిబింబాలు గాని ఆశురచనలు కావని నిరూపిస్తుంది ఈ గేయము. చూడండి ఈ సుకుమారి సురటి మాటలు. ఈమె జానపదుల సుందర సృష్టి.

ఏవూరు యేనాది పిల్లా నీది
మాటలకు మోటుపల్లి మామానాది
సిగ్గులేని చీనిపల్లె మామానాది
మానం లేని మాదిగ పల్లె మామా నాది
కట్టెలకన్న పోరాద పిల్లా నీవు
కట్టెలంటె కాళ్ళు నొస్తై మామా నాకు
నీళ్ళకన్న పోరాద పిల్లానీవు
నీళ్ళంటె నీరాసం మామా నాకు
వడ్లన్న దంచరాద పిల్లానీవు
వడ్లంటె చేతులు నొస్తై మామా నాకు
సంతకన్న పోరాద పిల్లానీవు
సంతంటె సంతోషం మామా నాకు
సంతోషం సంతోషం సక్కిలిక్కిలిగా
బుద్ధిమంత కూతురే బుడిగిలిక్కిలిగా

కడసారి పంక్తులు ఒక్క పొంగుతో పైకి వస్తున్నవి.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - yEnAdi pilla - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )