దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

121. పడవపాట


ఈ తెప్పపాట రచనయేమో ననిపిస్తున్నది. కాని దీని నిచ్చిన మిత్రులు కోటిఫలిలో పడవవాని కడ వ్రాసుకున్నానని చెప్పినారు. అందంగా ఉన్నది. "రవ్వమువ్వల తెప్ప రవగాలి" కి వెళ్లినదట.

పల్లవి:- గట్టెకు తాదా నాతెప్ప
కల్లోల జలధిలో మునిఁగిపోతుందా
॥గ॥
చరణము:- కొక్కురో; కోయంచు । కోడి కూయంగానె
దేవుడిచ్చిన నిద్ర । తెలిసిందిరాయంచు
చలిగాలిలో వళ్ళు । సవరించుకొంటు
చద్ది గట్టుక నేను । చక్క వచ్చాను
॥గ॥
చరణము:- చల్లన్ని గాలిలో । మెల్లంగ వెలిగేటి,
చంద్రయ్యనే జూచి । సంద్రమే పొంగింది,
పొంగేటి కెరటాలు । వంగుతూ, వాలుతూ,
రవ్వమువ్వల తెప్ప । రవగాలి కెళ్ళింది
॥గ॥
చరణము:- పదిగుళ్ళ వలదీసి । పారజూస్తే, తెప్ప
పొంగినా కెరటాలు । బొబ్బలెట్టాయి
కారు చీకటి గ్రమ్మి । కళ్ళకు పస్తయ్యె
సరిగ పోయే తెప్ప । గిరగిరా తిరిగింది
॥గ॥
చరణము:- గాలిజోరు చూచి । కల్లోలమే చూచి
కుదురు లేని గుండె । కొట్టుకో సాగింది
చుక్కాని తిప్పుచు । శోకాన మునుగుతూ
అంతు, పంతూ లేని । ఆ నీటిలో నుండి
॥గ॥
చరణము:- ఇంతలోనే యిల్లు । యింటి పిల్ల నాకు
జ్ఞప్తి రాగా వల్లు । గలగలా లాడింది
యింటి పిల్లింక, నా । కంట పడతాదా
సరసాలతో నేను । మురిసిపోతానా
॥గ॥
చరణము:- పొమ్మంటె పోతుంద? । రమ్మంటె వస్తుంద?
రంగడి దయలుంటె । కంగారు పడనేల?
గాలిలో నేనింక । కూలినా సరె గాని;
రంగడే మాయోడు । రంగడే దొంగోడు
॥గ॥
చరణము:- మనసు కలిసిన వారి । మనసులొకటల్లేను
కుటిలమెఱుగని బాబు । గుండె కాయల్లేను
మబ్బులన్నీ దాటి । మా రాజు సూరయ్య
గప్పు గప్పూమంటు । గంతేస్తు వచ్చాడు
॥గ॥
చరణము:- పొంగుతూ వలదీసి । బుంగ నిండే దాక
చేపలేరుక నేను । చెంగున గట్టెక్కి
నావ కట్టిబెట్టి । నా యింటి కెళ్ళాను
పిల్ల కంటబడితె । వల్లు చల్లాగుంది
॥గ॥
(గట్టెక్కినాది, నాతెప్ప । కల్లోల జలధిలో కడతేరినాది)
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - paDavapATa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )