దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(పార్వతి అలంకారభూషితయై ఎక్కడికో పయనమయింది. చూశారు చెలికత్తెలు. వారిమధ్య సంవాదంగా సాగే ఈ పాటలో శివరూపం, పార్వతి అందచందాలు ప్రత్యక్షమవుతున్నాయి.)

001. గౌరి
ఘల్లు ఘల్లున పాద
గజ్జెలందెలు మ్రోయ
కలహంస నడకాల
కలికీ ఎక్కడికే?

జడలోనూ గంగానూ
ధరియించుకొన్నట్టి
జగములేలే సాంబ
శివుని సన్నిధికే.

బొడ్డూ మల్లెలు జాజి
దండాలు మెడనిండ
అందామెరిగిన జగ
దాంబా ఎక్కడికే?

అందాము వీభూతీ
అలరూ గంధామూ
నలచీన నీల
కంఠేసు సన్నిధికే.

తళతళమనూ రత్న
తాటంకములూ మెరయ
పసిడీమండలమూల
పణతీ ఎక్కడికే?

కలియుగ జన్మమూ
గలశివుడైనట్టీ
గురులైన శంభు
శంకరునీ సన్నిధికే.

హెచ్చుపాపటా బొట్టూ
రత్నాకిరీటమ్ము
ఏమమ్మ కరుణా
కటాక్షీ ఎక్కటికే?

కడుపెద్ద రుద్రాక్ష
మెడలో హారమూదాల్చీ
నందీనెక్కినా జగ
ధీసు సన్నిధికే.

ముఖమూన చిరునవ్వు
కల ఎరుపూ కుంకుమా
రేఖా వెలిసెడు లోకా
మాతా ఎక్కడికే?

కంఠాన కాల
కూటమ్ము ధరియించుకు
మండాలామేలే జగ
ధీశూ సన్నిధికే.

చెంగావి చీరలూ
చెంగూనా జారంగా
రంగైనా నవమోహ
నాంగీ ఎక్కడికే?

చంద్రుని శిరసూనా
ధరియించుకొన్నట్టి
మండలా మేలే
నందీశూ సన్నిధికే.

సన్నంపు నడుమూపై
బిళ్లాలా ఒడ్డాణము
మెరిసేటి బంగారూ
బొమ్మ ఎక్కడికే?

కన్నూలు మూడూ
భుజంబూలారూ
అంబాలుగల అర్థ
నారీశు సన్నిధికే.

అభయ హస్తములాచే
కరకంకణము రాజ
వరమూలిచ్చెడి వారు
గౌరీ ఎక్కడికే?
AndhraBharati AMdhra bhArati - gauri - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )