దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

137. బాటలో సరసము


చిన్నది - కాదు కాదు పెద్దదే కావలయును - పలకరించుచున్నది చిన్నవానిని.

ఆవునెద్దు బండికట్టి
పరువు పరువున పోయేవాడ
బండినిలిపి బాసలాడర
పెడమల్లి చిన్నా
బండినిలిపి బాసలాడర
ఆకసమున అరటివనము
ధరణి మీద నిమ్మవనము
నట్టనడుమ బండిబాటోయి
బండిబాటలో బొమ్మలాటోయి
ఉద్దగిరి బండమీద
ఉద్దులెండబోసే పాప
ఉద్దులకు ఎద్దులొచ్చెనే
సుద్దులాడ పొద్దుపోయెనే
బాటవార బండ్లమీద
చెక్కగొట్టె మీ అక్క మగడు
చెక్కవచ్చి చెంప దగిలెను
ఎక్కడ లేని దుఃఖమొచ్చెనే
బాటవార బండమీద
వడ్లూ దంచే చిన్నపాప
నానబియ్యం నాకు పెట్టవా
మళ్ళిరారా మలచిపెట్టేను

ఆకసమున అరటివనము, ధరణిమీద నిమ్మవనము, నట్టనడుమ బండి బాట. ఈ పాటలో ఆ బాటలోని బొమ్మలాట గోచరిస్తున్నది మనకు. ఇటువంటిదే 'ఓబులేశుని పాట'.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - bATalO sarasamu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )