దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

158. నెరబండి


బండి. మానవకోటికి పూర్వజన్మము సెలయేటి బిందువులు కాబోలు. అందుకే ప్రయాణమన్న అందరికీ అంత యిష్టము. బండి, నాటి నుండి నేటి వరకూ నిలిచిన అందపు వాహనము. ఎన్ని జంటలనో వలెనే బండి ఈ జంటనుకూడ మోసుకొని సాగుచున్నది.

నెరా నెరా నెరబండి
నీలమోరి బండి
నెరా
అద్దరేతిరి కాడ నిద్దరోతుంటేను
బండెక్కు బండెక్కు మన్నాడె బావ
నెరా
జల్తారి సీరకట్టి జడకుచ్చులెనకట్టి
నిలుసుంటె నాకేసి ఎగాదిగా సూసేడు
నెరా
పుల్లెద్దు బండి కట్టి తెల్లెద్దు బండి కట్టి
పుల్లెద్దు తెల్లెద్దు ఏకమైనాయి
నెరా
ఎద్దులకి మువ్వలు కట్టి నాతల్లొ పువ్వులు పెట్టి
మువ్వల సప్పుడు పువ్వుల వాసన ఒకటైపోయినాయి
నెరా
మూటకట్టమన్నాడు ముల్లె కట్టమన్నాడు
మూట ముల్లె కట్టి ఎనకెక్కమన్నాడు
నెరా
పాటలు పాడుకుంటా మాటాలాడుకుంటా
కమిసి కర్రొట్టుకొని ఎనకాలెక్కాడు
నెరా
గట్టంటె గట్టు కాదు పుట్టంటె పుట్టకాదు
గతుకుల్లొ మాబావ సతికిల్ల బడ్డాడె
నెరా
పక్క పల్లంలోను చెక్కబెల్లం వుంటేను
బండి నిలిపి బెల్లాము భోంచేసినాడొ
నెరా
వర్సాము కురిసింది వానయినా కురిసింది
వర్సాము వానాలో తడిసీపోయేము
నెరా
సిట్టడవి దాటేము పొట్టడవి దాటేము
అన్నడవిలు దాటేసి ఐక్యామై పోయేము
నెరా

వారు పొందని అనుభవాలు లేవు. గతుకులలో పడి వర్షములో తడిసి అడవులన్నీ దాటి "అనంత పథాలకు ప్రయాణమైనారు".

ఎక్కు నరసూ బండెక్కు నరసూ
ఎక్కిన బండి దిగొద్దు నరసూ ॥

అన్నపాట దీని తరువాతిది.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - nerabaMDi - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )