దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

178. పేట్రాయిసామి దేవుడా


పేట్రాయి, బెట్రాయి, ప్రేట్రాయి అని పాఠ భేదాలున్నవి. ఇది అవతార కీర్తన. అవతారాలను గురించిన సుదీర్ఘ రచనలున్నవని శ్రీ తూమాటి దోణప్ప గారు చెప్పిరి. ఈ పాటలో అచ్చయిన కొన్ని పాఠములలో వలె నాగరికుల సమాసకల్పనములేదు.

పేట్రాయిసామి దేవుడా మమ్మేలినోడ
పేట్రాయిసామి దేవుడా
కాటమీరాయడా కదిరి నరసిమ్ముడా
నీటైన యాలకాడ నిన్నె గోరి నమ్మినాడ    ॥పేట్రాయి॥
చేప కడుపున చేరిపుడితివి - రాకాసిగాని
కోపమూని కోరి కొడితివి
ఆ పెన్నీటిలోన ఒలసి గ్రక్కున దూరి
బాపనోళ్ళ సదువులెల్ల బెమ్మదేవుడి కిచ్చినోడ॥
తాబేలై తాను పుట్టగా ఆ నీళ్ళకాడ
దేవాసురురెల్ల గూడగా
తావుసూసి కొండకింద దూరగానె సిల్కినపుడు
చావులేని వెన్నమందు దేవర్లకిచ్చినోడ॥
అందగాడవవుదు లేవయా - గోపాల గో
వింద రచ్చింప రావయా
పందిలోన సేరుకోని పంటభూమి నెత్తికింద
సిందర సిందర సేసినట్టి సందమామ నీవెకావ॥
నారసిమ్మ నిన్నె నమ్మితీ - నానాట నే
కోరితి నీ పాదమేగతి
ఔర కొలువు కంబాన - సేరిపెమలాదు గాసి
కోరమీసమైన శత్రు గుండెలగల జీల్చినోడ
బుడుత భాపనయ్య వైతివీ - ఆ చక్రవర్తి
నడిగి భూమి గెలుసుకొంటివీ
పొడుగు కాళ్ళోడవై అడుగు వానిమీద బెట్టి
తడవు లేక లోకమెల్ల పుడిక్కోని తిరిగినోడ॥
రెండు పదులు ఒక్కమారుతో ఆదొర్ల ।నెల్ల
చెండాడితౌర పరశుతో
చండకోల బట్టి కో
దండ రామసామికాడ
చెండుకోల సేసుకోని
కొండకప్పుడేగినోడ॥
రామదేవ రచ్చింపరా మాకెల్ల
భూమిలోన బుద్ధి సెప్పరా
    ఏమితప్పు సేసినాడ సామి నా యప్పబుద్ధి
    నీ మనసు చల్లదనము మామీద సూపరోరి॥
దేవక్క దేవి కొడుకురా మాకెల్ల
దేవుడై నిల్చినావురా
ఆవుల మేపికోని ఆడోళ్ళ గూడుకోని
తావు బాగ సేసికోని తకిడి చిక్కిడి సేసినోడ॥
వేదాల నమ్మరాదనీ - చాత్రముల
వాదాలు బాగులేదనీ
బోధాలు సేసికోని బుద్దులు సెప్పికొన్న
నాదవినోదనయ్య నల్లనయ్య నీవె కావ॥
కలికి నా దొరవు నీవెరా నాతోడ
పలుకవేమి బాలకృష్ణుడా
సిల్లగట్టు పురమునందు సిన్నిగోపాలుడై
పిల్లగోవి పట్టుకొని పేట పేట తిరిగినోడ॥

చిల్లగట్టుపురము ఏదియో? కదిరికి చుట్టుపట్ల ఉండవలెను.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - pETrAyisAmi dEvuDA - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )