దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

183. తుమ్మెద పదము


తుమ్మెద పదములను గురించి పాల్కురికి సోమనాథుడు (క్రీ.శ. 1300) మొట్టమొదట చెప్పినాడు. ఈ పదాల చరణముల చివర తుమ్మెదా అన్నమాట విధిగా వచ్చుచుండుటే వీటి ఈ పేరునకు కారణము. తుమ్మెదా అన్నది ఈ తత్వములోవలె జీవునిగాని, అన్నమయ్యది 'తొల్లిటివలె గావు తుమ్మెదా' అన్న సంకీర్తనములో వలె పరమేశ్వరునో - 'ఏవూరు ఏపల్లె తుమ్మెదా' అన్న పాటలో వలె ఒక వ్యక్తినో ఉద్దేశించి అనేమాట. ఈ పదము ఏగంటి వచనాలలోనిది. ఏగంటి నంజేశ్వరునికి అంకితము. గార్లపాటి లక్ష్మయ్య గారు రచించినది. ఈయన పోసెట్టి లింగకవికి గురువే అయినచో ఇంచుమించు అన్నమయ్యకు సమకాలికులు అయియుందురు. ఈ యిద్దరి రచనలకున్నూ గతిసామ్యము చాలా కనబడుతున్నది. సంప్రదాయము ఈయన రచనలను "వచనములు" అన్ననూ పోసెట్టి లింగకవి "పాటలు" అనే అన్నాడు.

శ్రీకంఠుడను పువ్వు తుమ్మెదా - మూడు
లోకమ్ములాయెను తుమ్మెదా
సాకారమై యుండు తుమ్మెదా - పర
మైకాంతమున జూడు తుమ్మెదా
 
శివశివా యనవె తుమ్మెదా
శివుడనగ విన్నమేల్‌ తుమ్మెదా
శివుని భక్తులాకు తుమ్మెదా
శివ శరణన్న మేలె తుమ్మెదా
1
ముట్టిముట్టని పువ్వు తుమ్మెదా
ముట్టింది జగమెల్ల తుమ్మెదా
ముట్టి చూడవేల తుమ్మెదా - అది
ముట్టిపాయలేవె తుమ్మెదా
॥శివశివ॥ 2
యవ్వానమందావె తుమ్మెదా, బహు
పువ్వూల వాసానె తుమ్మెదా
క్రొవ్వి నీవెఱుగావె తుమ్మెదా, నీకు
నెవ్వి నేరము లేదు తుమ్మెదా
॥శివశివ॥ 3
ఆఱురేకుల పువ్వు తుమ్మెదా - అది
మీఱిన వాసానె తుమ్మెదా
వేఱుసేయక నీవు తుమ్మెదా, శివు
జేఱి భజియించవె తుమ్మెదా
॥శివశివ॥ 4
యీళ పింగళలు తుమ్మెదా, సుషుమ్న
నాళి మధ్యమున తుమ్మెదా
మేలి మెఱిగేనీవు తుమ్మెదా, శివ
కేళి జరించావె తుమ్మెదా
॥శివశివ॥ 5
ఏడుగురు రాజులు తుమ్మెదా, జూడ
బండ్లు జోడు తుమ్మెదా, వట్టి
యాశ గోసివేసి తుమ్మెదా
మోసపోకు మంటి తుమ్మెదా, భక్తి
రాశి కెక్కుమంటి తుమ్మెదా
॥శివశివ॥ 6
అష్టదళముమీద తుమ్మెదా నీవు
మెట్టి చరించావె తుమ్మెదా
కష్టాము నెఱుగావె తుమ్మెదా, నీవు
స్రష్టవై యుండావె తుమ్మెదా
॥శివశివ॥ 7
తొమ్మిది వాకిళ్ళు తుమ్మెదా, నీవు
నమ్మి చరించావె తుమ్మెదా
ముమ్మూల కోణాల తుమ్మెదా నీవు
నెమ్మాది నుండావె తుమ్మెదా
॥శివశివ॥ 8
పది పదేనింటనూ తుమ్మెదా, వెండి
పదునొండు ఠావులను తుమ్మెదా
మెదలాక నిల్చినా తుమ్మెదా నిన్ను
కదిలించ గలరటే తుమ్మెదా
॥శివశివ॥ 9
ఎనసి తోటపువ్వు తుమ్మెదా నీ
వెనయ మానలేక తుమ్మెదా
దాని చేజిక్కినా తుమ్మెదా, తోట
వాని చేబడుదూవె తుమ్మెదా
॥శివశివ॥ 10
నింగినేల వేయు తుమ్మెదా
గంగ గవురు లేని నాడు తుమ్మెదా
పొంగుచును నొరబోడ? తుమ్మెదా వేయు
భంగులా నటియించు తుమ్మెదా
॥శివశివ॥ 11
వేయి రేకుల పువ్వు తుమ్మెదా అది
వెలుగూను జగమెల్ల తుమ్మెదా
సద్గూరు నడుగావె తుమ్మెదా పువ్వు
సద్య జూపూ నీకు తుమ్మెదా
॥శివశివ॥ 12
గురునాకు హరునాకు తుమ్మెదా, అం
తరువు లేదేమి తుమ్మెదా
గురుపాదపద్మాలు తుమ్మెదా, నిన్ను
దరిశించు మంటీని తుమ్మెదా
॥శివశివ॥ 13
గురుడు నీ శీరమూన తుమ్మెదా, మా
గురుడు నీ శిరసూన తుమ్మెదా
కరపద్మములు మోపి తుమ్మెదా
అరయ నేగంటీశుడుండు తుమ్మెదా
॥శివశివ॥ 14

ఈ పాటలో 'శివశివ...' అన్నది పల్లవి అనవచ్చును. ఈ పాట అన్నమయ్య సంకీర్తనలు, జయదేవుని అష్టపదులు వలెనే చరణము పల్లవి, చరణము పల్లవి, లతో సాగిపోయినది. ఆనాటికి అనుపల్లవి ఏర్పడలేదు.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - tummeda padamu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )