దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

181. చిలుకా


తెలుగునాట వ్యాపించిన తత్వాలు వైష్ణవముద్వారా విశిష్టాద్వైతమూ, యోగము ద్వారా అద్వైతమున్నూ. విశిష్టాద్వైతము ఏవో కొన్ని భక్తి కీర్తనలలోనే కాని, వాటిని దాటి తత్వరూపము పొందినట్లు లేదు. కాకతి ప్రతాపరుద్రుని సమకాలికుడని చెప్పబడు కృష్ణమాచార్యులవారు, తిరుపతిలో అన్నమాచార్యులవారూ మాత్రమే విశిష్టాద్వైత స్ఫురణగల గాయకులు. రామదాసు ద్వైతిలాగునే కీర్తనలు చెప్పి ఎక్కడో ఒకచోట 'అంతా రామమయం' అన్నాడు. కాని శైవమూ, దాని పరిణామముగా వ్యాపించిన అద్వైతమూ మాత్రమే దేశములో విరివిగా వ్యాపించినవి. వేమన, పోతులూరి వీరబ్రహ్మయోగి, సిద్దప్ప, నాసరుద్దీన్‌, పీర్‌ మోహిద్దీన్‌, పోకల శేషాచలనాయుడు, పరశురామపంతుల లింగమూర్తి, గురుమూర్తి అచలయోగులు. వీరి సాధనలో గురుపూజ, వైరాగ్యము, అద్వైతమూ సోపానములు. తెలుగునాట సాధువుల మఠములలో ఇప్పటికీ అద్వైతసాధనయే జరుగుచున్నట్టు పరిశీలించి తెలుసుకొనవచ్చును. ఇడా పింగళలు, సుషుమ్ననాడి, కుండలిని, బ్రహ్మరంధ్రము అనునవి ఈ అచల యోగకీర్తనలలో విరివిగా కనపడును. మెదడు చించుకొన్ననూ బోధపడని మర్మతత్వాలీ వంగడము లోనివే.

చిలుకాను పెంచేను యెదముద్దులాడేను
కనుసైగలేదయ్యె చిలుకా ॥
మూణ్ణాళ్ల ముచ్చటకు మురిసేవు దిరిసేవు
ముందుగతి కానవే చిలుకా ॥
కుక్కి మంచముమీద కూలబడిపోతేను
దిక్కెవ్వరే నీకు చిలుకా ॥
ఇల్లు యిల్లనియేవు యిల్లునాదనియేవు
నీయిల్లు యెక్కడే చిలుకా ॥

వూరికీ ఉత్తరాన సమాధిపురములో
కట్టె యిల్లున్నదే చిలుకా॥
కఱ్ఱలే చుట్టాలు కట్టెలే బంధువులు
కన్నతల్లెవ్వరే చిలుకా॥
నువు కాలిపోయేదాక కావలుందురు గాని
వెంటనెవరూ రారు చిలుకా॥
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - chilukA - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )