దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

094. ఎంతో బీదవాడే


ఆ లోగిలిలో ఏదో పాట వినబడుతున్నది. నడవండి త్వరగా. ఓహో. సాతాని జియ్యరులు. వెడల్పైన ఎర్రంచుల తెల్లధోవతులు, వంటినిండా నామాలూ, తలపైన ముసుగు, నుదుటి చుట్టూ తిప్పిన కొంగూ, చేతిలో తాటియాకు విసనకఱ్ఱ, తలమీద గుమ్మడిపండు వంటి రాగిపాత్ర! చూడవలసిన వేషము! అదిగో తిరిగి అదేపాట పాడుతున్నారు. రండి విందాము.

ఎంతో బీదవాడే వేణుగోపాలుడు ఎంతో పేదవాడే
ఎంతో పేద గాకుంటే అలనాడు కుచేలుని
అటుకులకు చెయిజాచునా
॥వేణు గోపాలుడు॥
కట్టవస్త్రమె యుంటె కౌసల్య తనయుడు
నారచీరెలు దాల్చునా
॥వేణు గోపాలుడు॥
ఎక్కగుఱ్ఱమె యుంటె యశోద తనయుడు
పక్షి వాహనమెక్కునా
॥వేణు గోపాలుడు॥
పండమంచమె యుంటె పంకజనాభుడు
పాముపై పవళించునా
॥వేణు గోపాలుడు॥
ఉండ యిల్లే యుంటె పుండరీకాక్షుడు
కొండనెత్తుక దూరునా
॥వేణు గోపాలుడు॥
క్షీరసంద్రమే యుంటే శౌరి పొరుగిండ్లకు
పోయి పాలు త్రాగునా
॥వేణు గోపాలుడు॥

చమత్కారంగా వున్నదిగదూ! అదుగో ఆ యింటివారేమో అంటున్నారు. పాడవలసిన జియ్యరులు వింటున్నారు. మనము కూడా విందాము.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - eMtO bIdavADE - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )