దేశి సాహిత్యము జానపద గేయములు సరాగాలు : ఎల్లోరా
(శివ - పార్వతుల మధ్య సాగే సంవాదం)

009. తలుపు దగ్గర పాట

శివభక్తులకే దయగలవాడను
శివుడందురు నా పేరూ - సాంబ
శివుడందురు నా పేరూ.

శివనామంబులు సకలెందుల కెల్లును
చేరికతో వుండవోయీ - శివ
చేరికతో వుండవోయీ.

వడిగినలందిన కుంతన లొసగెటి
ఉరపతి ధరుడనె గౌరీ - నే
ఉరపతి ధరుడనె గౌరీ.

ఉరపతి ధరుడవైతే యేలాయెను
వడలు కడకు పోవోయీ - శివ
వడలు కడకు పోవోయీ.

బలాన రాముడు బలసతి నడిగిన
బలిదుండుడనే గౌరీ - నే
బలిదుండుడనే గౌరీ.

బలి దుండుడవైతే యేలాయెను
భక్తులిళ్ళకు పోవోయీ - శివ
భక్తులిళ్ళకు పోవోయీ.

కొమరుగ గంగని జటలో నించుకు
కొమర జంగాన్నే గౌరీ - నే
కొమర జంగాన్నే గౌరీ.

కొమర జంగమైతే మాయెను
కొమరు లిండ్లకు పోవోయీ - శివ
కొమరు లిండ్లకు పోవోయీ.

కాశీలోపల మోక్షము లొసగెటి
గంగాధరుడనె గౌరీ - నే
గంగాధరుడనె గౌరీ.

వాశికి యేలాగైతిరిగే మిరు
వార్నాశివైవుండవోయీ - శివ
వార్నాశివై వుండవోయీ ...
AndhraBharati AMdhra bhArati - talupu daggara paaTa - sarAgAlu - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )