దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

161. నాయుడు


ఇది పక్కా వీధిసాని, రూపాయలు, కాసులు, ముక్కుపుడక కడియాలు, పావడలు, నాగరము, మట్టెలూ ఎన్నో పుణుకుకున్నది. చివ్వరికి? వినండి.

నాయుడోళ్ళింటికాడ । నల్లతుమ్మ చెట్టుకాడ
నాయుడేమన్నాడే పిల్లా? అబ్బ; ఎంత వింతగున్నావే పిల్లా!
నాయుడోళ్ళింటికాడ । నల్లతుమ్మ చెట్టుకాడ
నాలుగు రూపాయలిస్తానన్నాడమ్మా!
అబ్బ నా గుండె ఝల్లుమన్నదేలమ్మా
కోమటోరింటికాడ । గున్నమామిడి చెట్టుకాడ
కోరి కోరేమన్నాడే పిల్లా?
కోమటోరింటికాడ । కొట్టు బాజారు కాడ
కోరి; కోరి; రమ్మన్నాడమ్మా!
॥అబ్బ॥
కరణం గారింటికాడ । కారుములక చెట్టుకాడ,
కాముడేమన్నాడే పిల్లా?
కరణం గారింటికాడ । కన్ని మామిడి చెట్టు క్రింద
కాసులు పేరిస్తానన్నాడమ్మా!
॥అబ్బ॥
మునసబు గారింటి కాడ । ముందల దరవాజుకాడ
అతడేమన్నాడే పిల్లా?
మునసబు గారింటి కాడ । ముందల దరవాజులోన
ముక్కుపుడక లిస్తానన్నాడమ్మా!
॥అబ్బ॥
మాలపల్లి తూముకాడ । మల్లె పువ్వుల తోటకాడ
బాలుడేమన్నాడే పిల్లా?
మాలపల్లి తూముకాడ । మల్లె పువ్వుల పందిరి క్రింద
మల్లి, మల్లి రమ్మన్నాడమ్మా!
॥అబ్బ॥
క్రిందవి కడియాలు, మీదవి పావడాలు
నెత్తి మీద నాగరము । ఏ దేవుడిచ్చేడే పిల్లా?
కడియాలు, కామరాజు । పావడాలు పాపయ్య
నాగరము నాగరాజు । నన్ను కోరి, కోరి; యిచ్చేరమ్మా!
॥అబ్బ॥
ముంతంత కొప్పు మీద । మూడు చేమంతిపూలు
ఏరాజు పెట్టేడమ్మా! అబ్బ । ఎంత చక్కగున్నావే పిల్లా!
చేమంతి పువ్వూలు । చెంగూలోన బెట్టి
కోరి, కోరి; పిలిచేడే । నాయుడు
॥అబ్బ॥
కాళ్ళకు కడియాలు । వ్రేళ్ళకు మట్టెలూ
నాయుడెప్పుడిచ్చేడే పిల్లా?
కాసులుపేరు వేసుకుని । కాలువ గట్టున వెళ్లుతుంటె
కాని పట్టు పట్టాడే నాయుడు
॥అబ్బ॥
ఎలమంచిలి రోడ్డు మీద । తాలూకా కచేరికాడ
తాళపాలెం రేవులోను । పిట్లాకోనేరు కాడ
ఎగిరి, యెగిరి తన్నేడమ్మా
॥అబ్బ॥
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - nAyuDu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )