దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

134. ముద్దుల బావ


ఇదేదో రెండు మూడు పాటలు కలిపి కుట్టిన బొంత. ఒకటి గారడీవాని పాట లేక ఓడ పాట. రెండోది 'రాతిరి పన్నెండు గంటలకు రౌను తిరిగి నేను వస్తె' అన్నది. ఈ రెండో పాటది, 'రమణి ముద్దులగుమ్మ' అన్నది ప్రచారము గల పల్లవే. పూర్తి పాట మాకు లభించలేదు. ఇక్కడ ఇచ్చిన ఈ పాట 'ఫరవాలేదు' అనిపిస్తున్నది. ప్రేయసీ ప్రియులు లేచిపోవుట పాటకపు జనములో గలదు. ఆ సందర్భమున కిది ఉదాహరణము.

ముద్దుల బావా! ఓ ముద్దుల బావా!
నా రాజా నా రాజ! నా రాజనిమ్మల పండు
నా ఒప్పురాల కుప్ప! నా అచ్చావు పాలు
నా అప్పుడు కాచిన్నేయి ! నా అప్పడాల కఱ్ఱ
నా అంటు మామిడి గున్న! నా జంట యీడకుంటావా    ॥ము॥
రమణి ముద్దులగుమ్మా! ఓ ముద్దులగుమ్మా
నా రాణి నా రాణి! నా రాణి ముద్దులగుమ్మ
నా; గజనిమ్మపండు ! నా ఆవకాయ బద్దా
నా; అప్పడాలపీట! నీ యబ్బ మీద ఆన
నిన్నిడిసి నిముసముంటానా । ముద్దులగుమ్మా        ॥ర॥
మనసంటే ఎంతవరకో । మాటంటే ఎంతనిరుకో
వైనమేమి తెలియకుండ । వాసివన్నె చూడకుండ
ఉన్న వూరులుంటేను । విన్నవారు నవ్వుతారు
మనమే వూరు పోదామో! ముద్దులబావా!
చిలకా గోరింకలముగా । కలిసి మెలిసి ఉందాము    ॥ము॥
ఓ రంగురంగుల । రమణ రంగీ
సొగసులెన్నో జరిగిపోయె । సగం ప్రేమ సాగిపోయె
ఇరుగుపొరుగు వారితోను । ఇసుమంత చెప్పకుండ
చిలకా గోరింకలముగా । చెంగు చెంగున లేచి మనము
లింగాల పురికి పోదామె । రమణి ముద్దులగుమ్మా    ॥ర॥
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - muddula bAva - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )