దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(పరాత్పరులకే - అంతటి అనుమానాలూ అపనమ్మకాలూ వున్నప్పుడు సామాన్య మానవులలో అడుగడుగునా అపనమ్మకాలూ అవీ రావడం - విడ్డూర్యం కాదు కాని వింత అనుకోవాలి. విష్ణుమూర్తిని ఎలా నిలదీసి - అడుగుతుంది లక్ష్మి.)

005. లక్ష్మీ - విష్ణు సంవాదం

కలికి కవాటము
బంధన చేసిన
కారణమేమే లక్ష్మీ - నీకు
కారణమేమే లక్ష్మీ?

కారణమేమని
అడిగెవు నీమది
తెలియలేద ధవలాక్షా - మరి
తెలియలేద ధవలాక్షా.

తెలిసీ తెలియక
చెంతను చేరితి
పంతమేలనే లక్ష్మీ - నీకు
పంతమేలనే లక్ష్మీ?

కొంచెపు జాతని
చెంచిత సవతని
చింతదీరెనో సామీ - నాకు
చింతదీరెనో సామీ.

జిలుగుపు టేదల
చీరలు తెస్తిని
చెంత చేరవే లక్ష్మీ - నా
చెంత చేరవే లక్ష్మీ.

జిలుగుపు టేదల
చీరలు తెస్తే
చెంచీత చేరును పోవోయ్‌ - నీవు
చెంచీత చేరును పోవోయ్‌.

చేపట్టు చేల్వ బంగారు
రవికలు తెస్తినే
జాగుసేయ ధవలాక్షీ - నను
చేరనీయవే కమలాక్షీ.

జాల్వరు బంగరు రవికలు
చెంచీత కిచ్చిన
ఏలునుస్వామీ - నీవిచ్చిన
ఏలును స్వామీ.

ఇప్పపు బంతులు
ఇంపుగ దెస్తిని
ఇంపుగ యేలవె లక్ష్మి - నను
ఇంపుగ యేలవె లక్ష్మి.

ఇప్పపు బంతులు
ఇంతి చెంచితకి
ఇస్తే యేలును స్వామీ - నిను
ఇస్తే యేలును స్వామీ.

మల్లెపుబంతులు
మగువరొ తెస్తిని
మన్నించేలవె లక్ష్మీ - నను
మన్నించేలవె లక్ష్మీ.

మల్లెపుబంతులు
మగువ చెంచిత కిస్తే
మన్నించేలును స్వామీ - నిను
మన్నించేలును స్వామీ.

రవ్వలు చెక్కిన
రాగిడి తెస్తిని
రానియ్యవె ఓ లక్ష్మి - నను
రానియ్యవె ఓ లక్ష్మి.

రవ్వలు చెక్కిన
రాగిడితెస్తే
చెంచిత కివ్వగదోయీ - నివు
చెంచిత కివ్వగదోయీ.

గరిమిష్టమ్మున
గండభేరుండంబులు
గాసి పొందితినే భామా - నేను
గాసిపొందితినే భామా.

గండభేరుండంబులు
గాసి బొందితే
చెంచిత యేలును స్వామీ - నిను
చెంచిత యేలును స్వామీ.

శరణే శ్రీహరి శరణే లక్ష్మీ
శరణంటిని గైకొనవే - లక్ష్మీ
శరణంటిని గైకొనవే.

కొత్తపెళ్ళికొడుకువై నీవూ
వర్ధిల్లుము వసుదేవా - స్వామీ
వర్ధిల్లుము వసుదేవా.

పద్మగంధినీ పాదములకూ
వందనములు పదివేలే - లక్ష్మి
వందనములు పదివేలే.

నవ్వుతు శ్రీలక్ష్మి వాకిలి తీసెను
గడియెతీసె వరలక్ష్మి - అప్పుడే
గడియతీసె వరలక్ష్మి

మదనజనక తన
మగువని తోడుకొ
మందిరముల కేతెంచెన్‌ - లక్ష్మి
మందిరముల కేతెంచెన్‌.
AndhraBharati AMdhra bhArati - laxmii - viShNu saMvaadaM - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )