దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

154. గోంగూరకి


- దీనికి మాయదారి కుర్రవాడు వల పన్నినాడు. పట్టుబడ్డది. ఈ పాటలోనిది కొట్టుకొనుట మాత్రము కాదు. వంటికీ, మనసుకీ మల్లయుద్ధము.

ఎందుకోననుకొంటి గోంగూరకి - అమ్మ
ఎందుకోననుకొంటి గోంగూరకి
పుట్టెక్కి సూశాడు గోంగూరకి - వాడు
చెట్టెక్కి సూశాడు గోంగూరకి
ఎందుకో
చెట్టుదిగి నవ్వాడు గోంగూరకి - వాడు
పట్టు పట్టమన్నాడు గోంగూరకి
ఎందుకో
ఎత్తు ఎత్తమన్నాడు గోంగూరకి - వాడు
మోపెత్తమన్నాడు గోంగూరకి
ఎందుకో
చేయి పట్టుకొన్నాడు గోంగూరకి - వాడు
చెక్కిలిని పుణికేడు గోంగూరకి
ఎందుకో
కళ్లలోకి చూశాడు గోంగూరకి - అమ్మ
ఒళ్ళు పులకరించింది గోంగూరకి
ఎందుకో

ఈ వరసలో వల్లూరి జగన్నాథరావు గారు ఒకపాట రచించినారు. ఈ చరణములు అందులోనివా అని అనుమానము కలుగుతుంది. కాని మాటలేవిన్నీ తప్పి పడినట్లు లేవు. 'గోంగూరకి' అన్నది పాదాంత పదమే.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - gOMgUraki - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )