దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

113. హైలాస


పడవల రేవు సొగసైన కూడలి. పడవ ప్రయాణము ఒడిదుడుకులు లేని సాఫీ ప్రయాణము. కళాసీలకూ, సరంగుకూ మాత్రము పడవపని చికాకైనదే. సామాన్యముగా ప్రయాణము రాత్రిపూట. పగటిపూటలోనే వారికి నిద్ర. కనుక వారి జీవితానందమంతా పడవపైననే సాధించుకుంటారు వారు. వారిపాటలలో కామదేవుడు విచ్చలవిడిగా విహరిస్తుంటాడు. నడేటికి పోతే వారిదే రాజ్యము. అలలూ గాలీ తోడైతే చెప్పనే అక్కరలేదు.

హైసా, హైలాస అన్నవి పడవను బలముగా నీటిలోకి నెట్టవలసినప్పుడు వారు పాటలలో ఉపయోగించే ఊతపదాలు. నలుగురూ చేరి వీపులు పడవకు దాపు పెట్టి నెట్టితే నాలుగు సెకనులలో పడవ నీటిలోకి జరుగుతుంది. ఆ నాలుగు సెకనులలోనే పాట పూర్తి కావాలి.

పెళ్లికూతురు చూడు
హైలాస
బహుపెద్ద మనిషిరా"
చూసి రమ్మంటేను"
చేసుకొచ్చిందిరా"

గంగ గౌరమ్మహైలాస
గంగమ్మ"
దండాలు మాతల్లి"
కొలువులు మాతల్లి"
కొండల్లో మా తల్లి "
దిగిరావె మా తల్లి"
చేయెత్తి దణ్ణమ్ము "
గంగమ్మ దణ్ణమ్ము"
కనిపెట్టు మా తల్లి"

అంతరాల పడవమీదహైసా
అందిపూలు కొయ్యబోతె"
కొమ్మతూగి కొప్పు నిండు"
లేనిపోని రవ్వలొచ్చు"

కొమ్మదూగి కొప్పు నిండుట ఈ జానపద గేయాలలో అతి సాధారణము. 'లేనిపోని రవ్వలు' పెనిమిటి దండింపులు.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - hailAsa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )