దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

128. గుండ్లపల్లి గురివి


- పడుచువాడు తన వలపుకత్తెను గురించి నేస్తగానితో - విదూషకునితో కాదు - చెప్పుచున్నాడు. ఆమె సిరిమంతురాలు. తనకీలు కడియము చెఱిపించి వానికి కిన్నెర చేయించినది. అందరికీ మూడు దుడ్లూ, వీనికి నాల్నర దుడ్డూ ఇచ్చుటలో ఆశ్చర్యమేమున్నది? చెలిమి మంచితనము వలపును గలచోట వీని తగులముండుటలో ఆశ్చర్యమేమున్నది?

బావి గట్టున చేను జెయ్యరో చన్నంగి రామా
బావినీళ్ళకు నేను వచ్చేనూ!

అన్నది ఈ కోవలోని ప్రియురాలే తన వలపుకానితో, వాడు సొమ్ము కలవాడు కాడు, ఆకొండ్ర పండదని జంకు.

బావిగట్టున చేను జేస్తేనో జాలారిపాపా
చేను గుత్తా మీద పడితేనో

అన్నాడు. వలపుండవలెను గాని ఉపాయములకు లోటేమి?

చేను గుత్తామీద పడితేనో చన్నంగిరామా
చెవుల కమ్మలమ్మి కట్టేనూ

అని ధైర్యము చెప్పినది.

గుండ్లపల్లీ గురివిరా - దాని
చేత కీలు కడియమురా
కీలు కడియం సెడా గొట్టి
కిన్నెరా చేయించెరా

కోడినిస్తా మానెరా కోడి
పెట్ట నిస్తా మానెరా
కోడి నమ్మిన కాలు రూపాయి
కోరి యిస్తా మానెరా

వార వారము దినమురా రామ
సవురేపల్లె సంతరా
సవురేపల్లె సన్నా మల్లెలు
కుచ్చుల్నాల్నర దుడ్డురా

ఊరి పడమట బాటరా నే
బాటకూలికి పోతరా
అందరాకు మూడు దుడ్లు
నాకు నాల్నర దుడ్డురా!

ఇటువంటి పాటయే ఒక గొల్లదానిని గురించినది కలదు.

కుడితట్‌ కొప్పుది కుంకుమ రైకది
బామా సక్కని గొల్లదిరా - కులమూ సక్కని గొల్లదిరా
మాపిడిగొర్లూ మందకు రాగా ॥మా॥
మర్మామెరుగని గొల్లదిరా, అది యేమీ యెరుగని సిన్నదిరా॥
చప్పిడి మెట్లా సల్లా కడవలు॥చ॥
సరసా మెరగని గొల్లదిరా, సంసారమెరగని గొల్లదిరా॥

ఇది పైదాని వలె మిశ్ర గతిలో కాక చతురస్ర గతిలో జోరుగా సాగిపోతున్నది.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - guMDlapalli gurivi - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )