దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

170. వాలుకన్నుల వెంకటస్వామి


    ఓ వాలు గన్నుల మువ్వ వెంకటస్వామి
    నిన్ను నేను విడువజాలరా;
ఇంటి ముంగల ఇనప రోలు
సేతిన శాబంతి రోకలి
దంచి దంచి నీ వంక సూసితే
ధరణి మీద కాలు నిలువదు వెంకటస్వామి
నిన్ను నేను మరవజాలరా;        ॥ఓ వాలు॥

ఉంటే ఈ వూళ్ళో ఉండు
పోతే పొరుగుదేశం వెళ్ళు
సుట్టుపట్టల ఏ మూలనున్న
సూడక నా మనస్సుండా దెంకటస్వామి
నిన్ను నేను మరవజాలరా;        ॥ఓ వాలు॥

ఎర్ర సెరువు వాలుగు ముక్కలు
గోలకొండ గుల్ల సింతపండు
ఆవాలు ధనియాలు వేసి వండితే
ఆ వాసనకీ సుట్టు తిరిగే వెంకటస్వామి
నిన్ను నేను మరవజాలరా;        ॥ఓ వాలు॥

ఓ అందకాడ నా కోడెకాడ
సందెకాడను గోడదూకి
తొంగి చూడ గడబిడాయెను
నా బంగారు మామ వెంకటస్వామి
నిన్ను నేను మరవజాలరా;        ॥ఓ వాలు॥
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - vAlukannula veMkaTaswAmi - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )