దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(పిల్లలను తొట్టెలో పెట్టడం అనేది మనకు ప్రాచీన నమ్మకాలూ - ఆచారమూ కూడా. శ్రీరాములవారిని తొట్టెలో పెడుతున్నారు.)

004. శ్రీరాములవారి తొట్టె

శ్రీ వెలయు అయోధ్యలో
దశరథులు చెలగి వేడుకనుండగా
ఆ వనజనాభులపుడూ
భూమిలో అవతరింపుచునుందురు

పుత్రకామేష్టి వేల్వ
ఆ రాజపుత్రులను కోరగానూ
పాత్రతో పరమాన్నమూ
తెచ్చి ఆ పరమపురుషులకిచ్చిరీ

పరమాన్నమపుడు తెచ్చీ
ఆ రాజు పడతులకు యివ్వగానూ
సరగునా గర్భమునను
ఉదయించి సంతోషమునయుండిరీ

ఆరునెలలాయినను మా
కౌసల్యకపుడు శ్రీమంతమునకు
ఆరూఢిగా చేయరే
వశిష్టాదులందరూ దీవించిరీ

దశమమాసము వచ్చినా
కౌసల్య ప్రసవసమయమందునా
కుశలముగా ముగ్గురికినీ
సుఖముగా సుతులు నలుగురు కలిగిరీ

అప్పుడా రాజుతోనూ
ఈ వార్త చెప్పినా విన్నగానే
ఒప్పయిన వస్త్రములనూ
బహుమానమిప్పించి వుప్పొంగెనూ

రంగైన రత్నాలనూ
చెక్కించి బంగారు తొట్టెలకునూ
అంగనా మంచలా కొరకూ
దశరథులు అతివేడ్క నంపించిరీ

ఆణిముత్యపు చేరులూ
తొట్టెపై అసుమాన గిరికికట్టీ
పొలుపైన పూలసొరులూ
తొట్టెపై పూలు సింగారించిరీ

కనులగాటుగ దీర్చెనూ
రాములకు కడువేడ్కతో కౌసల్య
దిష్టిచుక్క మరిపెట్టే
రాములకు జగమెల్ల వెలుగుగాను

పసుపుకుంకం పువ్వులూ
మేలైన పన్నీరుగంధములనూ
పసిడితబుకుల వుంచుకో
సుమిత్ర సుభతులకు తా యిచ్చెనూ

పట్నీలు భాగాలనూ
మేలైన పండుటెంకాయలూనూ
పసిడితబుకుల వుంచుకో
సుమిత్ర సుభతులకు తా యిచ్చెనూ

నూరుగరిసెల సెనగలూ
నీళ్ళలో నానబోయించి తెచ్చి
వారిజాక్షులకు నెల్ల
కౌసల్య వాయనాలిప్పించెనూ

ముడ్డిక్రిందా సెనగలూ
కౌసల్య గొడ్రాళ్ళకిప్పించెనూ
కోరి కొడుకుల కనమనీ
కౌసల్య గొడ్రాళ్ళ దీవించెనూ

ఊచుమని యించులూచ
పాడమని పరమభాగవతులార
ఆడమని రంభలార
ఊయాలలూగుమా రంగశాయీ

సత్యస్వరూపుడమ్మా
ఈ బిడ్డ అచ్యుతానంతుడమ్మా
అత్యంత సుకుమారుడే
ఈ బిడ్డ ఆదినాయుడంద్రు

వటపత్ర శాయనుడమ్మా
ఈ బిడ్డ వైకుంఠపురివాసుడూ
పూర్ణంపు చంద్రుడమ్మా
ఈ బిడ్డని పూరుషోత్తముడందురూ

కరుణా కటాక్షుడమ్మా
ఈ బిడ్డ కంసునికి వైరి యితడూ
కుటిలకుంతల చూడరే
దశరథుల కోర్కెలీడేరెనమ్మా

చద్దులాడుచు కొందరూ
తమ తమా సుఖములను తెల్పుకొనుచూ
నిద్దరని ఉల్కిపడుచూ
ఉల్కిపడి పొద్దుపోయెననుకొందురూ

అప్పుడా దోవలోనూ
సెనగలూ ఒప్పుగా నమిలిచూసి
ఉప్పు లేదనుచు వనిత
మరి వనిత చప్పగా వున్నదనుచూ

శ్రీరామనామంబులూ
ఎవరైన జపము చేసిన చాలునూ
వారలకు భయమేటికే
వైకుంఠవాసులై తమరుందురూ

శ్రీరామతొట్టె యిపుడూ
ఎవరైన పాడినా, విన్నగానీ
సకలసంపదలు కలిగీ
సౌభాగ్యపదవితో తమరుందురూ.
AndhraBharati AMdhra bhArati - shriiraamulavaari toTTe - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )