దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

120. సిరిసిరి మువ్వ


రంగము పోవటము, సొమ్ము చేరటము, రంగసాని చెలిమి చేయటము, సొమ్ము చేయి జారటమూ అయినవి. సముద్రాల కటువైపున ఉన్న చిన్నది గుర్తుకు వచ్చినది.

జోడుకొయ్యల వాడ మీద - సిరిసిరి మువ్వ
    జోడగ్గిపెట్టె లంపినానె - సిరిసిరి మువ్వ॥
అది అందిందొ లేదోనె - సిరిసిరి మువ్వ
    నాకు తిరుగుజాబు లంపలేదె - సిరిసిరి మువ్వ॥
మూడుకొయ్యల వాడ మీద - సిరిసిరి మువ్వ
    నీకు ముక్కుపుడక లంపినానే - సిరిసిరి మువ్వ॥
అది అందిందొ లేదోనె - సిరిసిరి మువ్వ
    నాకు తిరుగుజాబు లంపలేదు - సిరిసిరి మువ్వ॥
నాలుగు కొయ్యలవాడ మీద - సిరిసిరి మువ్వ
    నీకు నానుకోడు లంపినానె - సిరిసిరి మువ్వ॥
అది అందిందొ లేదోనె - సిరిసిరి మువ్వ
    నాకు తిరుగుజాబు రాలేదు - సిరిసిరి మువ్వ॥
అర్ధరూపాయి డబ్బులకు - సిరిసిరి మువ్వ
    నువ్వాశ పడా బోకంది - సిరిసిరి మువ్వ॥
ఆసుపత్రి పాలైతే - సిరిసిరి మువ్వ
    నిన్నాదుకొనే వారు లేరంది - సిరిసిరి మువ్వ॥
కసరి కసరి కొడితేను - సిరిసిరి మువ్వ
    నే సరస మనుకున్నానే - సిరిసిరి మువ్వ॥
కంటికి కాటుక బెడితే - సిరిసిరి మువ్వ
    నేను కన్నె అనుకున్నానే - సిరిసిరి మువ్వ॥
పైట పావడా గడితే - సిరిసిరి మువ్వ
    నే పడుచు అనుకున్నానే - సిరిసిరి మువ్వ॥
పౌడరేసు కుంటేను - సిరిసిరి మువ్వ
    నేను బాలికనుకున్నానే - సిరిసిరి మువ్వ॥
తళుకు జూపిస్తేను - సిరిసిరి మువ్వ
    నా వలపులనుకున్నానే - సిరిసిరి మువ్వ॥
నీమీద వలపంటే - సిరిసిరి మువ్వ
    కామాలు ననుకున్నానే - సిరిసిరి మువ్వ॥
సంకురాత్రి పండుగ నాడు - సిరిసిరి మువ్వ
    నేను సారానీళ్ళు త్రాగబోతే - సిరిసిరి మువ్వ॥
ఒంటిగా నుంటేను - సిరిసిరి మువ్వ
    నా కొక్క చుక్క దిగలేదు - సిరిసిరి మువ్వ॥
కష్టపడ్డ డబ్బంత - సిరిసిరి మువ్వ
    ముండ కాటిమీద బెట్టినానె - సిరిసిరి మువ్వ॥
ముద్దుగుమ్మ నేడిపించి - సిరిసిరి మువ్వ
    పాడు ముండలకు బెట్టినానె - సిరిసిరి మువ్వ॥
సముద్రాలు దాటిపోతే - సిరిసిరి మువ్వ
    పైసాయైన లేకపోయె - సిరిసిరి మువ్వ॥
బుద్ధిలేక రంగమెళ్ళి - సిరిసిరి మువ్వ
    యీ రద్ది పాలు బడ్డానే - సిరిసిరి మువ్వ॥
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - sirisiri muvva - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )