దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

149. వలచిన చిన్నవాడు


ఇటువంటి నాయికయే వలపుకాడు కికురించి మాయమైనందుకు విలపించుచున్నది.

వాడు,వలచినాడమ్మా!
నను తలచినాడమ్మా!
... చందమామోయ్‌॥
వాడు,వలచినా! తెల్లారి
పిలచినా! పలుకడు!
... చందమామో!
వాడు,పిక్కల సన్నంపు
బిగువైన మగవాడు!
... చందమామో!
వాడి,భుజాన ఉన్నది
భూచక్ర కంబళి!
... చందమామో!
అది,పదిగళ్ళు భూమిపై
పరచినా చాలమ్మా!
... చందమామో!
వాడి,మునిపళ్ళ సందున
ముత్యాలు తాపిస్తు;
... చందమామో!
వాడి,పక్కాన ఉన్నది
పచ్చల పిడిబాకు;
... చందమామో!
అది,ఎదలోన ఒకసారి
అదిమినా చాలోయి;
... చందమామో!
వాడు,వలచినా దాకాను
వలపోసి తిరిగాడు;
... చందమామో!
వాడు,వలచినా తెల్లారి
పిలచినా పలుకడు;
... చందమామో!
వాడు,కలకలా నవ్వాడు
కన్నెత్తి చూడడు;
... చందమామో!
వాడి,కావి పంచెలమీద
కస్తూరి తాపిస్తు;
... చందమామో!
వాడి,బంగారు చెక్కిళ్ళు
రత్నాలు మెరిపిస్తు;
... చందమామో!
వాడి,ముద్దైన మోముపై
ముత్యాలు విరబోతు;
... చందమామో!
వాడి,నూనూగు మీసాలు
వలపు తీగెలు పాకిస్తు;
... చందమామో!
వాడు,చూచినా చాలమ్మ
స్వర్గమే దరిదాపు;
... చందమామో!
వాడు,నవ్వుతూ మాటాడి
కవ్వించి పోయాడు;
... చందమామో!
వాని,నవ్వులోనే మనసు
నను విడిచి పోయింది;
... చందమామో!
వాడు,పలికినా చాలమ్మ
ప్రాణాలు వికసించు;
... చందమామో!
వాని,బంగారు మొలత్రాడు
పై పైన మెరిసింది;
... చందమామో!
వాడి,ఉంగరాల జుట్టు
రంగైన మగవాడు;
... చందమామో!
వాని,కోపాన ఒకసారి
కసరి తిట్టిన చాలు;
... చందమామో!
వాడు,ముసి ముసి నవ్వుతో
మురిపించి పోయాడు;
... చందమామో!
ఆ,మగవాని కౌగింట
మరణించినా చాలు;
... చందమామో!
వాడు,కంటికి కనబడితే
కదులునా అడుగేసి;
... చందమామో!

దీనికి జవాబనిపించు పాట చిన్నవాని భావాలు కూర్చినది ఉన్నది. కాని ఆమె దేహ సౌందర్యమునూ, అంగ సౌష్టవమునూ నెమరు వేయునది ఆ పాట.

వలపుకత్తె ఇంకొకర్తె తన నరసయ్య మామతో చెప్పుకుంటున్నది.

దూరభారము దున్నబోకు
దిబ్బలెక్కి చూడలేను
ఊరు ముంగిట ఉలవసల్లబ్బి
ఓరందకాడ నరసయ్య మామ
ఉలవకోతకి పిలువనంపబ్బి.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - valachina chinnavADu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )