దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

133. చల్‌ మోహనరంగ


చల్‌ మోహనరంగ పదము నెరుగని వారుండరు. వనజాక్షి పుణ్యమాయని దాని అసలు వరుస రూపు మాసిపోయినది. రచన ప్రాకృతుని రచన కాదు. కాని అసలు తెలియనప్పుడు లభించినంత పట్టు ప్రచురించుటే కర్తవ్యమని దీనినిచ్చితిమి. ఈ పాటకు రెండు మూడు పాఠాంతరములున్నవి. కాపీరైటు సంపాదించుకొనుటకు ఏ కవి చేతనో కొన్ని చరణాలు కల్పింపజేసిన రూపములు రెండు మూడు అచ్చులో కనబడుచున్నవి. అసలు పాట మన్మధుని వంటిదైనచో నిది యాతని బూది.

1
రంగారు చెట్టుమీదా - బంగారు గోరువంక
    వినీపించే కతలు విందాము పదరా
చివురాకూ పళ్ళెరములో - మివుల పండిన పండ్లు
    సవిరించీ ఆరగింతము పదరా
పొగడ పూవులు గోసి - పొందుగనే దండ గుచ్చి
    దండ నీమెడాను వేసుకురారా
చిరిమంచు కోటలోన - గురుతైన మంచెమీద
    శిరిపాట పాడుదాము పదరా    ॥చల్‌॥

2
చుట్టు తుమ్మెదలు గూడి - గట్టి బాజాలు పాడి
    అట్టిట్టు తిరుగుచున్నవి కదరా
కొనమావి కొమ్మలందు - గొనబైన రామచిలుక
    ధనము లందించుచున్నది కదరా
గుబురైన చింత మీద - కబురు తెచ్చేటి చిలుక
    సొగసైన గూడు కట్టెను కదరా    ॥చల్‌॥

3
నీవుపోయే దారిలోని - నిలువుటద్దముల లోన
    నీదురూపు నిలిచిపోయెను గదరా
చిరునవ్వూ నవ్వితేనూ కురియూ పువ్వుల వాన
    చిరునవ్వాసించి యుంటిని గదరా
శనివారం సంతలోన పనిబూని సంతలోన నినువెదకి
    పరుగెత్తి పట్టుకొంటిని కదరా
బొండుమల్లె పూలదండ నిండుగా నీ మెడనువేసి
    నిండారా కౌగిలింతును రారా    ॥చల్‌॥

4
చీకటి రాత్రినాడు - కోక నల్లది కట్టుకోని
    చీకట్లో కలిసిపోయితి గదరా
ఊడలమర్రి క్రింద - మోడైన తుమ్మ చూచి
    చీకట్లో ఝడుసుకొంటిని గదరా
గట్టు దాటి పుట్టదాటి ఘనమైన యడవి దాటి
    అన్నిదాటి అరసి తరలితి గదరా
ఒంటిగా పోవద్దు వద్దని - పైటబట్టి లాగగానే
    పైటజారి సిగ్గుబడితిని గదరా
పొడుపు కొండలమీద - నిడుపైన చందమామ
    నీలాగె నిలువబడెను గదరా
నేనొంటిగాను పోతే - నీవు నా వెంట వస్తే
    నీడ జూచి జడుసుకొంటిని గదరా    ॥చల్‌॥

6
నీవునేనూ నిలబడితే - వచ్చిపోయేటట్టివారు
    చిరునవ్వు నవ్విపోయిరి గదరా
నీకు నాకు నేస్తమయితే మల్లెపూల తెప్పగట్టి
    తెప్పమీద తేలిపోదము గదరా
నాలోని వలపుతీగ నీలాల పేరుగాగ
    నీకంఠమునను జుట్టితి గదరా
నీమీది వలపుతీపి - నామీది కెక్కిపోయె
    నిన్నింక విడువజాలను గదరా
ఎన్నాళ్ళకైన గాని చిన్న నీ మొగము జూచి
    నిలువెల్ల సొక్కిపోతిని గదరా
నీకు నీ వారు లేరు - నాకు నావారు లేరు
    యేటి వడ్డున యిల్లు కడదాం పదరా
చల్‌ మోహనరంగ యేరు వస్తే యీదిపోదము పదరా॥
చేయిచేతాను వేసి న్యాయమార్గము చూచి
    నాయందు ప్రేమ తప్పక మనరా
నీవే చందూరుడైతే నేనే వెన్నెలనౌదు
    భావించి వెంటనుందును కదరా    ॥చల్‌॥

7
పాపిష్టి గాలివాన బెజవాడకు రాకపోతే
    కష్టాలె లేకపోవును గదరా
కంటీకి కాటుకెట్టి కడవ చంకాన బెట్టి
    కన్నీరు కడవ నిండెను గదరా
నీరూపు చూడగోరి దారులు గాచగానె
    పాడైన శకునమాయెను గదరా
నీవునేను ఏకమైతే నిండు చందురుడు నవ్వి
    మేఘాల దూరిపోయెను గదరా
నిన్నుజూచి నన్నుజూచి పున్నమ చందురుడు
    నవ్వి చిక్కి శల్యమయ్యెను గదరా
విరజాజిపూలు పూసే ఉరవైన వనములోన
    గురువిందలేరుదాము పదరా
పసిడి పన్నీటిలోన మిసిమి కాంతులతోడ
    బంగారు చేపలున్నవి కదరా
బలమైన అలలురేగి చలియించు సాగరమున
    సంగీత మాలకింతము పదరా
నరులు కన్పడని చోట సురలు చెన్నారువీట
    అందముగా ఆడుకొందము పదరా
తెలితామరాకు జండా గల పూల రథము మీద
    దేశాలు తిరుగుదాము పదరా
పూవుల రథము గట్టి చిలుక గుఱ్ఱములు గట్టి
    పోయి వత్తము గాలివీధిని పదరా
పూలతోటి బుట్టగట్టి - బుట్టకు ముత్యాలు చుట్టి
    బుట్టలోనే యెగిరిపోదము పదరా
అమృతప్రవాహమైన ఆకాశగంగలోన
    సరిగంగా లాడుదాము పదరా

8
నీ మొగము చందమామ - నీ కళ్ళు కలువపూలు
    నామొగము తోటి చేర్చి పోరా
నీనోట నున్న మురళి నా నోటనుంచి చూడు
    నేనొక్క పాట పాడెద వినరా
మధువూ నీమోవి తేనె - అదిరా నేనాని యాని
    మతిమాలి సొక్కి సోలితి గదరా
నీవొక్క హంసవైతే నేను మానసమగుదు
    పన్నీట నిదురబుత్తును గదరా

9
తేట పన్నీటిలోన నీటుగాను జలకమాడి
    మధుర నీరూపు చూపను పదరా
మధురా నీ గుండెలదరా - నిదుర కంటికి రాదు
    రెండు కొండలడ్డమాయె గదరా
బంగారు పంజరాన - చెంగావి చిలుకలంటె
    చెంగావి నీదు మోవి గదరా

10
కస్తూరి బొట్టుపెట్టి కలికితురాయి గట్టి
    నీవే నా రాజువైతివి గదరా
కల్యాణ మందిరమున కనకంపు గద్దెపైన
    మంగళ హారతి చెప్పెద రారా॥
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - chal mOhanaraMga - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )