దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

ముందుమాట : శిరోమణి వేదాల తిరువేంగళాచార్యులు

ఏదేశంలోనైనా వాఙ్మయం పాడుకోవటానికీ ఊరికే చదువుకోవడానికీ వీలుగా ఉండడం మామూలు. ఇంతమాత్రానికే గేయవాఙ్మయమనీ, జానపద వాఙ్మయమనీ పెద్ద పెద్ద పేర్లు పెట్టినా, ఎన్ని విధాల మార్పులూ చేర్పులూ చేసినా ఇవన్నీ కూడా దాన్ని ఉపయోగించుకునే వాళ్ళను బట్టి వచ్చేవే కాని అసలు వస్తువులో మాత్రం ఏతేడా కాన్పించదు. చదివినా లేక పాడుకొన్నా ఆసాహిత్యంలోని వస్తువులో ఏవిధాన్నైనా మార్పు కల్గుతుందా? కల్గబోతుందా? అధవా కల్గిందా? ఇంకొకటి కూడా మనం బాగా పరిశీలిద్దాం. ఋగ్వేదం ప్రపంచంలోని అన్నిదేశాల్లోని అన్ని భాషల్లోని సాహిత్యం కంటే కూడా చిట్టచివరికి గాధిక్‌ భాష కన్నా కూడా చాలా వెనకటిదని అందరికీ తెలిసిందే. అందువల్లనే కదా సామవేదంలో పాడడానికి వాడబడేవి చాలా ఋగ్వేదంలో ఋక్కులే అని అంటారు. అయితే ఈ పాటలు ప్రాకృత జనుల వాడుక మాటల్లో ఉన్నవి కదా! ఋగ్వేదాదులట్లా లేవే అని సందేహిస్తారా? చూడండి ఋగ్వేదాదులు కూడా ప్రాకృతంలోవే. తెనుగువాడైన దండి మహాకవి ఈ విషయాన్ని తెగేసి చెప్పినాడు.

"సంస్కృతం నామ దైవీ వాగవ్యాఖ్యాతా మహర్షిభిః" అని కొన్నాళ్ళకు పాణినిలాంటి మహాఋషులు వెనుకటికాలపు మొదటి ప్రాకృతాన్ని అనగా ఋగ్వేదాదుల్లోని భాషను సంస్కరిస్తే సంస్కృతం అయిందట. ఈ విచారమంతా ఎందుకయ్యా అంటే సాహిత్యమంతా గేయంగానూ లోకుల వాడుకభాషల్లోనూ గూడా ఉండదగినదే అని చెప్పడానికి.

అయితే అట్లా ఉండనివి గూడా లేకపోలేదు. మచ్చుకి జయదేవుడి అష్టపదులు చూడండి. అవి అప్పుడు వాడుకలో లేని సంస్కృతం లో వ్రాసినవే. అవి అర్థంలో ఎంత అందంగా ఉన్నా శబ్ద స్వరూపంలో లోకులకు అందకుండా పోయింది. కనుకనే ప్రకృతంలోని యీ పాటలు ఏనాడు ఎవరు చెప్పినవోగాని అవి యెవ్వరి ప్రయత్నమూ అక్కరలేకుండానే ఇంత కాలంవరకూ నిలిచి వున్నవి. లోకుల నోళ్ళంట నానుతూ జీవంతో ఉన్నవి. పాటలు వ్రాసేవారందరూ ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలె.

పూర్వకాలంలో హాలుడనే చక్రవర్తి రెండువేల యేండ్లనాడు అనేకులు కైతగాళ్ళూ, కైతగత్తెలూ చెప్పిన పాడిన గాథలనుండీ ఏడువందలు కూర్చి మనజాతి వాడుకలూ, అలవాట్లనూ జీవనాన్ని ఇంకా ఇంకా అనేకాలనూ తేల్చి చెప్పాడు. అయితే ప్రకృతంలో పాటలు యేల పాటలు. అసలు "హేల" అనే సంస్కృతం మాట "ఏల"గా అయింది. "హేల-భావకరణే" అని ధాతువు. దీనివల్ల యేమి తేలుతుంది. భావాన్ని ఉద్బోధించేటి లేక భావోద్రేకాన్ని వెలువరించేటి పాటలు అన్న అర్థం ఏర్పడుతుంది. భావాలు ఎన్నో రకాలుంటవి.

"ఆపతి కాలాన భూపతిరాజూ అన్నంబు పెట్టాడె ఆదరించాడె" ఇది వడ్లు దంచేటపుడు పాడే పాట. దంపుడుపాటంటారు. ఇందులో ఆ భూపతిరాజు చేసిన ఉపకారం ఆపత్‌ కాలాన ఆదుకోడాన్ని జ్ఞాపకం తెచ్చుకొని స్మరిస్తారు. ఇట్లాగే "ఇల్లాలనీకేల యింత పోకిళ్ళూ గొల్లాడ నీకేల గొడుగునీవాళ్ళూ" దీంట్లో చక్కటి ఉపమానంతో మనసుకు తగిలేట్టు ఇల్లాళ్ళకు వెర్రి మొర్రి పోకిళ్ళు పనికి రావని చెప్పడం అయింది. ఈ విషయాన్నే భర్తృహరి ఇంకోతీరున తన కావ్యంలో తెల్పినాడు.

"ఇదమనుచిత మక్రమశ్చ పుంసాం । యదిహ జరా స్వపిమాన్మథా వికారాః
తదపిచనకృతం నితంబినీనాం । స్తనపత నావధి జీవితం రతం వా"

నిజంగా పరిశీలిస్తే సంస్కృతంలోనే కొంచెం మోటుగా వుందికాని పాటలో చాలా మృదువుగా సున్నితంగా వ్యంగ్యంగా అభిప్రాయం తెల్పబడింది. మరొకటి చూడండి.

"ఊరూర సీకటి యిరులూ, ఉత్తుత్తనె కదిలే కురులూ
ఊరిలోన రాసావోరూ, ఊ అంటెనె నరికేరూ,"

ఇందులో ప్రతిచోటా మొగముమీద ముంగురులు చెరలాడుతున్న పడుచుల వయ్యారాలు వాటిని చూడగానే మోహాంధకారం ముంచుకోవడం అనే శృంగారంలో కూడా ఈ అవినయ శృంగారాన్ని అనుభవించడానికి ఉండే అడ్డంకిని తెల్పడంలో రౌద్రం కూడ భయంకరంగా అంటే ప్రాణానికే మోసం కలుగుతుందన్నట్లుగా వ్యంగ్యం అయింది. ఇట్లాంటిదే చాలకాలం నాటి ప్రాకృతగాథల్లో ఉంది కాని యీ యేలపాట దానికంటె సభ్యమై చాలా గంభీరంగాను లోతుగాను నాజూకుగానువుంది. ఈ యిన్ని రకాల పాటలూ అన్నీ కూడా యేలపాటలే. అయితే యెట్లా ఏర్పడ్డాయో గాని వీటిలో కొన్ని యేలపాటలనీ, కొన్ని దంపుడుపాటలనీ కొన్ని సువ్వాలని కొన్ని జోలపాటలనీ ఇట్లా పంపకాలేర్పడ్డాయి. ఈ పుస్తకంలో అటువంటి పాటలు చాలా రకాలున్నాయి. రాట్నం పాటలు, కవ్వం పాటలు, పడవపాటలు, కోతల పాటలు, ఊడ్పు పాటలు, తుమ్మెద పదాలు, కోపులు, ఇట్లా ఒకటా? రెండా? అనేకరకాలున్నాయి. ఇవన్నీ తెల్గుదేశంలో ఇప్పుడూ వాడుకలో ఉన్నవే. క్రమంగా నాగరికత బలపడినకొద్దీ ఈ పాటలు అంతరించిపోతున్నవి. కారణమేమిటంటే పూర్వంలో ఏ కొద్దిమంది ప్రభువుల పెళ్ళాలోకాని మిగతా ఆడవాళ్ళంతా తమతమ ఇళ్ళల్లో వడ్లుదంచుకోవడం, పొలాల్లో పనులు చేసుకోవడం, గడ్డి కోసుకోవటం, పిండి విసురుకోవటం, మొదలైన పనులు చేసుకుంటూ వుండేవారు. ఏటికో, చెరువుకో, కాలువకో, కోనేటికో, బావికో, చెలమకో పోయి నీళ్ళు తెచ్చుకొనేవాళ్ళు. ఆయావేళల్లో ఆడవాళ్ళకు అప్రయత్నంగానే ఆయాభావాలతో పాటలు వాటంటత అవి నోటివెంట బయలుదేరి వస్తుండేవి. ఆయాసంఘటనలు, సంఘర్షణలు, సమావేశాలు, సందర్భాలు వీలు కొద్దీ ఏర్పడుతుండేవి. మంచెలమీద ఉండి చేలుకాయడానికి ఉన్న చిన్నచిన్న పిల్లలు, పడుచులు, గడుసరులు, అమాయికలు మొదలైన వాళ్ళకు కోడెగాళ్ళతో నానారకాల భావాల్నీ వ్యక్తం చేసే పదాలు ఆయాసమయాల్లో వాటంటత అవే బయలుదేరుతుండేవి. అవన్నీ యీనాడు పోయినవి. కొళాయినీళ్ళు, మరచియ్యాతా, కాఫీలతో సతమతమయ్యే ఆడవాళ్ళు వెన్నెలకే వడదాకి పోతున్నారు. దంపుళ్ళు వగైరాలు సెలవు తీసుకొన్నాయి. వెర్రితలలు వేసిన, వేస్తున్న యీ మాయదారి నాగరీకంలో మనజాతి అలవాటులన్నీ పోవడమేగాక జాతిలో ఉండే నీతి, స్వభావం, అందం, శృంగారం, ఉత్సాహం, మంపు, పెంపు, సొంపు, శక్తి, సామర్థ్యం, శౌర్యం, సాహసం, ధైర్యం, వీర్యం, పనిపాటల మీదిమోజు, నిజమైన చక్కదనాన్ని గ్రహించే తెలివి, ఆదరించేపాటి ఓర్పు, అభినందించేపాటి చేర్పు, అనుభవించేపాటి కూర్పు, ఆనందించేపాటి నేర్పు, నెమ్మదీ కూడా నశించిపోయినవి. అవన్నీ తలుచుకుంటే మనకు మళ్ళీ పడుచుదనం వస్తుంది. ఆనాటి ఆ సంగతులన్నీ కాకపోయినా కొన్నిటినైనా మనకీ యేలపాటలు జ్ఞాపకంలోకి తెచ్చి మన అనుభవంలోకి అందించి, మనకు అమృతంలా పనిచేసి మనను మళ్ళీ వెనుకటికాలపు మంచిమనుషులుగా తయారుచేయడానికి తప్పకుండా పనికివస్తవి.

ఈ పాటలు తెలుగు జాతిజీవనం అంతా కళ్ళకు గట్టేట్లుగా చూపుతవి. తెలుగుల బ్రతుకు అంతా వానదేవుడి నుండి వరికోతల దాకా, వ్యవసాయం నుండీ వీరత్వం దాకా, కాడి నుంచి కత్తి దాకా, ఇంతెందుకు తుడుము దగ్గరినుంచీ దేవతార్చన దాకా అద్దం వలె కనబరుస్తుంటాయి ఈ పాటలు. వీటిని తెలుగు వారందరూ ఆదరించి తీరవలసిందే. అభినందించవలసిందే. అనుభవించవలసిందే. ఆనందించవలసిందే.

శిరోమణి
వేదాల తిరువేంగళాచార్యులు

హైదరాబాదు
మన్మథ సంక్రాంతి
(1955- 56)

AndhraBharati AMdhra bhArati - pallepadAlu - muMdumATa : SirOmaNi vEdAla tiruvEMgaLAchAryulu - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra )