దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

101. టనానా టంకుచెలో


గారడీ వాడు ఏలపాటల పుట్ట. శతాబ్దాల మెట్లమీద మారిపోకుండా దిగివచ్చిన యెమ్మెకాడు. ఇది లోక వ్యవహారాలన్నిటినీ ఎత్తిచూపు పాట. ఈ వరసని చరణాలు ఎన్నైనా వుంటవి. మచ్చుకు కొన్ని.

నామగడు వాడకెళ్ళే నాకు తోడు ఎవరు లేరూ
కోడి కూసే వేళదాకా తోడురారా వన్నెకాడా
॥టనాన॥
చింతచెట్టు చిగురు చూడూ, చిన్నదానీ యీడు చూడూ
అద్దములో నీడ చూడూ, ఇద్దరికీ జోడు చూడూ
॥టనాన॥
నరసాపురము నుంచి నలిగి నలిగొస్తంటే
తాళ్ళపాలెము కాడ తగిలింది జ్వరమూ
॥టనాన॥
చంక లోని నీళ్ళకడవా - నీడ జూచి నిందకట్టిరి
ఇద్దరికీ యిట్టమయ్తె - ఎవరిదేమి భయ్యమె
॥టనాన॥
ఇంటి మొగుడికి వంటెద్దు బండీ - రంకు మొగుడికి రెండెడ్ల బండీ
మధ్యతిరిగే లాల్‌గాడికి- దొరలు ఎక్కేమరలబండి
॥టనాన॥
ఇంటి మొగుడికి యీతకల్లు - రంకు మొగుడికి తాటికల్లు
మధ్యతిరిగే లాల్‌గాడికి- దొరలు త్రాగే బ్రాందిసీసా
॥టనాన॥
తల్లిపిల్ల నిడిసి యాడు - సేసుకున్న భార్యనిడిసి
దొమ్మరదాని యెంటపోతే - డోలు మెడకు యేసెరా
॥టనాన॥
కల్లు తాగి ఒళ్ళు మరసీ కైపు యెక్కి తిరగబోకూ
పెళ్లి చేసి పంపుతారూ పెందలకడ మేలుకోరా
॥టనాన॥
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - TanAnA TaMkuchelO - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )