దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

085. బ్రతుకమ్మ పాట


బ్రతుకమ్మ పాటలు తెలంగాణములోనివే. అయితే ఈ పాటలో 'చందమామ' అన్న పాదాంత పదమున్నది. ఇంకొక పాటలో

- అది అచ్చు కూడా అయినది - వలలొ అనీ ఉయ్యాలొ అనీ పాదాంత పదములున్నవి. బ్రతుకయ్య విష్ణువు, బ్రతుకమ్మ లక్ష్మీ దేవి. బ్రతుకమ్మ పండుగలు మాత్రము తెలంగాణమున తప్ప వేరేచోట జరుగుతున్నట్టు మాకు తెలియదు. ఈ పాట గోవింద నామముల వరుసలో నుండుట విశేషము.

శ్రీలక్ష్మి దేవియుచందమామసృష్టి బతుకమ్మయ్యెచందమామ
పుట్టినా రీతిచెప్పె"    భట్టు నరసింహ కవి"
ధరచోళ దేశమున"    ధర్మాంగుడను రాజు"
ఆరాజు భార్యయు"    అతి సత్యవతి యండ్రు"
నూరునోములు నోమి"    నూరుమందిని గాంచె"
వారు శూరులయ్యు"    వైరులచే హతమైరి"
తల్లిదండ్రులపుడు"    తరగనీ శోకమున"
ధనరాజ్యముల బాసి"    దాయాదులను బాసి "
వనితతో ఆ రాజు"    వనమందు నివసించె"
కలికి లక్ష్మిని గూర్చి"    ఘనతపం బొనరించె"
ప్రత్యక్షమై లక్ష్మి"    పలికె వరమడుగుమని"
వినుతించి వేడుచూ"    వెలది తనగర్భమున"
పుట్టుమని వేడగా"    పూబోణి మది మెచ్చి"
సత్యవతి గర్భమున"    జన్మించె మహలక్ష్మి"
అంతలో మునులునూ"    అక్కడికి వచ్చిరీ"
కపిల గాలవులునూ"    కశ్యపాంగిరసులు"
అత్రి వశిష్టులూ"    ఆకన్నియను జూచి"
బ్రతుకుగనె యీతల్లి"    బ్రతుకమ్మ యనిరంత"
పిలుతు రదివరనుండి"    ప్రియముగా తలిదండ్రి"
బ్రతుకమ్మ యని పేరు"    ప్రజలంత అందరూ"
తాను ధన్యూడంచు"    తనబిడ్డతో రాజు"
నిజపట్టణము కేగి"    నేల పాలించంగ"
శ్రీమహా విష్ణుండు"    చక్రాంకుడను పేర"
రాజు వేషంబున"    రాజు ఇంటికి వచ్చి"
ఇల్లింట మనివుండి"    అతివ బ్రతుకమ్మను"
పెండ్లాడి కొడుకులా"    పెక్కుమందిని గాంచె"
ఆరువేల మంది"    అతి సుందరాంగులు"
ధర్మాంగుడను రాజు"    తన భార్య సత్యవతి"
సరిలేని సిరులతో"    సంతోషమొందిరీ"
జగతిపై బ్రతుకమ్మచందమామశాశ్వతంబుగ వెలసెచందమామ
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - bratukamma pATa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )