దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

081. వియోగము


ఏ కారణము వల్లనో భార్యను పుట్టినింట విడిచి వచ్చినాడు యువకుడు. ఆమె అక్కడా, ఈతడిక్కడా బాధ పడుతున్నారు.

ఎన్నాళ్ళో ఈ బంధికానాలు । మాకెన్నాళ్ళో॥ఈ ॥
కదిలి వచ్చేనాడే । కారుమబ్బేసింది
కలికిరో నా యెల్లి । వెలవెల బోయింది
కందిన సెక్కిళ్ళ । కడవలలో బోసింది
కాటుక కన్నీళ్ళు । నీలాలు నాయెల్లి
॥ఎ ॥
గడియసేపయిన నన్‌ । విడిసినోడు కాడు
పడనార యేడాది । పాటైన కాలేదు
నడిమంత్రమున యింత । మిడిమేలమైపోయె
కడకు నా కాపురము । కడగళ్ళ పాలాయె
॥ఎ ॥
సీలమండా దాక । సిందాడు తలకట్టు
కలువ పూలు జుట్టి । కడవంత కొప్పెట్టి
పొలుపైన కుంకుమ్ము । బొట్టుకాటుక బెట్టి
గున్నటేనుగు మల్లె । గునగునా నడకలు నాయెల్లి
॥ఎ ॥
వలరాజు అందాల । వన్నెచిన్నెల రాజు
నిలువెత్తు నట్టిల్లు । నిండినా రాజు
మెలిరాని నూనూగు । మీసాల నా రాజు
కలలో రాతిరి వచ్చి । కనిపించి పోయాడు
॥ఎ ॥
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - viyOgamu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )