దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

064. అవిరేడు మంగళ హారతి


ఈ రెండవది అవిరేణి పాటయే. తలంబ్రాలు పోయించిన తరువాత శిరస్స్నానాలు వధూవరులకు చేయించి, పెళ్ళి పీటలమీద ఆశీర్వచనాలు చేసి, అరుంధతికి మ్రొక్కించి పేరంటాండ్రతో అవిరేడు వద్దకు తీసుకుపోయి వధూవరులచేత అవిరేడునకు మ్రొక్కించి ఈ మంగళహారతిని పాడుదురట.

జయ మంగళం। నిత్య శుభ మంగళం!
జయ జయా! మంగళం। మహోత్స మంగళం
॥జ॥
దివ్యాంబరములు గట్టి। దీపాల వెలుగున
నవ్వుచూ మహలక్ష్మి। నాట్యమాడా
యిలవేల్పు నీవు। వెలసితివి మాయింట
॥జ॥
సిరిగజ్జెలను గట్టి। చిందులు ద్రొక్కుచు
సిరిలక్ష్మి మాయింట। స్థిరముగానూ
యేకచిత్తంబున। యెప్పుడు కలకల
బాయక, భక్తిలో। నుందువమ్మా
॥జ॥
మల్లెతోటలోను। మసలుతూ! మహలక్ష్మి
యెల్లలోకంబులు। యేలుతూనూ
యుల్లాసంబుతోను। యూరు పాలించుచూ
యెప్పుడు నుప్పొంగు। తుందువమ్మా
॥జ॥
కనక గద్దెమీఁద। కదలక కూర్చుండి
అడిగినప్పుడు మాకు। అభయమిచ్చి
కోరిన కోరికలు। కొనసాగింతువని
బలువయిన, పట్టు మేం। పడితిమమ్మా
॥జ॥
కొప్పు చక్కగ బెట్టి। గొజ్జంగులను ముడిచి
పమిడి, జల్తారు। పట్తుచీర గట్టి
రంగైన రత్నాల। రవికెను తొడిగిన
భక్త పోషిణి మమ్ము। పాలించవమ్మా
॥జ॥
ఆభరణములు తెచ్చి। అలంకరించి నీకు
పసిడి గొలుసులు తీర్చి। బాగుగ వేసి
గంటలొడ్డాణంబు। కన్నతల్లికి పెడుదు
కన్నబిడ్డలనుచు। కరుణించు తల్లీ
॥జ॥
అందముతో నీపను। లమరించినట్లు
తప్పులను బట్టక। దయను జూడు
యెప్పుడు నీపాద। యేకసేవ జేతు
యొప్పతో నీ యొద్ద। నుంచవమ్మా
॥జ॥

ఆడపడుచు అత్తవారింటికి కదిలే ఘట్టము గృహజీవనము లోని సుందర దృశ్యాలలో ఒకటి. ఈ పాటలో అత్తింటికి పోయే పడుచు పలుకుతున్నది.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - avirEDu maMgaLa hArati - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )