దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

174. బొల్లారపిల్ల


చెడిన పిల్లను ఉంపుడుగత్తెనుగా చేసుకున్నాడు వీడు. కులము చెడిన బొల్లారపిల్ల ఏమి చేయగలదు? అన్నలే చెయ్యలేక పోయిరి.

పెట్టీ పోస్తావుంట పైనిండ బట్టలు పెడ్త
నాపేరు మీద బతుకవే ఓ బొల్లారపిల్లా!
అచ్చాము తెల్లచీర అంచూన జిల్లెడు గొమ్మ
నీ కొంగున రామచిలుకలే ఓ బొల్లారపిల్లా!
బాయిల యిల్లుగట్టి బొజ్జోడు యెంటవడితె
కుంటోడు కులము జెరిపెనే ఓ బొల్లారపిల్లా!
నీకాలుకు నామట్టె నాసేతులున్నకటె
నిన్ను కొట్టకుంటె ఒట్టెనే ఓ బొల్లారపిల్లా!
సంకల సపై తట్టా సేతుల సీపురుకట్టా
నీయెంట జెమానెందుకే ఓ బొల్లారపిల్లా!
బండమీద బలిజోల్లు బాగోతులాడంగా
బాగ తన్నుల్‌ తింటివే ఓ బొల్లారపిల్లా!
దొరగారి జీతగాడు దోరెడ్ల మేపెటోడు
దొడ్డెక్కి సీటిగొట్టెనే ఓ బొల్లారపిల్లా!
పటేండ్ల జీతగాడు పై ఎడ్ల మేపెటోడు
బండమీద సీటిగొట్టెనే ఓ బొల్లారపిల్లా!
దిగింది డిచ్చు వెళ్ళిపోయింది సుద్దవెళ్ళి
పని జేసె సాంపెల్లి ఓ బొల్లారపిల్లా!
ఇందూర్ల నాది యిల్లు మారుకట్టుకు నాది మడిగె
మాసాలకన్న రావమ్మా ఓ బొల్లారపిల్లా!
బొంబాయిల బొట్లసీరె కనుకుట్ల కనుల రైకె
నీకొంగున మల్లెమొగ్గలే ఓ బొల్లారపిల్లా!
బొంబాయిల బొంగులొర్రే యిందూర్లె గంటలేగే
మనరజా ఎత్తిపోతదే ఓ బొల్లారపిల్లా!
కలకల యనబోకు కన్నీరు దియ్యబోకు
మన అంతు నుంటె తప్పదే ఓ బొల్లారపిల్లా!
యిందూర్ల జోగిపేట నీ అన్నలున్నారాట
నన్నేమి జెయ్యజాలరే ఓ బొల్లారపిల్లా!
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - bollArapilla - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )