దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(గౌరమ్మ అంటే ఈశ్వరుని రెండవ భార్య. గౌరి! అనేక రూపాలలో ఈమెను పూజించుకొని, సౌభాగ్యము, ఆయుస్సులు కోరుతూ స్త్రీలోకం పాడుకొనే పాట యిది.)

002. గౌరమ్మ

శ్రీలక్ష్మీ నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మ!

భారతీ సతివయ్యు
బ్రహ్మ కిల్లాలివై
పార్వతీదేవివై
పరమేశు రాణివై
పరగ శ్రీ లక్ష్మివయ్యూ గౌరమ్మ
భార్యవైతివీ హరికినీ!

ముక్కోటి దేవతలు
చక్కనీ కాంతలూ
ఎక్కువగ నినుగూర్చి
పెక్కునోములు నోమి
ఎక్కువా నినుగొల్తురే గౌరమ్మ
ఇహ లోకములయందునా!

గొప్పయగు నీ ముద్దు
కొప్పింద్ర నీలములు
గప్పు చీకటి జగతి
గప్పు కొప్పున బిళ్ళ
చెప్ప తరమూ గానిదీ గౌరమ్మ
చంద్ర రేఖాపాటిదీ!

నిగనిగా యనెడు నీ
నగుమోము జూచితే
జగతి పున్నమనాటి
చంద్రుణి ఓడించు
సొగసైన నీ తిలకమూ గౌరమ్మ
చూచితే ఆనందమూ!

నల్లవరి బియ్యమో
మల్లె మొగలో లేక
తెల్ల వజ్రంబులో
ముల్లోకములు యేలు
తల్లి నీ దంతములు గౌరమ్మ
దానిమ్మ బీజంబులూ!

అదనుగా యిది టీకు
బొదలు నుదరంబుపై
ఎదజిమ్ము వలిపె
పయ్యెద లోన నూగారు
కదలనీ నల్లత్రాచూ గౌరమ్మ
ఘననాభి పొన్నపువ్వూ!

బాలలూ వృద్ధులూ
ప్రౌఢాంగనలు కన్నె
ప్రాయంపు కాంతలూ
పరగాశ్వయుజ శుద్ధ
పాడ్యమీ మొదలు కొనియు గౌరమ్మ
భక్తి నీయందు నిల్పి!

తొమ్మిదీ దినములూ
నెమ్మనంబున బొంగి
అమ్మలక్కలు గూడి
ఆస్తితో తమకున్న
సొమ్ములూ ధరియించుకా గౌరమ్మ
శోభనంబున పాడుచూ!

బంగారు పువ్వులూ
బ్రతుకమ్మ యనిపేర్చి
మంగళంబని నిన్ను
మధ్యనా నిల్పియు
రంగు గుమ్మడి పువ్వులా గౌరమ్మ
రాశిగా నర్పింతురూ!

కట్ల పుష్పంబులూ
కాకరా పువ్వులూ
కలగోటు పువ్వులూ
గన్నేరు పువ్వులూ
పొట్ల పువ్వులు జల్లుతూ గౌరమ్మ
బొగడ పువ్వులు నింపుచూ!

పారిజాతంబులూ
పైడి తంగెడి పూలు
గోరింట పొన్నలు
కురువింద మల్లెలు
తీరు రుద్రాక్ష పూలూ గౌరమ్మ
ఏరినా కుసుమంబులు!

పాల మీగడలట్లు
పానకంబులు జున్ను
పోళీలు మరి మడుగు
పువ్వులూ శేమియల్‌
మేలు శక్కర గరిజలూ గౌరమ్మ
మెప్పగా సమర్పింతురూ!

గంగ నర్మద యమున
కావేరి సరయూ
తుంగభద్రాద్రి ముచి
కుండనది తీరముల
పొంగి వేడుక మీరగా గౌరమ్మ
పురుషులూ స్త్రీలుగూడి!

కోరి ఈరీతిగా
జేరి పూజింతుము
చారు సుందరమైన
సౌభాగ్యముల నిచ్చి
కారుణ్యములనేలుమా గౌరమ్మ
కల్పాయు వొసగి మాకు!!
AndhraBharati AMdhra bhArati - gauramma - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )