దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

078. ఏరాలు


వేరే పోవగనే సరికాదు. అక్కడనూ సమస్యలు కలవు. ఆ 'దుంగ' కంటె ఈ 'కొంగ' తోనే ఎక్కువ బాధ!

పు:-ఏరాల్ని తెస్తాను । ఇంటిలో పెడతాను
ఏరాలి మాట వినాలి । సుందరి పిల్ల
ఏరాలి మాట వినాలి । నాయుడోలమ్మీ
॥ ఏ ॥
స్త్రీ:-ఏకులొడుకుతాను । యేరొండి పెడతాను
యేరాలి పోరు పడలేను । సుందర మగడ
యేరాలి పోరు పడలేను । సోకుదారి మగడ
॥ ఏ ॥
పు:-వండిపెట్టలేవా । వడ్డించలేవా
కోనేటి నీళ్ళు తేలేవా । సుందరి పిల్ల
నామాట వినాలే । నాయుడోలమ్మీ
॥ ఏ ॥
స్త్రీ:-కూకుంటె లెగలేను । కూడొండి పెట్టలేను
కోనేటి నీళ్ళ కెళ్ళాలేను । సుందర మగడ
కానిమాట లనబోకు । సోకుదారి మగడ
॥ ఏ ॥
పు:-బంగారపు బొమ్మ । బెంగుళూరు గుంట
దాని నడుము నాగబంధములే । సుందరి పిల్ల
దాని నడక హంస నడకలే । నాయుడోలమ్మీ
॥ ఏ ॥
స్త్రీ:-దాని మాయలోను పడబోకు ! నాయుడుబావ
దాని సోకులోను దిగబోకు ! సుందర మగడ
దాని మాటలైన వినబోకు ! సోకుదారి మగడ
॥ ఏ ॥
పు:-వడ్డాణ మిదిగోయె । వయ్యారి భామా
నీనడుముకైన పెట్టుకోయె । సుందరి పిల్ల
నీ నడుము చక్కగుంటుందె । నాయుడోలమ్మీ
॥ ఏ ॥
స్త్రీ:-ఎప్పుడెట్టుకోవాలో । అప్పుడెట్టు కోవాలి
పండుగ పున్నానికి । సోకుదారి మగడ
అది అప్పుడెట్టు కోవాలి । నాయుడు బావ

తడికె పాట లోని చిన్న అలక వలె పెద్ద అలకలు కూడ నగతో పటాపంచలు!
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - ErAlu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )