దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

136. రాగంవాళ్ళ రంగు చిన్నది


వీడెవడో బండవాడు. వీని మైకము జీవితావసరములను దాటినది.

తల్లి: అబ్బి పోరా గడ్డికి
నా బాబు పోరా గడ్డికి
నా తండ్రి పోరా గడ్డికి
కొడుకు: రాగంవాళ్ళ రంగుచిన్నది వస్తానన్నది గడ్డికి
అది వస్తే పోతా గడ్డికి రాకుంటే పోనే గడ్డికి
తల్లి: అబ్బి పోరా గడ్డికి
నా బాబు పోరా గడ్డికి
నా తండ్రి పోరా గడ్డికి
కొడుకు: చిలకముక్కు చిన్ని కొడవలి తెస్తానన్నది గడ్డికి
అది తెస్తే పోతా గడ్డికి లేకుంటే పోనే గడ్డికి
తల్లి:అబ్బి పోరా గడ్డికి
నా బాబు పోరా గడ్డికి
నా తండ్రి పోరా గడ్డికి
కొడుకు: మొనలేని పెద్ద బొరిగె తెస్తానన్నది గడ్డికి
అది తెస్తే పోతా గడ్డికి లేకుంటే పోనే గడ్డికి
తల్లి:అబ్బి పోరా గడ్డికి
నా బాబు పోరా గడ్డికి
నా తండ్రి పోరా గడ్డికి
కొడుకు: అడుగు లేని పెద్ద గంప తెస్తానన్నది గడ్డికి
అది తెస్తే పోతా గడ్డికి లేకుంటే పోనే గడ్డికి
తల్లి: అబ్బి పోరా గడ్డికి
నా బాబు పోరా గడ్డికి
నా తండ్రి పోరా గడ్డికి
కొడుకు: కరకంచు పెద్దకోక తెస్తానన్నది చుమ్మకి
అది తెస్తే పోతా గడ్డికి లేకుంటే పోనే గడ్డికి

తల్లిపోరు పడలేక గడ్డికోతకు పోయినప్పుడైనా చిలకముక్కు చిన్నికొడవలి, మొనలేని పెద్ద బొరిగె, అడుగులేని గంప కావలెనట వానికి! వేరు సాధనములైనచో గడ్డికోతకు అంతు కలుగును. ఈ సాధనములతో పవలంతయు 'పని'లో గడవగలదు.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - rAgaMvALLa raMgu chinnadi - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )